
హైదరాబాద్: ఉపాధ్యాయునిగా, ఉపన్యాసకునిగా, పరిపాలనాదక్షునిగా, రచయితగా, పరిశోధకునిగా ఆచార్య పోణంగి శ్రీ రామ అప్పారావు చేసిన కృషి చిరస్మరణీయమ్. “పోణంగి” వంశంతో పాటు తెలుగు జాతికే, కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన మహామనీషి.
రాష్ట్ర సంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకునిగా, తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థ (అదే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా మారింది) వ్యవస్తాపక సంచాలకునిగా అప్పారావు ఎనలేని సేవలందించారు. గతంలో హైదరాబాద్లో జరిగిన ప్రప్రధమ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ప్రధాన కార్యదర్శి హోదాలో నిర్విరామంగా శ్రమించి, “నభూతో నభవిష్యతి” గా విజయవంతం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, విద్యామంత్రి మండలి వెంకట కృష్ణారావు నేతృత్వంలో తెలుగుజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలకు రూపకల్పన చేసి, తర్వాతి మహాసభలకు మార్గనిర్దేశనం చేశారనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.
భరతముని సంస్కృతంలో వ్రాసిన నాట్యశాస్త్రాన్ని డాక్టర్ పి.ఎస్.ఆర్. అప్పారావు తెలుగులోకి అనువదించారు. నాట్యంలోని వివిధ అభినయాలపై సవివరంగా ఎన్నో పుస్తకాలు రచించారు. నాట్యంలో శిక్షణ ఇచ్చే గురువులకు, నృత్యం నేర్చుకునే కళాకారులకు అవి ప్రామాణిక పాఠ్య గ్రంధాలుగా గుర్తింపు పొందాయి. అలనాటి నాటకరంగ ప్రముఖుల జీవిత విశేషాలను సేకరించి, గ్రంధస్తం చేశారు. ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు, స్వచ్చంద సాంస్కృతిక సంస్థలు ఆయన్ను గౌరవించి సత్కరించాయి. దేశ, విదేశాలలో నాట్యశాస్త్రంపైన, రంగస్థల విషయాలపైన పరిశోధనలు చేసి, అనేక ప్రసంగాలు చేశారు.
నిత్య కృషీవలుడు. ఒక్క క్షణం కూడా ఆయన ఖాళీగా ఉండేవారు కాదు. అయితే చివరి దశలో తీవ్ర అస్వస్టతకు, మానసిక ఆందోళనకు గురి కావడంతో, ఆయన సంకల్పించిన కొన్ని ప్రణాళికలు, పరిశోధనలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. 82వ జన్మదినోత్సవం జరుపుకోడానికి సరిగ్గా 20 రోజుల ముందు, 2005 జులై 1వ తేదీన ఆయన నటరాజు సన్నిధికి చేరుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఇష్ట దైవమైన శ్రీ రామ చంద్రమూర్తిని మనసారా ప్రార్ధిస్తున్నాము.
-(ఆచార్య డాక్టర్ పి.ఎస్.ఆర్.అప్పారావు 97వ జయంతి సందర్భంగా)
-పోణంగి బాల భాస్కర్. 9441484306, ponangibalabhaskar@gmail.com
Be the first to comment