శెభాష్ సోనూసూద్… మదనపల్లి పేద రైతు కుమార్తెలకు ట్రాక్టర్ బహుకరణ

మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరమ్మాయిలు ఎడ్లు లేకుండా తామే స్వయంగా నాగలి దున్నుతున్న వీడియో చూసి నటుడు సోనూసూద్ చలించిపోయారు. వారికి ట్రాక్టర్ ఇస్తానని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆ ఇద్దరమ్మాయిలు రైతు నాగేశ్వరరావు కుమార్తెలు. తొలుత టీ కొట్టు నడిపిన నాగేశ్వరరావు లాక్‌డౌన్‌తో పేదరికంలో పడ్డారు. వ్యవసాయమే మేలనుకున్నా ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నించుకోలేకపోయారు. దీంతో ఆయన ఇద్దరు కుమార్తెలు స్వయంగా నాగలిపట్టి పొలాన్ని దున్నారు. ఈ సందర్భంగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన సోనూసూద్ చలించిపోయి వారికి సాయం చేశారు. తొలుత ఎద్దులు కొనివ్వాలనుకున్నా చివరకు ట్రాక్టర్ కొనిచ్చారు. అమ్మాయిలిద్దరూ బాగా చదువుకోవాలంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. రైతులు దేశానికి గర్వకారణమంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సోనూసూద్ చేసిన సాయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఆయన అనేకమంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు పెద్ద ఎత్తున కృషి చేశారు. స్వయంగా బస్సులను, వాహనాలను ఏర్పాటు చేశారు. కాలినడకన వందలాది కిలోమీటర్లు నడుస్తున్న పేదలను చూసి చలించి స్వయంగా సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ వారిని సొంత ఊళ్లకు పంపారు. సోనూసూద్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*