ఏదైనా మళ్లీ సంపాదించుకోవచ్చు కాని టైం మాత్రం తిరిగి రాదు: రేడియో జాకీ రాజేశ్

మైక్ పడితే గళగళా మాట్లాడతాడు.
మేకప్ వేస్తే చకచకా డైలాగ్స్ చెబుతాడు.
గాంధీని గుర్తుకు తెస్తాడు.
వివేకానందుడి సూక్తులు చెప్తాడు.
స్నేహం అతడి ఊపిరి.
శాంతం అతడి ఆయుధం.
అతడే మల్టీ టాలెంటెడ్ రేడియో జాకీ రాజేష్.

RJ కావాలని చాలామంది కోరిక. మీరు RJ కావాలని అనుకున్నారా?

రేడియో స్టేషన్ చూస్తానని కూడా అనుకోలేదు కాని థియేటర్ ఆర్ట్స్ సీనియర్స్ అప్పుడప్పుడు రేడియోకి వచ్చినప్పుడు వారితో వచ్చేవాడిని.
ప్రభుత్వ సంస్థ నీట్‌గా ఉండటం ఒకరకమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎలాగైనా కొంత కాలం ఇందులో పనిచేయాలనిపించింది. బహుశా అప్పుడు బలంగా అనుకున్నానేమో కొన్నాళ్ళకు కలనెరవేరింది. కానీ చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే బిఎస్సీ డిస్ కంటిన్యూ చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో బిఏ థియేటర్ ఆర్ట్స్‌లో చేరి తరువాత అదే ఆసక్తితో ఎం థియేటర్ కూడ పూర్తి చేశాను. ఎంఫిల్ ఫస్ట్ పార్ట్ పూర్తికాగానే అటు కెరీర్ ఇటు ఎంఫిల్ రెండు ఒకసారి కంటిన్యూ చేయలేక పోయాను. తప్పని పరిస్థితుల్లో ఎంఫిల్ వదిలేశాను. సినిమాలో నటన వైపు వీపరీతంగా ప్రయత్నించాను. టైం వృధా అవుతుంది తప్ప ఎవరు ప్రోత్సహించడంలేదు. ఆ ప్రయత్నంలో ఉండగా ఒకసారి “కాశ్మీర్ టు కన్యాకుమారి” అనే నాటకంలో నా పాత్ర చూసిన ఆలిండియా రేడియో సీనియర్ అనౌన్సర్ మురళి కృష్ణ ప్రశంసించారు. యువవాణిలో అప్లై చేయమన్నారు. అప్పటికి నా మాటల్లో తెలంగాణ మాండలికం బాగా ఉండేది. ఆ విషయం చెప్పి ఇది అడ్డంకి అవుతుందేమో అని చెప్పాను. ఆయన ధైర్యం చెప్పి అలా అపనమ్మకాలతో ఉండకూడదని, ఏదైనా ప్రయత్నం చేస్తేనే వస్తుందని చెప్పారు. నమ్మకం అనిపించి ప్రయత్నించాను. మొదటి ప్రయత్నంలోనే వచ్చింది. కొంతకాలం రేడియోలో పనిచేసి సబ్ఙెక్ట్ నేర్చుకొని …తరువాత సినిమాల్లోకి వెలదామనుకున్నాను. కాని సినిమా పరిశ్రమలో అవకాశాలు దొరకలేదు. ఒక్క కృష్ణవంశీ గారి దగ్గరకే సినిమా అవకాశం కొసం దాదాపు 8 సంవత్సరాలు తిరిగితే మహాత్మ మూవీలో చిన్న అవకాశం ఇచ్చారు. దాంతో మనని మనం ప్రూవ్ చేసుకోలేం. తరువాత బిస్కెట్, వీధి చిత్రాల్లో నటించాను. మాయాబజార్ ఈటీవీ సీరియల్లో కూడా నటించాను. ఏ గాడ్ ఫాదర్ లేరు. ఒంటరిపోరాటం. ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు కాని టైం తిరిగి రాదనే ప్రశ్న అంతర్గతంగా మొదలైంది. తాత్కాలికంగా సినిమా ప్రయత్నాలు ఆపాలను కున్నాను. యాక్టింగ్ ఎప్పుడైనా చేయచ్చు జాబ్‌లో చేరడం మాత్రం లేటయితే కష్టం అనుకున్నాను. అప్పుడే రెయిన్ బో ఎఫ్ఎం మొదలైంది. అక్కడా ప్రయత్నం చేశాను. వచ్చింది. ఇక్కడ డబ్బు సంపాదన కన్నా పనిలో సంతృప్తి ఉండేది. నటన కోసం వెళితే అక్కడ లేని ప్రాధాన్యత ఇక్కడ రావడం, ఎప్పుడూ కొత్త విషయాల గురించి తెలుసుకోగలిగే అవకాశం వచ్చింది. రేడియోకే అంకితం అయ్యాను. వాయిస్ ఫీల్డ్‌లో మాత్రం పేరు వచ్చింది. 2008లో మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కార్డ్ కూడా తీసుకున్నాను. చిన్న చిన్న అవకాశాలు మాత్రం వస్తున్నాయి. కానీ RJ గానే కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను.

మీ ఇన్స్పిరేషన్ ఎవరు?

నేను చేయాలనుకున్న పని కచ్చితంగా చేయాడానికి స్ఫూర్తి స్వామి వివేకానంద. నటానారంగంలోకి రావడానికి స్ఫూర్తి సీనియర్ ఎన్టీఆర్, చిరంఙీవి. రేడియో రంగంలో చాలామంది ఉన్నారు.

ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా ఎక్స్‌పీరియన్స్ చెబుతారా?

మొదట యువవాణిలో చేరాక కష్టాలు మొదలయ్యాయి. అంతా కొత్త. ఎవరు ఏమంటారో అని తెలియని ఒక భయం. కాని మా పెక్స్ చావలి దేవదాస్
వర్క్ బాగా నేర్పారు.పెద్దవాళ్ళు చేసే పనికూడా చేయమనేవారు. చాలా ఙాగ్రత్తగా చేసేవాడిని. పొరపాట్లు ఙరిగేవి. మళ్లీ సరిచేసుకునేవాడిని. వారి దగ్గర బాగా కష్టపడటంతో తరువాత రెయిన్‌బోలో వర్క్ చాలా సులువుగా అయింది. తరువాత సౌండ్ ఎడిటింగ్ కూడా నేర్చుకుని ఖాళీగా ఉన్న స్టూడియో చూసి తీరిక సమయాల్లో ప్రయోగాలు చేసేవాడిని.

మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ ఏది. టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?

చాలా సార్లు మంచి టాపిక్స్ సెలక్ట్ చేసుకున్నప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఒక సారి “చినుకులు” అనే టాపిక్ మీద స్క్రిప్ట్ సరదాగా రాశాను. బాగా రెస్పాన్స్ వచ్చింది. అది మాత్రం బాగా గుర్తుండి పోయింది.

స్క్రిప్ట్ రాయడానికి ఎంత టైం పడుతుంది, అసలు ఎలా రాస్తారు?

టైం చెప్పలేం. ఒక్కో సారి ఎక్కువ టైం పడుతుంది. కొన్నిసార్లు తొందరగా పూర్తవుతుంది. స్క్రిప్ట్ చూస్తూ చెప్పడం అనేది ఎందుకో నచ్చదు. అది బ్రైయిన్‌లో ఉండాలి అనిపిస్తుంది కానీ తప్పదు. అన్ని నియమ నిబంధనలు ఫాలో అవ్వాలి. గౌరవించాలి.

మీకు ఫ్యాన్స్ వుంటారుగా… ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

ఇది ఎవరికైనా ఆనందంగా ఉండే విషయమే కాని తెలివైన వారు అభిమానులుగా దొరికినప్పుడు ఎక్కువ ఎమోషన్‌కి లోనవుతా. పర్సనల్‌గా గంటల తరబడి మాట్లాడితే వారినుంచి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నా ఆలోచనలను చర్చిస్తాను. మనం చేసే పనిమీద మనకు ఎంత నమ్మకం ఉన్నా ఒక సారి ఇతరుల అభిప్రాయం కూడా వినడం మంచిది. పొరపాట్లు తెలుస్తాయి. కొత్త ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది.

లాక్ డౌన్ టైంలో కూడా మీరు రేడియోలో సేవలు అందించారు కదా.. మీకు ఎలా అనిపించింది?

కొంచెం రిస్కే అనిపించింది కానీ వందమందిలో ఒకరిలా మనం ఆలోచించకూడదు మనం ఎప్పుడూ ప్రత్యేకంగా ఆలోచించాలి. డాక్టర్లు మృత్యువు సమీపంలో నిలబడి వారిధర్మాన్ని నిర్వర్తించారు. ఫైర్ సిబ్బంది ఎప్పుడూ నిప్పుతో పోరాడతారు. వారితో పోలిస్తే మనం ఙాగ్రత్తలు పాటిస్తూ పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రోసీడ్ అవ్వాలనిపించింది.

RJ గా కాకుండా ఇంకేం చేస్తుంటారు?

అప్పుడప్పుడు చిన్న చిన్న డబ్బింగ్ వర్క్స్. అలాగే నా మైండ్ సెట్ తెలిసిన ఫ్రెండ్స్ నాటకాల్లో యాక్ట్ చేస్తాను. అవకాశం వచ్చినప్పుడల్లా మూవీస్‌లో యాక్ట్ చేస్తుంటాను. మరీ టైం దొరికితే చిన్న చిన్నసామాఙిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను.

థియేటర్ ఆర్ట్స్…రేడియో జాకీ పనికి ఉపయోగపడుతుందా?

థియేటర్ ఆర్ట్స్ దేనికైనా ఉపయోగ పడుతుంది. సమాఙం మంచి మార్గంలో నడవటానికి, ప్రఙలను చైతన్యవంతులను చేయడానికి, ఆరోగ్యంగా ఉండానికి. భరత ముని సమాఙానికి అందించిన అద్భుతమే నాట్యశాస్త్రం. ఈ శాస్త్రాన్ని 5 వ వేదంగా భావిస్తారు. ఈ కోర్చు ఉద్దేశమే చైతన్యం. చైతన్యం అవసరం లేని వారు ఎవరూ ఉండరుగా.

మీరు సినిమాల్లో కూడా చేశారుగా, మీ ఎక్స్‌పీరియన్స్?

అక్కడ నచ్చనిది ఇతరుల టైం అనవసరంగా వేస్ట్ చేయడం. అది కూడ దేశ ద్రోహమే. మరొక విషయం చిన్నరోల్స్ చేసేవారిని పట్టించుకోక పోవడం.
ఒక నాటకం చేస్తే ప్రతిపాత్ర మీద దర్శకుడు ఫోకస్ చేస్తాడు. మన తెలుగు చిత్రపరిశ్రమలో కొంతమంది మాత్రమే అలా ఫోకస్ చెస్తారు. అది దొరైరాఙు దగ్గర కనిపించింది. ఆయన డైరెక్ట్ చేసిన వీధి చిత్రంలో నేను చేసింది చాలా చిన్నరోల్ అయినా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈటీవీ2 మాయా బఙార్‌లో చేసిన రోల్స్ మాత్రం బాగా గుర్తుండి పోయాయి. చాలా రోల్స్ వేశాను.

మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ?

ప్లాన్స్ చెప్పలేను. అవి చాలా సాహసం, శ్రమతో కూడుకున్నవి. డబ్బుతో కూడుకున్నవి. ప్రస్తుతానికి మాత్రం రేడియో జాకీగా కొనసాగడమే.

RJలు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్?

తెలుగు బాగా నేర్చుకోవడమే. తెలుగు సరిగా రాదంటే ఇక్కడికి రాకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడుండేది ఎక్కువ మంది తెలుగువారే. హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వచ్చేవారికి రేడియోలో ప్రస్తుతానికి అవకాశాలు తక్కువ. ఇంకా ముందు ముందు పరిస్థితులు చెప్పలేం.

మీ హాబీలు?

హాబీస్ సినిమాలు చూడటం. టైం కుదుర్చుకుని ఫ్రెండ్స్‌ని కలవడం. బాతాకాని చేయడం. మూడ్ బాగున్నప్పుడు ఉపయోగ పడే బుక్స్ చదవడం. పాటలు వినడం.

మీకు నచ్చే రేడియో జాకీ ఎవరు? ఎందుకిష్టం?

ఫెవరెట్ రేడియో జాకీలు బంగ్లా భారతి, సౌమ్య. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ నేర్పుగా సమాచారాన్ని అందించడం భారతి ప్రత్యేకత. నైట్ షోల్లో లవ్ గురించి చెప్పేటప్పుడు సౌమ్య వాయిస్ హైలైట్‌గా అనిపించేది.

జ్ఞానవాణి, యువ వాణిలో కూడా చేశారుగా. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

యువవాణిలో చేసింది కొద్ది రోఙులే అయినా చాలా సరదాగా అనిపించింది. యునివర్సిటిలో క్లాసులు అయిపోగానే రేడియోకి వచ్చి పని చేస్తూ క్యాంటిన్‌లో ఫ్రెండ్స్‌తో బాతాకాని చాలా హ్యాపిగా ఉండేది. ఙ్ఞానవాణి కూడ ఒక మంచి ఙ్ఞాపకమే. చాలా విషయాలు నేర్చుకున్నాను. అధికారులతో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి.

RJ కాకపోతే ఏమై ఉండేవారు?

తెలియదు. నటుడవ్వాలనుకున్నాను. అయ్యాను. Rj గా కొనసాగుతున్నాను. ఇంకా ముందు ముందు ఏఏ పనులు చేస్తానో తెలియదు. ప్రతి మనిషికీ తనకు తెలిసిన గోల్ ఒకటుంటుంది. ఒక్కో సారి నేచర్ మనతో ఊహించని మంచి పనులు చేపిస్తుంది. మనకే ఆశ్చర్యం వేస్తుంది. అబ్దుల్ కలాం పైలెట్‌గా సెలక్ట్ కాలేక పోయారు. నేచర్ ఆయన ఊహించిన దానికంటె గొప్ప స్థితిని ఇచ్చింది.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*