కరోనా వేళ ప్రజలను అప్రమత్తం చేయడం నా బాధ్యత: రేడియో జాకీ లక్కీ

జర్నలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, రేడియో జాకీ…. ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆల్ రౌండర్‌ ఆమె.

సాక్షిటీవీ, ఎన్టీవీ, ఏ టీవీ, స్టూడియో ఎన్, భారత్ టుడే, 10టీవీలో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఆమె సొంతం.

ఐరా మీడియా హౌస్ యజమాని

కహానియా వెబ్ సైట్‌లో తెలుగు లాంగ్వేజ్‌కి ఎడిటర్.

ఆల్ ఇండియా రేడియో ఎఫ్ ఎం రెయిన్ బో 101.9లో 15 సంవత్సరాలుగా రేడియో జాకీ.

ఆమే లక్ష్మీ పెండ్యాల. రేడియో పేరు లక్కీ. ఆ పేరే ఆమెకు రేడియో జాకీగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ వారం ఆర్జే లక్కీ. ఆమె గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందామా!

RJ కావాలని చాలామంది కోరిక. మీరు RJ కావాలని అనుకున్నారా?

నేను అసలు రేడియో ఫీల్డ్ లోకి అడుగుపెడతానని అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశం అని చెప్పాలి. కానీ చిన్నప్పటి నుంచి రేడియో అంటే పిచ్చి.. ఎక్కువగా సినిమా పాటలు వినేదాన్ని. అయితే నేను హైదరాబాద్‌కి వచ్చిన కొత్తలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాను. ఆ టైంలో వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి. నేను ఎవరింట్లో అయితే ఉన్నానో వాళ్ల అపార్ట్ మెంట్‌లో గణేష్ దగ్గర ఓ సాయంత్రం వేళ మావాళ్ల బలవంతం మీద ఓ పాట పాడాను. అక్కడ ఉన్న వాళ్లందరికీ నా పాట నచ్చి మళ్లీ పాడమన్నారు. మర్నాడు ఉదయం అదే అపార్ట్ మెంట్ ఉండే ఏ.ఎల్. కుమార్ అనే రేడియో ఉద్యోగి ఎఫ్‌ఎం రెయిన్‌బోలో అప్లై చేయమన్నారు. ఆడిషన్‌లో సెలక్ట్ అవడం.. వాణీ ట్రైనింగ్ అవడం.. అలా అలా జరిగిపోయాయి. ఆర్జేని అయిపోయాను.

మీ ఇన్స్పిరేషన్ ఎవరు?

నాకు నేనే స్ఫూర్తి.. ఎందుకంటే నేను మా ఊరు (వెస్ట్ గోదావరి, నర్సాపురం) నుంచి ఇక్కడకి రాకముందే కాస్త రాయగలను, పాడగలను, చక్కగా మాట్లాడగలను.. ఇవన్నీ చిన్నప్పటినుంచి నాకు నేను ప్రోత్సహించుకున్నవే.. కానీ వీటి ద్వారానే నేను రాణించగలను అని ఆరోజు తెలీదు. కానీ నేను ఎదగాలని ముందుకు వెళ్తున్న ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు.. ఈరోజు ఇలా ఉండటానికి కారణం స్నేహితులే.

ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా ఎక్స్పీరియన్స్ చెబుతారా?

ఆల్ ఇండియా రేడియో.. ఈ పదాలు పలుకుతున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.. లోనికి అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తాను నేను. అలాంటిది లోపలికి వెళ్లి.. అక్కడ మైక్ ముందు కూర్చుని మాట్లాడటం అంటే నా పూర్వ జన్మ సుకృతంగా అనుకుంటాను. ఛానెల్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి చాలా షోలు చేసాను. చాలామంది పెక్స్ దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. రాంబాబు, సుమనస్పతి రెడ్డి, వసుమతి, శ్రీనివాసరెడ్డి, రమేష్, సంపత్, దేవదాస్, రామారావు .. ప్రస్తుతం కామేశ్వరి.. ఇలా అందరి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రకరకాల షోలు చేసాను. స్టూడియోకి వచ్చే గెస్ట్ లతో ఇంటర్వ్యూలు, రకరకాల టాపిక్స్‌తో కాలర్స్‌తో ఇంటరాక్షన్, కలర్ ఫుల్ గా అనిపిస్తుంది రెయిన్‌బో. 2005 డిసెంబర్ 25న రెయిన్బో మొదలైంది. నేను 2006 జనవరి 16 నుంచి లైవ్ లో ఉన్నాను. ఇన్ని సంవత్సరాల నా రేడియో జర్నీ తలచుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. రెయిన్‌బో ఎన్నో విషయాలు నేర్పింది.. ఎంతో జ్ఞానాన్ని పంచింది.

మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ ఏది. టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?

రెగ్యులర్ గా ఎప్పుడూ రెస్పాన్స్ ఉంటుంది. కాలర్స్ పోటీపడుతూ కాల్స్ చేస్తూ ఉంటారు.. మాట్లాడాలని.. ఇంకా మేమే తీసుకోలేకపోయిన సందర్భాలు అంటే టైం అయిపోయిన సందర్భాలు ఉంటాయి. పర్టిక్యులర్‌గా అయితే పరిణీత అనే ప్రోగ్రాం ఉమెన్ ఓరియెంటెడ్ షో.. ఆ షోకి చాలా రెస్పాన్స్ వచ్చేది.. ఎక్కువగా ఆడవారి సమస్యలు, ఉమెన్ సెలబ్రిటీస్‌తో ఇంటర్వ్యూలు.. ఆడవారికి చిట్కాలు.. ఇలా సాగుతూ ఉండేది ఆ షో. రీసెంట్ గా సింగిడీ అనే షో చేస్తున్నాను. తెలంగాణ మొత్తం మా షో వెళ్లడం.. తెలంగాణలో అన్ని ప్రాంతాల వాళ్లు ప్రేమగా పలకరించడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది.

స్క్రిప్ట్ రాయడానికి ఎంత టైం పడుతుంది, అసలు ఎలా రాస్తారు?

షో సెగ్మెంట్‌ని బట్టి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. కాస్త ఎక్కువగానే టైం పడుతుంది. షోకి వెళ్లడానికి ముందే ఎటువంటి టాపిక్స్ ఇవ్వాలనుకుంటున్నామనేది ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కి చెబుతాం. ఈ విషయంలో కాస్త ఫ్రీడం ఇస్తారు. కానీ ప్రత్యేక సందర్భాలలో మాత్రం వారి సలహాలు.. సూచనలు పాటిస్తాం. స్క్రిప్ట్ లేకుండా షోకి వెళ్లడం అంటే అస్సలు కుదరదు. ఖచ్చితంగా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ చూసి సైన్ చేస్తారు. ఏదైనా పేపర్ పై పక్కాగా ఉంటేనే రేడియో ముందు ఎటువంటి తడబాట్లు లేకుండా చక్కగా మనం చెప్పాలనుకున్నవి చెప్పగలుగుతాం. కంటెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కోసం కాస్త ఇంటర్నెట్ మీద ఆధారపడినా.. పూర్తిగా సొంతంగా రాస్తాం. ఒక్కోసారి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్స్ కూడా డీటెయిల్స్ పంపిస్తారు. గెస్ట్‌లను కూడా వాళ్లే సజెస్ట్ చేస్తారు. ఏది ఏమైనా పక్కా స్క్రిప్ట్ లేకుండా..షో చేయడం అంటే ఎగ్జామ్ పేపర్‌లో ఫెయిల్ అయినట్లే.. ఇది నా అభిప్రాయం.

మీకు ఫ్యాన్స్ వుంటారుగా… ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

ఫ్యాన్స్ ఉంటారు.. నన్నుతెలుగు చాలా చక్కగా మాట్లాడతావు.. నీ వాయిస్ క్లియర్ గా ఉంటుంది.. అని చాలా సందర్భాల్లో లిజనర్స్ అంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి కాంప్లిమెంట్ టానిక్ లాగ పనిచేస్తుంది.

లాక్ డౌన్ టైంలో కూడా మీరు రేడియోలో సేవలు అందించారు కదా.. మీకు ఎలా అనిపించింది?

కొన్నేళ్లుగా రెయిన్‌బోలో చేయడం ఒక ఎత్తైతే ఈ కరోనా మహమ్మారీ విజృంభించాక షో చేయడం అనేది ఒక ఎత్తు. ఇలాంటి విపరీతమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఒకవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మరోవైపు మనసులో ఏదో గుబులు ఉంటుంది కదా..కానీ చాలా ధైర్యంగా షోలు చేస్తున్నాం. నార్మల్ టైంలో కంటే ఈ టైంలో కరోనాపై జనాలకి అవగాహన కల్పించడం.. వారిని అప్రమత్తం చేయడం బాధ్యతగా అనిపించింది. ఇది కదా నా వృత్తికి న్యాయం చేయడమంటే అనిపించింది. కరోనా టైంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా మేం కొన్ని ఇంట్లో ఉంటూనే కార్యక్రమాలు చేసాం.

RJగా కాకుండా ఇంకేం చేస్తుంటారు?

ఆర్జేగా కాకుండా అంటే కహానియా అనే వెబ్ సైట్ లో తెలుగు విభాగానికి ఎడిటర్‌గా ఉన్నాను. ఈ సైట్‌‌లో సీరియల్స్, కథలు, కవితలు చాలామంది రైటర్స్ పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. కొందరు రైటర్స్‌కి మా సేవలు అందిస్తూ గైడ్ చేస్తూ ఉంటాం.రైటర్స్‌కి కమర్షియల్‌గా ఉపయోగపడే ఈ ప్లాట్ ఫామ్ నాకు చాలా నచ్చింది.

మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ?

నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఐరా మీడియా హౌస్ పేరుతో ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేయాలనేది నా కల. యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని ప్రోగ్రాంలు చేయాలని అనుకున్నాను. ఇందులో మొదటిది పోస్ట్ పోన్ అయ్యింది. చాలామందిని కలవాలి.. ఇంటర్వ్యూలు తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. కరోనా కంట్రోల్ అయ్యాక వాటిమీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఏది ఏమైనా ఒకే ఫీల్డ్ అని కాకుండా ఆల్ రౌండర్‌గా ఉండాలనేది నాకు ఇష్టం.

RJ లు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్?

ఆర్జే కావాలని చాలామందికి ఉంటుంది. అవ్వాలనే కోరిక ఉంటే సరిపోదు. అందుకు తగిన స్టఫ్ మన దగ్గర ఉందా? లేదా? అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. లేదా ఏదో కాస్త ఉంటే దానికి పదును పెట్టాలి. చక్కగా రాయగలగడం.. రాసిన దాన్ని అందంగా ప్రెజెంట్ చేయగలగడం చాలా ఇంపార్టెంట్..మనం కనిపిస్తూ మాట్లాడటం వేరు.. మనం కనపడకుండా వినేవాడిని ఆకట్టుకోవడం అంటే కాస్త కష్టపడాలి. అన్ని అంశాలపై అవగాహన ఉండాలి. మాట్లాడేటపుడు తడుముకోకుండా ఉండాలి. ఏ భాషలో అయితే ఆర్జే కావాలనుకుంటున్నారో ఆ భాషపై పట్టుండాలి.

Rj కాకపోతే ఏమి చేసేవారు?

ఆర్జే కాకపోతే అకౌంటెంట్ అయ్యేదాన్ని బీకాం చేసాను. హైదరాబాద్ వచ్చినప్పుడు అకౌంటింగ్ ప్యాకేజస్ కొన్ని కోర్సులు కూడా చేసాను.. మే బీ అలా సెటిల్ అయ్యేదాన్ని ..మే బీ..

Rj కాకుండా ఇంకా ఏమేమి చేస్తారు?

నేను కవితలు రాస్తాను, కథలు రాస్తాను. సరదాగా పాటలు పాడతాను. కొన్ని కాంపిటేషన్స్‌లో ప్రైజస్ కూడా వచ్చాయి. అవకాశం వచ్చినప్పుడల్లా వాయిస్ ఓవర్స్ చెబుతాను. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. నాకు అందిరితో కలిసి మెలసి ఉండటం ఇష్టం.. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం ఇష్టం.. ఈ యాక్టివ్‌గా అనే క్వాలిటీ ఒక ఆర్జేకి ఎప్పుడూ ఉండాలి.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*