శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సింగపూర్‌లో భాగవత జయంత్యుత్సవ సంబరాలు”

సింగపూర్ లో ఆగష్టు 31వ తేదీ శనివారం నాడు కృష్ణాష్టమి సందర్భంగా, “తెలుగు భాగవత ప్రచార సమితి” మరియు “గణనాలయము” సంస్థల వారు భాగవత జయంత్యుత్సవం 2019 ఎంతో ఆకర్షణీయంగా నిర్వహించారు.

సింగపూర్ లో మూడవసారి జరుగుతున్న ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సింగపూర్ వాసులు ఉత్సాహంగా పాల్గొని, ఎంతో ఆనందించారు. కార్యక్రమం Facebgokలో ప్రత్యక్ష ప్రసారం చేయడం వలన 1500 మందికి పైగా భాగవత బంధువులు, అభిమానులు ఎందరో ప్రపంచం నలుమూలలనుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సనాతన హిందూ ధర్మానికి తలమానికమైన “శ్రీమద్భాగవత” గ్రంధంలోని భక్తితత్వం ప్రతిఒక్కరికి అన్నికాలాలలోనూ ఆదర్శప్రాయము కావాలనే సంకల్పంతో, మన పోతన తెలుగు భాగవతం మరింత ప్రాచుర్యంలోనికి తెచ్చే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం గమనార్హం.
పిల్లలలో కూడా భాగవత తత్వం పట్ల ఆసక్తి పెంచేవిధంగా వారికి భాగవత ఇతివృత్తానికి సంబంధించిన పద్యాల / కథల పోటీలను నిర్వహించారు.

పిల్లలను పెద్దలను అలరించే విధంగా ఉన్న ఈ కార్యక్రమంలో భక్తి పాటలు, పిల్లల పాటలు, కధలు, నృత్యరూపకం అలాగే భాగవత పారాయణం వంటి ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో కృష్ణాష్టమిని సింగపూర్ వాసులు అందరూ కలిసి వైభవోపేతంగా జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారు. భాగవతం లోని చక్కటి పద్యాలను, కధలను చిన్నారులు చదివి అందరినీ అలరించారు.

కార్యక్రమము అనంతరం పాల్గొన్న భక్తులు అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.

ఈ కార్యక్రమ ముఖ్యఅతిథిగా ప్రముఖ వక్త, ఉపనిషత్తులలో పట్టభద్రుడు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాలకు డీజీపీగా పదవీవిరమణ చేసిన, Dr కరణం అరవిందరావు గారు విచ్చేసి తమ అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. రుక్మిణీ కళ్యాణానికి ఉన్న ప్రాముఖ్యతనే కాక, అందులో ఎంతటి వేదాంత సారాంశం ఉందోకూడా అందరికీ అర్ధమయ్యే రీతిలో తమ ప్రసంగం ద్వారా చక్కటి విశ్లేషణ చేశారు.

భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ అధ్యక్షులు ఊలపల్లి భాస్కర కిరణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని పలువురు ప్రముఖులు, రత్నకుమార్ గారు, ఇండిక్ అకాడమీ స్థాపకులు హరి కిరణ్ గారు, సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. భరద్వాజ్ గారు, లావణ్య, విద్యాధరి, ఉమాదేవి, వేణు మల్లవరపు, సురేష్ చివుకుల, అపర్ణ తదితరులు కూడా పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*