
హైదరాబాద్: యువత సోషల్ మీడియాకు ఎడిక్ట్ కావొద్దని, అంతకన్నా స్వామి వివేకానంద వంటి మహనీయుల సాహిత్యాన్ని, ఆత్మకథలను చదువుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 సంవత్సరాలైన సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేశారు.
రామకృష్ణ మఠం స్వాములు, వివిధ పాఠశాలల విద్యార్ధులు, భాగ్యనగర యువకులు స్వామి వివేకానంద చికాగో ప్రసంగాన్ని చదివాక సజ్జనార్ మాట్లాడుతూ 125 సంవత్సరాల క్రితమే స్వామీజీ పరమత సహనం గురించి అన్ని మతాల సారం ఒక్కటేనని చెప్పారని గుర్తు చేశారు. యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సోషల్ మీడియా మాయలో పడి సమయం వృధా చేసుకోరాదని చెప్పారు.
జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలన్న స్వామి వివేకానంద పిలుపును అందిపుచ్చుకోవాలని సజ్జనార్ యువతను కోరారు. కార్యక్రమంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద, రామకృష్ణ ప్రభ సంపాదకులు పరిజ్ఞేయానంద, సైకాలజిస్టులు విశ్వనాధం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment