తన మాటలతో శ్రోతల హృదయాల్లోకి ప్రయాణించేవాడే రేడియో జాకీ: సునీల్ దత్

హైదరాబాద్: తన మాటలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాడు. చదివింది ఎంఏ ఇంగ్లీష్ అయినా జీవిత సైకాలజీ చదవడంలో ఎక్స్‌పర్ట్ అయ్యాడు. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ సమాజంలో మార్పునకు నిరంతరం తపిస్తుంటాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి రేడియో జాకీగా హైదరాబాద్‌ను ఏలుతున్న ఇతడికి ఆల్ ఇండియా రేడియో రెయిన్‌బో ఎఫ్‌ఎం 101.9‌తో విడదీయరాని అనుబంధం ఉంది. అతడెవరో కాదు రేడియో జాకీ సునీల్ దత్. తన స్ఫూర్తిదాయక అనుభవాల గురించి తన రేడియో జర్నీ గురించి ఈ క్షణం పాఠకులకు చెప్పడానికి సునీల్‌దత్ సిద్ధమయ్యారు.

సునీల్ దత్ మాటల్లో…


ఆల్ ఇండియా రేడియో FM rainbowలో రేడియో జాకీగా చేస్తారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ చెబుతారా…?

ఆదివారం.. సమయం.. ఉదయం 7 గంటలు.. సండే కదా.. ఇప్పుడే లేవాలా? అనుకుంటారు.. చాలా మంది. ఇంకాసేపు పడుకుంటే బాగుండు అన్న ఆలోచనతో ముసుగు తన్నేందుకు ప్రయత్నించి విఫలమవుతారు. ఎందుకంటే ఆ టైమ్లో ఆలిండియా రేడియో రెయిన్‌బో ఎఫ్ఎం 101.9లో వచ్చే వందనం కార్యక్రమంలో భాగoగా ‘రంగోలీ’ సంగీత ప్రపంచం వారిని పిలుస్తుంది. అది పాత హిందీ పాటల సమాహారం. రంగోలీ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంట వరకు. శ్రోతలందరు చిన్నా, పెద్దా తేడా లేకుండా గోల్కొండ నుంచి మొదలుకుని బోరబండ, శాలిబండ, తాడ్‌బండ్, హైటెక్ సిటీ, కోఠి, నాంపల్లి.. ఇలా అన్ని ఏరియాల నుంచి ఫోన్లు, మెస్సేజ్‌లు వరదలా వస్తూంటాయి.

‘సండే స్పెషల్ రంగోలీ ఆల్ టైమ్ హిట్స్, మై హూ ఆప్కా దిల్దార్ దోస్త్.. సునీల్ దత్’ అంటూ మన పక్కింటి స్నేహితుడిలా మన వెన్నంటి నిలిచే ఆత్మీయుడిలా పలకరిస్త. సిటీలో ఏం జరుగుతోంది, కొత్తగా ఏ విషయాలు చర్చిస్తున్నారు, వాతావరణం, ఆహారం, ఆరోగ్యం, సంగీతం, సినిమా ఇంకా ఎన్నో అప్డేట్స్.. ఇలా ప్రతి ఒక్క అంశాన్నీ నా సహజసిద్ధమైన దక్కనీ భాషలో అందిస్తా. ఒకవైపు తెలుగు, ఉర్దూ, అట్లనే మధ్యమధ్యలో అప్పుడప్పుడు ఇంగ్లిష్.. కిశోర్‌కుమార్, మహ్మద్ రఫీ, ముఖేశ్, ఆశా లాంటి మహామహుల పాటలు… ఇలా శ్రోతల్ని మరో ప్రపంచంలోకి తీసుకెల్లడానికి ప్రయత్నం చేస్తా. ఇగ ఇంకోవైపు మన హైదరాబాదీ సంస్కృతీ, సంప్రదాయాలు.. మన తెలంగాణ భాష, యాస, ప్రాస.. మధ్యలో ఉర్దూ శాయరీలు.. తెలంగాణ సామెతలు.. శ్రోతలందరు ఇవి చాలా ఇష్ట పడుతూఉంటారు.


ఎన్నో ఏళ్లుగా RJ గా రాణిస్తున్నారు కదా, మీ ఫీలింగ్?

రేడియోలో మాట్లాడటం అంటే చాలా మంది పాటకు, పాటకు మధ్య ఏదో మాట్లాడటం అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పంటాను . మాటల ద్వారా శ్రోతల మనసు లోతుల్లోకి వెళ్లి, వారికి సమాచారంతో పాటు వినోదాన్ని, విజ్ఞానాన్ని, అవసరమైన సందర్భాల్లో విషయ పరిజ్ఞానాన్ని ప్రవహింపజేయలి . భాష, సమయస్ఫూర్తి, స్వరం, విషయాల పట్ల అవగాహన, సంస్కృతి, సంప్రదాయాలు, స్థలాల విశేషాలు.. ఇలా ఎన్నో విషయాల మీద ఆర్జే అనేవాడికి అవగాహన ఉండాలీ అన్నింటికీ మించి సమయపాలన చాలా ముఖ్యం. ఆర్జే అంటే ఒక్క మాటలో చెప్పాంటే ఇన్ఫర్మేషన్‌తో కూడిన ఎంటర్‌టెయిన్‌మెంట్ (ఇన్ఫోటెయిన్మెంట్).

Rj లకు ట్రైనింగ్ ఇస్తుంటారు అని విన్నాము. RJ కావాలంటే ఏమేమి క్వాలిఫికేషన్లు వుండాలి?

రేడియో హైదరాబాద్ అకాడమీ నుంచి 2015 నుంచి ఇప్పటివరకు 350 నుంచి 400 మందికి శిక్షణ ఇచ్చాను. దాదాపు 90 నుంచి 100 మంది విద్యార్థులు వివిధ రేడియో, టీవీ చానళ్లలో ఆర్జేలుగా, యాంకర్లుగా పనిచేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా మూడు భాషల్లో (తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్) ఆర్జే, వీజే, యాంకర్, ఫొటోగ్రఫీ.. ఇలా వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చే సంస్థ అది. తన మాటలతో శ్రోతల హృదయాల్లోకి ప్రయాణించేవాడే రేడియో జాకీ.
రేడియో జాకీ గొంతులోని మార్దవం శ్రోత హృదయాన్ని స్పృశించేలా ఉండాలి. హృదయ స్పందనకు సరిపోయే తరంగ దైర్ఘ్యమంత ఉండాలి. ఎందుకంటే అది కూడా ఓ సైన్స్. ఏ భౌతిక పరికరాలూ కొలవలేని మనోవిజ్ఞానశాస్త్రం.


ఇప్పటి వరకు మీరు మర్చిపోలేని సంఘటన?

చాలా సంఘటనలు ఉన్నాయి కానీ అందులో కొన్ని నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలాయి … ఒకరోజు డ్యూటీ లో భాగంగా రెయిన్బో ఏప్ ఎం లో రక్త దానం ఆవశ్యకత గురించి మాట్లాడాను నా ప్రోగ్రాం అయిపోయి నేను వెళ్లిపోయే సమయానికి పార్కింగ్ దగ్గర నలుగురు యువతీ యువకులు కలిసి మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. మీ కార్యక్రమం విన్నాం అని మేము రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు వారికి నేను అప్పుడు తలసేమియా ఫౌండేషన్ అడ్రస్ ఇచ్చాను. ఆరోజు వారు నా పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ..అప్పుడు తెలిసింది రేడియో మాద్యమం ప్రభావం ఇంత బలంగా ఉంటుందా అని.


మీ ఫేవరెట్ RJ ఎవరు?

ఎప్పటికి నా ఫెవరెట్ ఆర్‌జె ఫక్రుద్దీన్ అహ్మద్…. అయన ఢిల్లీలో బెంగుళూర్, హైదరాబాద్ రెయిన్‌బో ఎఫ్ఎంలో చేసారు. హైదరాబాద్‌లో ఉండగా అయన నుంచి చాల నేర్చుకున్నాను. అయన యాంకరింగ్ ప్రభావం నాపై బాగా పడింది. ఆ తరువాత ఆర్‌జె నయీమ్ చేసే ప్రోగ్రామ్స్ చాలా ఇష్టం. రేడియో మిర్చిలో నవీద్ చేసే చేసే ప్రోగ్రామ్స్ చాల బాగా నచ్చుతాయి.


RJ ఎలా అయ్యారు..?

నేను … ఒక మారుమూల పల్లెటూరి పిల్లాన్ని. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని కంఠం అనే గ్రామం మాది. ఓ సాధారణ మధ్యతరగతికి చెందిన సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబం. నాన్న శ్రీనివాసాచారి. రిటైర్డ్ దేవాదాయ శాఖ ఉద్యోగి. అమ్మ సక్కుబాయి. గృహిణి. ఇప్పుడు మా నాన్న వ్యవసాయం, పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాకూ ఇద్దరు చెల్లెళ్లు. ఇద్దరికీ వివాహమై సెటిలైపోయారు. మా నాన్నగారు బాసర సరస్వతీ దేవాలయంలో ఉద్యోగిగా పని చేసే సమయంలో ఒక రోజు ఆలిండియా రేడియో హైదరాబాద్‌లో పనిచేసే శ్రీహరి అనే అధికారి అమ్మవారి దర్శనం కోసం వెళ్లినప్పుడు మా నాన్నకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే నన్ను ఆలిండియా రేడియో తెలుగు యువవాణి విభాగం ఆడిషన్‌లో పాల్గొనేలా చేసింది. 2002లో ఆలిండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్‌గా ప్రారంభమైన నా రేడియో ప్రస్థానం 18 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతోంది.

RJ కాకపోతే ఏమి చేసేవారు.?

కాకపోతే అనేది ఊహించడమే కష్టం. ఎందుకంటే ఒకసారి రంగంలోకి వచ్చాక కాస్త లేట్ ఐనా ఆర్‌జే‌గా రాణించాలి అనుకున్న. దానితో పాటు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఎదో ఒకరోజు ఆర్‌జే‌గా రాణించాలని అనుకున్నాను. ఐతే నేను చదివింది యంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి మా స్వగ్రామానికి వెళ్లి ఏదైనా కాలేజీలో లెక్చరర్‌గా పని చేద్దామనుకున్నా.

మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ ఏది? అసలు టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు.?

నేను ఎక్కువగా సామజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాను. అవి ట్రాఫిక్, పొల్యూషన్, మోటివేషన్, విద్య, వైద్యం, సానుకూల దృక్పధం లాంటి అంశాలనే శ్రోతలతో పంచుకుంటాను. విషయాన్ని ఎంచుకుని సందర్భోచితంగా అన్ని తరగతుల వారికీ చేరేవిధంగా సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ ఉంటాను

అప్పుడప్పుడు పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా.. ఎలా అనిపిస్తుంది.?

అదో గొప్ప అనుభూతి. చాలాసార్లు మనకన్నా ఎక్కువ విషయాలు పబ్లిక్ నుంచే నేర్చుకుంటాం.


మీకు ఫ్యాన్స్ వుంటారుగా… ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది.?

ఫ్యాన్స్ అని నేను అనను కానీ రేడియో ద్వారా మంచి మిత్రులను కలసుకోగలిగాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.

ఫ్యాన్స్‌తో మీకు గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్.?

వారితో మాట్లాడిన ప్రతి క్షణం ఒక అద్భుతమైన అనుభూతే. మొన్నటికి మొన్న కరోనా సమయంలో మేము చేసే కార్యక్రమాలు విని మాస్కులు, గ్లౌజులు పేదవారికి పంచండంటూ ఓ అభిమాన శ్రోత మా స్టూడియోకి వచ్చి ఇచ్చిన సందర్భం జీవితాంతం మరచిపోలేను.

ఆర్‌జేగా కాకుండా ఇంకా ఏమేమి చేస్తుంటారు.?

ఈ ఒక్క ఆర్‌జేనే కాకుండా వాయిస్ ఓవర్ ప్రాజెక్ట్స్, ఈ లర్నింగ్ ప్రాజెక్ట్స్, కార్పొరేట్ యాడ్స్, వెబ్ సిరీస్, మా టీమ్‌తో కలిసి చేస్తుంటాను.

ఫ్రీ టైం లో ఏం చేస్తారు.?

సహజంగా నేను ప్రకృతి అభిమానిని. మా టీమ్‌తో కలిసి మన రాష్టంలోని కొన్ని పర్యాటక ప్రాంతాలకి వెళ్లి ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి చేస్తుంటాను. అలాగే తెలిసిన స్వచ్ఛంద సంస్థలకు వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాను.


మీ hobbies ఏంటీ.?

బుక్ రీడింగ్, మూవీస్ చూడటం, సాంగ్స్ వినడం, కథలు రాస్తూ ఉంటాను.


మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ.?

ప్రపంచ స్థాయి క్రియేటివ్ హౌస్, గ్లోబల్ అకాడమీ, ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలన్నదే నా ఆశయం. ఇది ఎంతోమంది యువతీ యువకులకు ఒక మంచి వేదికగా అవుతుందని నా నమ్మకం


RJ లు కావాలనుకునే వారికి మీరిచ్చే మెసేజ్..?

Rj కావాలి అనుకున్న వారు ముందుగా మంచి శ్రోత అయి ఉండాలి. సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. విజ్ఞానం, వినోదం, సంగీతం, అలాగే మన సిటీలో జరుగుతున్న అన్ని అంశాలను పరిశీలిస్తూ ఉండాలి. వాయిస్ రోజూ ప్రాక్టిస్ చేస్తూ ఉండాలి. ఈ లక్షణాలు గనుక మీకు ఉంటే ఒక్క RJ అనే కాదు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, స్టోరీ టెల్లర్‌గా ఇలా అనేక రంగాల్లో రాణించవచ్చు. ఈ రంగాల్లో రాణించాలనుకునే వారు sunilduth@theradiohyderabad.com, & hr@theradiohyderabad.com, www.theradiohyderabad.com సంప్రదించి గైడెన్స్ పొందవచ్చు.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*