నిర్మలను కాలనాగుతో పోల్చిన మమత పార్టీ ఎంపీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తృణమూల్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కాలనాగుతో పోల్చారు. దేశ ఆర్ధిక వ్యవస్థను నిర్మల నాశనం చేశారని సెరాంపూర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. నిర్మల ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. పాముకాటుకు మనుషులు చనిపోయినట్లుగానే నిర్మల ఆర్ధిక విధానాలతో జనం ప్రాణాలు కోల్పోతున్నారని కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. రైల్వేల ప్రైవేటీకరణ యత్నాలను కూడా కల్యాణ్ బెనర్జీ తప్పుబట్టారు.

మరోవైపు నిర్మలపై కల్యాణ్ బెనర్జీ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. తృణమూల్ పార్టీపై మమతా బెనర్జీ పట్టుకోల్పోయారని చెప్పడానికి కల్యాణ్ బెనర్జీ అనుచిత వ్యాఖ్యలే ఉదాహరణ అని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. మమత అవినీతికర పాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో మతి స్థిమితం కోల్పోయిన తృణమూల్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఘోష్ ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*