రివ్యూ: కొబ్బరిమట్ట

రివ్యూ: కొబ్బరిమట్ట
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, మహేష్ కత్తి, షకీలా తదితరులు
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: స్టీవెన్ శంకర్
నిర్మాత: సాయి రాజేష్ నీలం (స్టీవెన్ శంకర్)
సంగీతం: సయ్యద్ కమ్రాన్
సినిమాటోగ్రఫి: ముజీర్ మాలిక్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
బ్యానర్: అమృత ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2019-08-10
దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. సాయి రాజేష్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ: పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) గ్రామ పెద్దగా ఏదైనా అన్యాయం జరిగితే తన తీర్పును ఇచ్చి వారిని ఆదుకొంటాడు. ముగ్గురు భార్యలు, ముగ్గురు సోదరులు, ఇద్దరు చెల్లెలతో ఓ కుటుంబానికి పెద్దగా ఉంటాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆయన జీవితంలోకి కొడుకునంటూ అండ్రాయిడు (సంపూ) ప్రవేశించి పెద్దరికాన్ని నిలదీస్తాడు. పెద్దరాయుడు ఇంట్లోని పనిమనిషి (షకీలా) కొడుకుగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొంటానని శపథం చేస్తాడు.

కొబ్బరిమట్టలో ట్విస్టులు:
పెద్దరాయుడు, పనిమనిషికి గల సంబంధమేమిటి? ఆమెకు పెద్దరాయుడు ఎలాంటి ద్రోహం చేశాడు? ముగ్గురు భార్యలను ఎందుకు చేసుకొన్నాడు? అతి పెద్ద కుటుంబం బాధ్యతను తను ఎందుకు భుజానికి ఎత్తుకొన్నాడు? పెద్దరాయుడు తండ్రి పాపారాయుడికి ఎలాంటి ద్రోహం జరిగింది? పెద్దరాయుడుపై అండ్రాయుడు పగదీర్చుకొన్నాడా? పెద్దరాయుడుపై పడిన నిందలు తప్పని అండ్రాయిడు ఎలా నిరూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే కొబ్బరిమట్ట సినిమా కథ.

ఫస్టాఫ్ అనాలిసిస్
కొబ్బరి మట్ట తెలుగు సినిమాలోని కథలు, సన్నివేశాలపై విసిరిన విమర్శనాస్త్రం. పెద్దరాయుడు జీవితంలోని ప్రేమానురాగాలు, ఆప్యాయతలను ప్రదాన అంశంగా కథ సాగుతుంది. బలమైన సన్నివేశాలు, వాటికి తగినట్టుగా డైలాగ్స్ తోడవ్వడంతో హాస్యం తెర మీద బ్రహ్మండంగా పేలిందని చెప్పవచ్చు. సంపూ కోసం రాసిన డైలాగ్స్ ఆలోచింప జేసే విధంగా కాకుండా హాస్యాన్ని పుట్టించడంతో సినిమా సరదాగా సాగిపోతుంది. ప్రతీ ఫ్రేమ్‌లో కామెడీని భారీగా జోప్పించడంతో సెటైరికల్ సినిమాపై ప్రేక్షకులకు మంచి ఫీల్ కలుగజేస్తుంది. ఆండ్రాయిడ్ ఎంట్రీతో మూడున్నర నిమిషాల ఏకధాటి డైలాగ్స్ కేక పుట్టిస్తూ ఇంటెర్వెల్ పడుతుంది.

సెకండాఫ్ అనాలిసిస్
ఇక రెండో భాగంలో అండ్రాయిడు పాత్ర, పాపారాయుడు పాత్రలు హైలెట్ కావడంతో సినిమా మరింత రంజుగా సాగుతుంది. ఇక పాపారాయుడు ఫ్లాష్ బాక్ మరింత ఆసక్తిగా సాగుతుంది. చివర్లో వ్యగ్యంగా తీసిన క్లైమాక్స్ కడుపుబ్బా నవ్విస్తుంది. సెకండాఫ్‌లో కూడా డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. సెటైరికల్ సెంటిమెంట్ కూడా ఎబ్బెట్టుగా లేకుండా ఆమోదించే విధంగా ఉండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారిందని చెప్పవచ్చు.

పాజిటివ్ పాయింట్స్
సంపూర్ణేష్ బాబు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫి

నెగిటివ్ పాయింట్స్
రొటీన్‌, ఫార్ములాతో ఉండటం

దర్శకుడి ప్రతిభ:
పెద్దరాయుడు సినిమాను తీసుకొని రాసిన సెటైరికల్ కామెడీని ఎంచుకోవడంలోనే దర్శకుడు రొనాల్డ్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక సాయి రాజేష్ రాసిన మాటలు, స్క్రీన్‌ప్లే సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా సెటైర్లను కూడా కన్విన్స్ చేసే విధంగా, ఆమోదం లభించే విధంగా చేసిన తీరును అభినందించాల్సిందే. ఈ సినిమా వర్గాలను ముఖ్యంగా ఈ రకమైన జోనర్ల కథలను, సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు వీకెండ్‌లో మంచి వినోదమని చెప్పవచ్చు.

సంపూ పెర్ఫార్మెన్స్:
ఇక సంపూ యాక్టింగ్ విషయానికి వస్తే.. మూడు పాత్రల్లో కూడా బ్రహ్మండంగా అదరగొట్టాడు. పెద్దరాయుడు, పాపారాయుడు, అండ్రాయిడు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. ఇవన్నీ పక్కన పడితే డైలాగ్ డెలీవరి అద్భుతం అని చెప్పవచ్చు. ఎలాంటి వారసత్వం లేకుండా వచ్చి నటనలో తన సత్తాను చాటుకొంటున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సంపూలోని మరో కోణాన్ని చూడాలనే ఇంట్రెస్ట్ కలుగ జేసే విధంగా ఫెర్ఫార్మెన్స్ ఉంది. డ్యాన్సలు, ఫైట్లతో కూడా కడుపుబ్బా నవ్వించాడు

టెక్నికల్‌గా:
సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణం పోసింది. సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లడానికి కమ్రాన్ పనితీరు బాగా ఉపయోగపడింది. ఆడియో పరంగానే కాకుండా తెర మీద పాటలు చాలా బాగున్నాయి. సాయి రాజేష్ అనుసరించిన నిర్మాణ విలువలు భారీ బడ్జెట్ సినిమాను తలపించేలా ఉన్నాయి.

ఫైనల్‌గా..
తెలుగు సినిమాలపై సైటర్లు సంధిస్తూ గతంలో వచ్చిన హృదయకాలేయంకు కొనసాగింపు ప్రయత్నంగా కొబ్బరి మట్ట చిత్రం రూపొందిందని చెప్పవచ్చు. ఊహకు అందని కథనం, మాటలు, డిఫరెంట్ సంపూ బాడీలాంగ్వేజ్ ఈ సినిమాకు బలం. కేవలం వినోదాన్ని కోరుకొనే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మల్టీప్లెక్స్, బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఒకట్రెండు రోజుల్లో సినిమా కలెక్షన్ల రేంజ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే విధంగా ఉండటానికి అవకాశం ఉంది.

రేటింగ్: 3.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*