కారు ప్రమాదం: పొరబడ్డారు.. తరుణ్ కాదు రాజ్ తరుణ్

హైదరాబాద్: హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, హీరో తరుణ్‌కు గత రాత్రి కారు యాక్సిడెంట్ జరిగింది. గాయాలు అయ్యాయి, యాక్సిడెంట్ అనంతరం తరుణ్ వేరే కారులో ఎక్కి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. ఇలా నిన్నటి రాత్రి నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తరుణ్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. తనకు యాక్సిడెంట్ అయినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశాడు. తాను క్షేమంగా ఉన్నానని, తన కారు కూడా క్షేమంగానే ఉందని చెప్పాడు.

మరి ఇంతకీ యాక్సిడెంట్ జరిగింది ఎవరికి అంటే మరో హీరో రాజ్ తరుణ్‌కు. రాజ్ తరుణ్‌కు బదులు తరుణ్ అనుకుని పొరబడిన సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో తరుణ్‌కు యాక్సిడెంట్ అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. రాజ్ తరుణ్‌ తన వాల్వో కారులో హైదరాబాద్ కు వస్తున్న సమయంలో అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని సమాచారం.

ఆ సమయంలో రాజ్ తరుణ్ ఉన్న కారు నంబర్ (టీఎస్ 09 ఈఎక్స్ 1100)గా గుర్తించారు. అయితే యాక్సిడెంట్ నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన యువ హీరో వేరే కారులో ఎక్కి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడనేది తెలియలేదు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రాజ్ తరుణ్ గురించి వాకబు చేస్తున్నారు. అయితే రాజ్ తరుణ్ క్షేమంగానే ఉన్నాడని తెలుసుకున్న సినీ ప్రేమికులు కుదుటపడ్డారు.

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*