కల్నల్ సంతోష్ భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

హైదరాబాద్: ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతోషికి అందించారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇతర ప్రజా ప్రతినిధులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు సంతోషి జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో 20 కోట్ల రూపాయల విలువైన 711 గజాల స్థలాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించింది.

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా దాడి చేసి కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ సూర్యాపేట వెళ్లి సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*