సింధియా బాటలో పైలట్!.. పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ

జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నుంచి నోటీసులు అందడంతో నొచ్చుకున్న ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. తన వద్దకు రావాలని ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి కూడా సమావేశంలో ఉండే అవకాశం ఉంది. తనకు మద్దతిస్తోన్న 13 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి కొనసాగించాలని ఆయన కోరనున్నారు. వాస్తవానికి రాజస్థాన్‌లో అధికారంలోకి రావడానికి కారణమైన తనకు సీఎం పదవి ఇవ్వకపోవడంపైనా పైలట్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అటు డిప్యూటీ సీఎం పదవి, పీసీసీ అధ్యక్ష పదవి సచిన్ వద్ద ఉండటం సీఎం గెహ్లాట్‌కు ఇష్టం లేదని తెలుస్తోంది. సచిన్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరగరాదని గెహ్లాట్ యోచిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నుంచి తనకు కూడా నోటీసులు వచ్చాయని గెహ్లాట్ చెప్పారు. నోటీసులు వస్తే తప్పేంటని సీఎం ప్రశ్నిస్తున్నారు. నేటి రాత్రి 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. ఆ సమావేశానికి రాని వాళ్లంతా సచిన్ పైలట్ వర్గీయులుగా భావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 200 మంది ఎమ్మెల్యేలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. అయితే సచిన్ పైలట్ వర్గీయులు బీజేపీలో చేరితో గెహ్లాట్ సర్కారు కూలిపోయే అవకాశం ఉంది. దీంతో పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు నచ్చక సింధియా తరహాలో పైలట్ కూడా వస్తే ఎగరేసుకుపోవాలని బీజేపీ యోచిస్తోంది. అటు సమర్థుడైన పైలట్‌ను గతంలో తనలాగే కాంగ్రెస్ పార్టీ పక్కనపడేస్తోందంటూ సింధియా ట్వీట్ చేశారు.

పైలట్‌ను రాహుల్‌, సోనియా దారిలోకి తెచ్చుకుంటారా లేక సింధియా తరహాలో పైలట్‌ను వదులు కుంటారా అనేది కొద్ది గంటల్లో తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*