విశ్వనాథ్‌ను కలిసిన కేసీఆర్.. సినిమాలు తీయాలని వినతి

హైదరాబాద్: కళాతపస్వి దర్శకుడు కే. విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందించే మరో చిత్రం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

విశ్వనాథ్ దర్శకుడయితే, నిర్మాణ పరమైన విషయాలు తాను చూసుకుంటానని మాటిచ్చారు.

విశ్వనాథ్ దంపతులను కేసీఆర్ పట్టువస్త్రాలతో సన్మానించారు.

ఫిల్మ్ నగర్‌లోని నివాసానికి వెళ్లిన కేసీఆర్‌కు విశ్వనాథ్, ఆయన భార్య జయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్, కోడలు గౌరి స్వాగతం పలికారు. కేసీఆర్, విశ్వనాథ్ మధ్య సినిమాలు, భాష, సాహిత్యం తదితర అంశాలపై గంటకు పైగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. తాను విశ్వనాథ్ అభిమానినని,

చిన్నప్పటి నుంచీ ఆయన సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పారు. విశ్వనాథ్ తీసిన ప్రతీ సినిమా చూశానని, శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటానని చెప్పారు.

దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశానని,

సినిమా చూసిన ప్రతీసారి విశ్వనాథ్‌ను ఓ సారి కలవాలనిపించేదన్నారు. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరిందని చెప్పారు.

విశ్వనాథ్ తీసే ప్రతీ సినిమా ఓ కావ్యంలాగా ఉంటుందని, ఆయన సినిమాలను తపస్సులా తీస్తారని, అందులో వాడే భాషగానీ, పాటలు గానీ, కళాకారుల ఎంపిక గానీ, సన్నివేశాల చిత్రీకరణ గానీ, సంభాషణలు గానీ ప్రతీదీ గొప్పగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు.

కుటుంబమంతా కూర్చుని చూసేలా ఉంటాయని, అందుకే ఇప్పటికీ వీలు దొరికితే ఆయన సినిమాలు చూస్తూ ఉంటానన్నారు. అభిమానమే తనను విశ్వనాథ్ దగ్గరకి తీసుకొచ్చిందని, ఆయన్ను కలవడం, మాట్లాడడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. విశ్వనాథ్ సినిమాలు రాక పదేళ్లయిందని,

సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదని, విశ్వనాథ్ మళ్ళీ సినిమా తీయాలని కేసీఆర్ సూచించారు.

సహాయకుల ద్వారా విశ్వనాథ్ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమని, దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం విశ్వనాథ్‌ను కోరారు.

కేసీఆర్ అడుగు పెట్టడంతో తమ ఇల్లు పావనమైందని, స్వయంగా సీఎం తమ ఇంటికి రావడం తమ అదృష్టమని విశ్వనాథ్ చెప్పారు.

రాత్రి తనతో ఫోన్లో మాట్లాడి, ఇంటికి వస్తున్నానని చెబితే, ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నారని అనుకున్నానని విశ్వనాథ్ తెలిపారు. కేసీఆరే మాట్లాడారని తేల్చుకున్నాక రాత్రి 12 గంటల వరకూ నిద్ర పట్టలేదన్నారు. కేసీఆర్ చేసే పనులను, ప్రజల కోసం తపించే ఆయన తత్వాన్ని టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నానని, నేరుగా చూడడం ఇదే మొదటి సారని విశ్వనాథ్ తెలిపారు.

గతంలో కేసీఆర్‌లాగే ఒకసారి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ మాట్లాడారని విశ్వనాథ్ గుర్తు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*