గోడ దూకి మరీ చిదంబరాన్ని పట్టుకున్న సీబీఐ

న్యూఢిల్లీ: మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం హైడ్రామా అనంతరం ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. న్యూఢిల్లీలోని జోర్ భాగ్‌లో ఉన్న చిదంబరం నివాసంలో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది.

చిదంబరం ఇంటి వద్ద ఉన్నారన్న సమాచారం తెలిసిన వెంటనే అటు సీబీఐ, ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కలిసి న్యూఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. కానీ అక్కడ చిదంబరం ప్రైవేట్ సిబ్బంది అడ్డుకోవడం, లోపలకు వెళ్లడం కుదరకపోవడంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు చిదంబరం ఇంటి గోడను ఎక్కి మారీ లోపలకు వెళ్లారు.

ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం విషయంలో ఢిల్లీ హైకోర్టు చిదంబరానికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో చిదంబరం చాలా కీలకమైన వ్యక్తి అని విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు భావించింది.

ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన తర్వాత బుధవారం సుప్రీం కోర్టును కూడా చిదంబరం ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం కూడా నో అనడంతో ఇక సీబీఐ, ఈడీ ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగాయి. కానీ ఆయన వారికి చిక్కలేదు. వెతుకుతుండగా సడెన్‌గా కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. తన తప్పేమీ లేదని, తాను ఏ నేరమూ చేయలేదని చెప్పారు.

అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న సీబీఐ, ఈడీ అధికారాలు ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. రేపు సీబీఐ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈ రోజు రాత్రి అధికారులు చిదంబరాన్ని విచారించే అవకాశముంది.

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*