కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ విలన్

ఎలాంటి శిక్షణ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. విలన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ విలన్‌గా, మెయిన్ విలన్‌గా అనేక భూమికలు పోషించిన ఆజాద్ ఇప్పుడు తమిళ్‌, భోజ్‌పురి సినిమాలలో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ‘ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, శివకాశి, రాజాబాబు, అధినేత, శ్రీమన్నారాయణ, అధినాయకుడు, రాధ, రుద్ర ఐపీఎస్’ వంటి చిత్రాలలో విలన్‌గా మెయిన్ లీడ్ పాత్రలు చేసిన ఆజాద్.. పవన్ కళ్యాణ్ ‘గుబుంబా శంకర్’ చిత్రంలో మెయిన్ విలన్‌కు రైట్ హ్యాండ్‌గా చేశారు. ‘అధినేత, ఇంట్లో దెయ్యం నాకేం భయం, సీమశాస్త్రి’ చిత్రాలలో మెయిన్ విలన్‌గా చేసిన ఆజాద్.. శ్రీహరి నటించిన ‘సింహాచలం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండలంలోని అమ్రాదికుర్ధ్ గ్రామానికి చెందిన ఆజాద్ 1990లో హైదరాబాద్‌కు వచ్చి, ఓ జిమ్ సెంటర్‌ను నడిపారు. జిమ్ సెంటర్‌లోని ఓ కుర్రాడి ద్వారా యాంగ్రీమెన్ రాజశేఖర్‌తో పరిచయం పెంచుకుని, ఆయన సహకారంతో సినిమాలలోకి ప్రవేశించారు. ఇప్పటి వరకు 80 సినిమాలకు పైగా నటించిన ఆజాద్.. ‘అధినేత’ సినిమాకు బెస్ట్ విలన్ అవార్డు అందుకున్నారు.

కోలీవుడ్, భోజ్‌పురి చిత్రాలలో హీరోగా..
టాలీవుడ్‌లో విలన్‌గా దూసుకుపోతూనే తమిళ్, భోజ్‌పురి చిత్రాలలో హీరోగా చేసే అవకాశాలను అందిపుచ్చుకున్నారు ఆజాద్. ప్రస్తుతం ఆయన తమిళ్‌లో హీరోగా చేస్తున్న ‘నల్లవనుమ్ ఇళ్లై కెట్టవనుమ్ ఇళ్లై’ (తెలుగులో ‘నేను మంచోడిని కాదు చెడ్డోడిని కాదు’) చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే భోజ్‌పురిలో ‘జాంగ్లీ జాన్వర్’ చిత్రంలో హీరోగా చేస్తున్నారు.

కన్నడలో స్టార్ హీరోల చిత్రాలలో విలన్‌గా..
తెలుగు, తమిళ్, భోజ్‌పురినే కాకుండా కన్నడలో స్టార్ హీరోల చిత్రాలలో విలన్‌గా ఆయనకు అవకాశాలు వరించాయి. ప్రస్తుతం ఆయన కన్నడలో పునీత్ రాజ్ కుమార్, దర్శన్ చిత్రాలలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.
ఇలా నాలుగు భాషల్లో బిజీబిజీగా గడుపుతున్న ఆజాద్ తెలుగులో కూడా హీరోగా చేయాలనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో శ్రీహరిగారి లేని లోటు తీర్చాలనేది తన కోరికగా చెబుతున్నారు. ప్రేక్షకులను మెప్పించడం కోసం ఎంతటి కష్టమైనా సరే సంతోషంగా అనుభవిస్తానని, నటన అంటే తనకు అంత ఇష్టమని తెలిపారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*