రాయదుర్గంలో మల్కం చెరువు , మైసమ్మ గుడిలను కాపాడండి: బీజేపీ

హైదరాబాద్: భాగ్య నగరంలో చెరువుల అభివృది పేరుతో వాటిని పూడ్చివేసే పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. పర్యావరణం, ప్రజారోగ్యం కాపాడటం కోసం చెరువులను మరింత లోతుగా చేసి, చుట్టూ కంచె వేసి, వాటిని ఆక్రమణల నుండి కాపాడవలసింది పోయి, రియల్ ఎస్టేట్ వారి ఉపయోగం కోసం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.

తాజాగా రాయదుర్గలోని మల్కం చెరువు అభివృద్ధి పేరుతో చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా చెరువు కట్టపై ఉన్న వందల సంవత్సరాల నాటి మైసమ్మ గుడిని తరలిస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్లన ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బ తింటున్నాయి.

చెరువు కట్టపై ఉండడంతో ఆ గుడిని కట్టమైసమ్మ అని పిలుస్తున్నారు. ఇప్పుడు కట్టపై నుండి తొలగించి, మరెక్కడో పెడితో అది పక్క వూరు (మణికొండ జాగీరు) మైసమ్మ అవుతుంది గాని కట్ట మైసమ్మ ఎట్లాగూ అవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై అధికారులు స్థానిక ప్రజల విశ్వాసాలను పరిగణలోకి తీసుకొనక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.

కట్ట మైసమ్మ ఆ చెరువును, గ్రామాన్ని కాపాడుతుందని వందల ఏళ్లుగా స్థానికుల విశ్వాసం. వారి విశ్వాసాన్ని గౌరవించాలని కోరుతున్నాము. ఇప్పుడు అక్కడ కొత్తగా రహదారి అవసరమని స్థానికులు ఎవ్వరు కోరడం లేదు కూడా.

ప్రభుత్వానికి నిజంగా శ్రద్ద ఉంటె చెరువు పూడికలు తీసివేసి, నీరు బాగా నిల్వ ఉండేటట్లు చేయాలి. హై కోర్ట్ ఆదేశానికి విరుద్ధంగా చెరువు కంచెను దూరంగా జరిపారు. దానిని యధాస్థానంలో ఉంచాలని కోరుతున్నాము. రోడ్ వేయాలని అనుకొంటే చెరువు కు కొంచెం దూరంగా వేయవచ్చని సూచిస్తున్నాము.

ఆ గ్రామంలో ఉన్న సుమారు 80 మత్స్యకారుల కుటుంబాలకు ఆ చెరువు చాలాకాలంగా జీవనోపాధి కల్పిస్తున్నది. ఇప్పుడు చెరువును పూడ్చివేసె పనులు చేస్తుండడంతో తాము ఉపాధి కోల్పోతామని వారంతా ఆందోళన చెందుతున్నారు. వారి జీవనానికి ప్రభుత్వమే భరోసా కల్పించాలని కోరుతున్నాము.

చెరువు వద్ద ఉన్న స్మశాన వాటికను తరలించే ప్రయత్నాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. ఎవ్వరి కోసం ఇవ్వన్నీ చేస్తున్నారో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

చెరువులో మార్పులు, చేర్పులు చేయడానికి, 100 అడుగుల రోడ్ వేయడానికి ఎవ్వరు అనుమతి ఇచ్చారో ముందుగా చెప్పాలి. చెరువు అభివృద్ధి అంటూ ఏమైనా ప్రణాళిక వేసి, సంబంధిత శాఖల అనుమతి పొందారా? ఈ విషయమై ఏదైనా మాస్టర్ ప్లాన్ రూపొందించారా? ఆ విధంగా చేసి ఉంటె వాటన్నింటిని బైట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము.

ప్రజల మనోభావాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఈ చెరువు విషయంలో ప్రభుత్వం తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని హితవు చెబుతున్నాము. చెరువును కాపాడేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

-గజ్జల యోగానంద్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి ఇన్‌ఛార్జ్

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*