రంగంలోకి దిగిన దోవల్… దారిలోకొస్తోన్న డ్రాగన్

న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యితో చర్చలు జరిపారు. జులై ఐదున వీడియో కాల్ ద్వారా జరిగిన చర్చలు సౌహార్ధపూర్వకంగా జరిగాయి. రెండు దేశాలూ శాంతి పూర్వక వాతావరణం కొనసాగించాలని నిర్ణయించాయి.

భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య జూన్ 30న జరిగిన మూడో విడత చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గల్వాన్‌తో పాటు అనేక ప్రాంతాల నుంచి తన బలగాలను రెండు కిలోమీటర్ల మేర వెనక్కు పిలిపించుకునేందుకు చైనా అంగీకరించింది. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియాన్‌ను ఉటంకిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

జూన్ 15న గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సందర్భంగా చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అటు ఎల్‌ఏసీ వద్ద సైన్యాన్ని భారీగా మోహరిస్తూనే ఇటు చైనాను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. 59 చైనా యాప్‌లను నిషేధించింది. అనేక టెండర్లను రద్దు చేసుకుంటూ పోతోంది. ఆర్ధికంగా దెబ్బతినడం ప్రారంభమయ్యాక చైనా కళ్లు తెరుచుకుంది. ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్, గోగ్రా తదితర ప్రాంతాలనుంచి చైనా తన బలగాలను వెనక్కు పిలిపించుకుంటోంది. మోదీ సర్కారు దృఢంగా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*