బీజేపీ నేత కుటుంబాన్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. విషాదంలో పార్టీ శ్రేణులు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడైన వసీం బారిని, ఆయన తండ్రిని, సోదరుడిని రాత్రి 9 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్చిచంపారు. పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఉన్న దుకాణం వద్ద ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. వసీం బారికి రక్షణ కల్పిస్తోన్న మొత్తం 8 మంది రక్షణ సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

వసీం బారి కుటుంబం ఊచకోతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా పిరికిపందల చర్యగా అభివర్ణించారు. వసీం బారి మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

ఘటనతో తాను షాక్‌కు గురయ్యానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ చెప్పారు. వసీం బారితో గతంలో తాను దిగిన ఫొటోను రాం మాధవ్ ట్విటర్‌లో షేర్ చేశారు.

వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనను మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక చర్యలను ఆయన తప్పుబట్టారు.

జాతీయ భావాలు పుష్కలంగా ఉన్న యువనేతను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంపై బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*