ఈ నెల 29న చిలుకూరులో వృషభోత్సవం

హైదరాబాద్: కృషి భారతం ఆధ్వర్యంలో అక్టోబర్ 29న జరగనున్న 2019 వృషభోత్సవానికి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ మద్దతు పలికారు. గోమాతతో పాటు అంతే సమానంగా వృషభాన్ని పూజించి గౌరవించాలని ఆయన సూచించారు. చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఈనెల 29న వృషభోత్సవం జరుపుతామని ఆయన తెలిపారు. ఈనెల 29న తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా వృషభోత్సవం జరగనుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కృషి భారతం వ్యవస్థాపకులు శ్రీ కౌటిల్య కృష్ణన్ తెలిపారు. వృషభోత్సవం జరిపేందుకు ముందుకు వచ్చిన రంగరాజన్‌కు కౌటిల్య ధన్యవాదాలు తెలిపారు. వృషభోత్సవానికి మద్దతుగా సెల్ఫీ విత్ వృషభంకు యువకులు, రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంపై కౌటిల్య హర్షం వ్యక్తం చేశారు. వృషభోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామన్నారు.

వ్యవసాయం ప్రధానంగా ఉన్న భారత్‌లో ఆది నుంచీ కోడెద్దులను పూజించడం ఆనవాయితీగా ఉండేదని కౌటిల్య కృష్ణన్ తెలిపారు. రైతు కుటుంబంలో భాగమై ఉండే కోడెద్దులకు, తమకు అండగా ఉంటున్న పశువులకు పూజలు చేయడం ద్వారా రైతులు కృతజ్ఞత చాటుకుంటారని చెప్పారు. కార్తీక మాసం తొలిరోజు వృషభోత్సవం నిర్వహించడం భారతీయులకు ఆనవాయితీగా వస్తోంది. సనాతన సంప్రదాయంలో భాగమైన ఈ ఆచారాన్ని పునఃప్రతిష్ఠించేందుకు కృషి భారతం సంస్థకు చెందిన కౌటిల్య కృష్ణన్ ప్రయత్నిస్తున్నారు.

ఈ నెల 29న కార్తీకమాసం తొలి రోజు తమ తమ బస్తీల్లో, గ్రామాల్లో, డైరీ ఫారమ్స్‌లో, మందిరాల్లో నిర్వహించాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను krishibharatham ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లకు పంపాలని విజ్ఞప్తి చేశారు. 8686743452 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కౌటిల్య కృష్ణన్ కోరారు. అయితే కేవలం దేశీయ గిత్తలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రమే పంపాలన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*