ప్రదాని మోదీని పవార్ అందుకే కలిశారా?

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు కావొస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ పార్టీకూడా స్పష్టమైన ప్రకటన చేయలేకపోతోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.

ఎన్నికల్లో 56 సీట్లు సాధించిన శివసేనకు తొలి రెండున్నరేళ్లు, మిగతా రెండున్నరేళ్లు ఎన్సీపీకి సీఎం పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చించారు. అయితే సీఎం అభ్యర్ధి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం సీఎం సహా మొత్తం 43 మంది క్యాబినెట్‌లో ఉంటారు. శివసేనకు 16, ఎన్సీపీకి 15, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. కాంగ్రెస్ ఎన్సీపీల నుంచి డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారు. కాంగ్రెస్ లేదా ఎన్సీపీకి స్పీకర్ పదవి ఇస్తారు. బుధవారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోదీని కలుసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. పవార్ ప్రధానితో భేటీ అయిన సమయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. అయితే తాను రాజకీయాలు చర్చించడానికి కలవలేదని, రైతాంగ సమస్యలపై చర్చించానని చెప్పారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా వివరాలు తెలిపారు.

 

 

అయితే పవార్‌ను ప్రధాని ఇప్పటికే ప్రశంసించిన నేపథ్యంలో ఆయన్ను యూపిఏ నుంచి ఎన్డీయేలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే సాధ్యమైతే అటు శివసేనకు, కాంగ్రెస్‌కు చెక్ పెట్టినట్లవుతుందని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది. 56 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 105 చోట్ల గెలిచింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలిచాయి. ఇతరులు 29 చోట్ల గెలిచారు. కూటమిగా పోటీ చేసిన శివసేన ఫలితాలు రాగానే ఎన్సీపీ పంచన చేరినట్లే ఎన్సీపీ కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీ చెంత చేరే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎన్సీపీ అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన సర్కారు ఎక్కువ కాలం అధికారంలో ఉండకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ అన్నారు. ప్రభుత్వంపై భగవంతుడు కూడా గ్యారంటీ ఇవ్వలేడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మల్లేశ్, రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*