చైనా సంచలన ప్రకటన… రష్యాలోని వ్లాదివోత్సోక్ నగరం తమదే అంటోన్న డ్రాగన్

బీజింగ్: భారత్‌తో ఓ పక్క ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే చైనా సంచలన ప్రకటన చేసింది. రష్యాలోని వ్లాదివోత్సోక్ నగరం తమదేనని చైనా అంటోంది. 1860కి ముందు వ్లాదివోత్సోక్ నగరం తమదిగా ఉండేదని వెల్లడించింది. చైనా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీజీటీఎన్‌ సంపాదకీయంలో దీన్ని ప్రకటించింది. రష్యా తమ నుంచి బలవంతంగా లాక్కొందని తెలిపింది. అక్రమ ఒప్పందంతో వ్లాదివోత్సోక్ నగరాన్ని ఆక్రమించుకుందని సీజీటీఎన్‌ సంపాదకీయం వెల్లడించింది. ఒకప్పుడు వ్లాదివోత్సోక్ నగరం హైషెన్‌వాయిగా పిలవబడేదని సీజీటీఎన్ ఇంఛార్జ్ షెన్ షివై ట్వీట్ చేశారు.

చైనా ప్రభుత్వ అనుమతితోటే ఈ సీజీటీఎన్ ఈ ప్రకటన చేసింది. దీంతో చైనా గూఢచర్యం విషయంలో కొంత కాలంగా రష్యాతో దెబ్బతిన్న సంబంధాలు మరింత పతనం కానున్నాయి. దీనికి తోడు భారత్‌కు రష్యా పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాలు, క్షిపణి రక్షక వ్యవస్థలు అందిస్తోంది. భారత్ తమను లక్ష్యంగా చేసుకుంటుందని తెలిసి కూడా ఆయుధాలు సరఫరా చేయడంపై చైనా గుర్రుగా ఉంది.

భారత్ సహా తన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో గొడవపడుతున్న చైనా తాజాగా రష్యాలోని వ్లాదివోత్సోక్ నగరం తమదే అని చెప్పడం ద్వారా కలకలం రేపింది. రష్యాతోనూ ఢీ కొనేందుకు డ్రాగన్ సిద్ధపడుతోంది.

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నప్పటినుంచీ భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాలూ వేలాది మంది సైనికులను మోహరించాయి. చైనాకు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు భారత్ అత్యాధునిక విమానాలను, ఆయుధాలను, క్షిపణులను సమకూర్చుకుంటోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*