కృషిభారతం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వృషభోత్సవం

హైదరాబాద్: కృషిభారతం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వృషభోత్సవం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయంలో కోడెద్దులకు ఎంత ప్రాధాన్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైతు కుటుంబంలో అవి ఓ భాగమైపోతుంటాయి. సంక్రాంతి సమయంలో పశు సంపదకు పూజలు చేస్తుంటారు కూడా. తమకు అండగా ఉంటున్న పశువులపై రైతులు ఆ విధంగా కృతజ్ఞత చాటుకుంటారు. కార్తీక మాసం తొలిరోజు వృషభోత్సవం నిర్వహించడం భారతీయులకు ఆనవాయితీగా వస్తోంది. కోడెల కొమ్ములకు తైలం పూసి.. పసుపురాసి.. శ్యామతీగతో ప్రత్యేకంగా అలంకరించి.. ఊరంతా తిప్పేవారు. దీన్నే ‘లగుడ ప్రతిపద’ అని అంటారు.

సనాతన సంప్రదాయంలో భాగమైన ఈ ఆచారాన్ని పునఃప్రతిష్ఠించేందుకు కృషి భారతం సంస్థకు చెందిన కౌటిల్య కృష్ణన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలను, ఆధ్యాత్మిక సంస్థలను, పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వృషభోత్సవం నిర్వహించేందుకు అంతా ముందుకు వస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా వృషభోత్సవం జరపనున్నారు.

ఈ నెల 29న కార్తీకమాసం తొలి రోజు తమ తమ బస్తీల్లో, గ్రామాల్లో, డైరీ ఫారమ్స్‌లో, మందిరాల్లో నిర్వహించాలని కృషి భారతం పిలుపునిచ్చింది. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను krishibharatham ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లకు పంపాలని విజ్ఞప్తి చేశారు. 8686743452 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. అయితే కేవలం దేశీయ గిత్తలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రమే పంపాలని కౌటిల్య కృష్ణన్ స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*