జగన్ హిందూ వ్యతిరేకా? క్లారిటీ ఇచ్చిన అంబటి రాంబాబు

అమరావతి: జగన్ హిందూ వ్యతిరేకి అంటూ వచ్చిన కామెంట్లపై వైసీపీ నాయకులు అంబటి రాంబాబు స్పందించారు.

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముగ్గురి నుంచి ఈ కామెంట్లు వచ్చాయని చెప్పారు. ఒకరు కొత్తగా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కాగా మరొకరు బీజేపీ నాయకులు, మాజీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. ఇంకొకటి బీజేపీ అధికారిక వైబ్‌సైట్‌లో కూడా జగన్ హిందూ వ్యతిరేకి అంటూ ఆ జ్యోతి ప్రజ్వలన అంశాన్ని ప్రస్తావించారు అని రాంబాబు చెప్పారు.

అయితే ఆయన అసలు జరిగిన విషయం ఇదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్ గారు అమెరికాలో ఉన్నప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయలేదని, ఆయన హిందూ వ్యతిరేకి అన్న కామెంట్లను రాంబాబు ఖండించారు. అక్కడేదో విజువల్స్ చూడగానే, జగన్ హిందూ వ్యతిరేకి అంటూ వాస్తవాలు తెలుసుకోకుండా కామెంట్లు చేయడం తప్పని అన్నారు.

ప్రచారం చేస్తున్న ఆ వీడియోలో జగన్ గారు ఉన్న హాల్‌లో ఎలక్ట్రానిక్ జ్యోతి ప్రజ్వలన మాత్రమే చేయాలని, నూనెతో గాని, అగ్గిపుల్లలతో గానీ, ఒత్తులతో గానీ వెలిగించే సంప్రదాయం అక్కడ లేదని, అది చట్ట వ్యతిరేకమని జగన్ భావించారని రాంబాబు చెప్పారు. జస్ట్ ఎలక్ట్రానిక్ పరికరాన్ని టచ్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వెళ్లిపోవాలని, జగన్ గారు అదే పని చేశారని చెప్పారు.

కమలదళంలో, కమల వనంలో ఉన్నటువంటి పచ్చ పుష్పాలే ఈ విధంగా కామెంట్లు చేస్తున్నాయని విమర్శించారు. మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నడి బొడ్డున 40 పురాతన దేవాలయాలను చంద్రబాబు గారు కొట్టేస్తుంటే ఏమి చేశారని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు చర్యలను ఎందుకు ఖండించలేదని అన్నారు.

కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడమని నిండు మనసుతో పరిపాలన చేస్తామని తమ మ్యానిఫెస్టోలో చెప్పడం వల్లనే తమను ప్రజలు గెలిపించారని రాంబాబు అన్నారు. కొత్తగా బీజేపీ పార్టీలోకి పచ్చ రక్తం వచ్చిన కారణంగా బీజేపీ వారు తమ ఒరిజినాలిటీని కోల్పోతున్నారని, కమలదళంలో పచ్చ పుష్పాలు ఉన్నాయని అంబటి రాంబాబు అన్నారు.

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*