*ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు*

*ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు*

*కొత్త‌గా మ‌రో 4 ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవల‌ు ప్రారంభం*

*అందుబాటులోకి మొబైల్ యాప్‌, వెబ్‌సైట్‌*

*ఆన్ లైన్ లో ఆర్జిత పూజలు, దర్శనం, గదుల బుకింగ్‌, ఇతర సేవలు*

*భ‌క్తుల సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట‌*

*ఆన్ లైన్ సేవ‌ల‌ను ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల‌*

హైద‌రాబాద్ సెప్టెంబ‌ర్ 5: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌సిద్ధి చెందిన పుణ్య‌క్షేత్రాల్లో భ‌క్తుల సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తుంద‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బొగ్గుల‌కుంటలోని దేవాదాయ శాఖ కార్యాల‌యంలో కొత్త‌గా మ‌రో 4 ప్ర‌ధాన ఆల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌ల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. కొండ‌గ‌ట్టు అంజ‌నేయ స్వామి, ధ‌ర్మ‌పురి ల‌క్ష్మిన‌ర్సింహా స్వామి, వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళీ, జూబ్లిహిల్స్ పెద్ద‌మ్మ‌త‌ల్లి ఆల‌యాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రంలోని ఆల‌యాల్లో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుంద‌ని, ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్తులకు మెరుగైన సౌకర్యాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. తొలివిడతలో యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, మహంకాళి, బల్కంపేట, కర్మన్‌ఘాట్‌ ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామ‌ని వెల్ల‌డించారు. దీంతో మొత్తం 11 ప్ర‌ధాన ఆల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌లు అందుబాలోకి వ‌చ్చాయ‌న్నారు. “T APP FOLIO” మొబైల్‌ యాప్‌, మీ సేవా ఆన్ లైన్ పోర్ట‌ల్ ద్వారా సుప్ర‌భాతం,అభిషేకం,అర్చ‌న‌, వ్ర‌తాలు,హోమాలు, వాహన సేవ‌లు, దర్శనం, గదుల బుకింగ్, ఇతర సేవలను పొందవచ్చని వివరించారు. ఆన్ లైన్ లోనే విరాళాలు చెల్లించ‌వ‌చ్చ‌న్నారు. ఆన్ లైన్ లో సేవ‌లు అందుబాటులోకి తేవ‌డం వ‌ల్ల భ‌క్తుల విలువైన స‌మ‌యం ఆదా అవుతుంద‌ని, పార‌ద‌ర్శ‌కతతో పాటు ద‌ళారుల ప్ర‌మేయం లేకుండానే సుల‌భ ద‌ర్శ‌నంతో పాటు ఇత‌ర సేవ‌లు పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, సంబంధిత ఆలయ ఈవోలు, ఐటీ అండ్ సీ సిబ్బంది పాల్గొన్నారు

*వేముల‌వాడ గుడి చెరువులోకి కాళేశ్వ‌రం జ‌లాలు*

*కొరియ‌ర్ సేవ‌ల ద్వారా వేముల‌వాడ రాజ‌న్న ప్ర‌సాదం*

అదేవిధంగా ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆల‌యాల‌ను అభివృద్ది చేయ‌డంతో పాటు ఆల‌య ఉద్యోగులు, అర్చ‌కుల సంక్షేమానికి ఎంత‌గానో కృషి చేస్తున్నార‌ని తెలిపారు. యాదాద్రి,వేముల‌వాడ ఆల‌యాల అభివృద్ది ప‌నులు వేగంగా జరుగుతున్నాయ‌న్నారు. వేముల‌వాడ గుడి చెరువు అభివృద్ది ప‌నులు పూర్త‌య్యాయ‌ని, కాళేశ్వ‌రం జ‌లాల‌ను మిడ్ మానేరు ద్వారా గుడి చెరువులోకి గురువారం (రేపు) నీటిని వ‌దులుతామ‌ని చెప్పారు. వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ప్రసాదాన్ని కొరియ‌ర్ ద్వారా భక్తులు కోరుకున్న చోటుకు పంపుతామ‌న్నారు. రేప‌టి నుంచి కొరియ‌ర్ ద్వారా ప్ర‌సాదాన్నిపంపిణీ సేవ‌ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులోకి తేస్తామ‌ని వెల్ల‌డించారు.

*ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు*

*ఆన్ లైన్ లో ఆల‌య భూముల వివ‌రాలు*

*దేవుళ్ల పేరిట‌ పట్టాలు*

ఆలయ భూముల పరిరక్షణకు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. స‌మ‌గ్ర భూ స‌ర్వేలో భాగంగా ఆల‌య భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న చేశామ‌న్నారు. క‌బ్జాకు గురైన కొన్ని భూముల‌ను గుర్తించి …వాటిని ఆధీనంలోకి తీసుకున్నామ‌ని తెలిపారు. మొత్తం 82 ఎక‌రాల ఆల‌య భూములు ఉన్న‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు గుర్తించామ‌ని, మ‌రికొన్ని ఆల‌య భూముల రికార్డుల ప్ర‌క్షాళ‌న కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు. సీసీఎల్ఎ స‌హాకారంతో ఆల‌య భూముల వివ‌రాల‌ను ఆన్ లైన్ పొందుప‌రుస్తున్నామ‌ని చెప్పారు. భూ రికార్డుల వివరాలను అన్‌లైన్‌ చేసి దేవుడి పేరుతో పట్టాలు ఇవ్వడంతో భవిష్యత్త్‌లో వాటిని ఇతరులు మార్చుకునే అవకాశం ఉండదని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆల‌య భూములు అన్యాక్రాంతం కాకుండా చూడొచ్చ‌న్నారు. ఆలయ భూములను సర్వే చేసి ఖాళీగా ఉన్న‌ 14,227 ఎక‌రాల ఆల‌య భూముల్లో 856 సైన్ బోర్డుల‌ను ఏర్పాటు చేశార‌న్నారు. 21,339 ఎక‌రాల‌కు గ‌తంలోనే పాస్ బుక్ లు జారీ అయ్యాయ‌ని, త్వ‌ర‌లోనే 59,898 ఎక‌రాల‌కు
ఆల‌య దేవుళ్ళ పేరిట ప‌ట్టా పాస్ బుక్ జారీ కానున్నాయ‌ని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*