కీసర రామకృష్ణ మిషన్‌ కేంద్రంలో తొలి యూత్ క్యాంప్‌ సూపర్ హిట్

శారదానగర్‌: కీసర రామకృష్ణ మిషన్ కేంద్రంలో తొలిసారిగా యూత్ క్యాంప్ జరిగింది. కీసరకు చెందిన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు క్యాంప్‌కు హాజరయ్యారు. స్వామి రంగనాథానంద ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి మూడొందల మంది విద్యార్ధులు హాజరయ్యారు. రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి బుద్ధిదానంద, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యక్తిత్వ వికాసం- విద్యా విలువలు అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఆత్మవిశ్వాసం, ఆత్మ పరిశీలన, వ్యక్తిత్వ వికాసం, శీల నిర్మాణం తదితర అంశాలపై స్వామి బోధమయానంద ప్రసంగించారు. ఈ నెల 29న ప్రారంభమైన ఫిట్ ఇండియా ఉద్యమం గురించి కూడా ప్రస్తావించిన బోధమయానంద శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉండాల్సిన ప్రాధాన్యతను వివరించారు. ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి స్వామి వివేకానంద నొక్కి చెప్పారని బోధమయానంద గుర్తు చేశారు.

 

అనంతరం జరిగిన గ్రూప్ డిస్కషన్‌లో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ ఏఎస్ బాలాజీ గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తూ విద్యార్ధులతో యాక్టివిటీస్ చేయించారు.

 

కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు భోజన ప్రసాదం అందజేశారు. స్వామి వివేకానంద సాహిత్యాన్ని విద్యార్ధులకు బహుమతిగా అందించారు. ఇదే క్యాంపస్‌లో ఉన్న వివేకానంద బుక్ వరల్డ్ నుంచి విద్యార్ధులు పెద్ద ఎత్తున స్వామి వివేకానంద సాహిత్యాన్ని కొనుగోలు చేశారు.

 

క్యాంప్ ముగింపు సమయంలో మాట్లాడిన విద్యార్ధులు రమణీయమైన ప్రకృతి నడుమ సాగిన క్యాంప్ తమలో మంచి పరివర్తనను తీసుకొచ్చిందని చెప్పారు. స్వామీ వివేకానందుడి స్ఫూర్తి నింపుకుని వెళ్తున్నామన్నారు. కీసర రామకృష్ణ మిషన్‌లో తొలిసారిగా నిర్వహించిన యూత్ క్యాంప్‌కు అనూహ్య స్పందన రావడంతో మిషన్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వాలంటీర్లు సాయి బాలాజీ, లక్ష్మీ అమ్మ, రాఘవేంద్ర, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*