నేతాజీ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య

న్యూఢిల్లీ : చారిత్రక సంఘటనల గురించి విస్తృతంగా అధ్యయనం జరిపి, అందులోని సమగ్రమైన, ప్రామాణికమైన మరియు కీలకమైన అంశాలను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. “నేతాజీ సుభాష్ బోస్ – ఐ.ఎన్.ఏ.” ట్రస్ట్ సభ్యులు డాక్టర్ కళ్యాణ్ కుమార్ దే రచించిన “నేతాజీ – ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ బ్రిటిష్ ఆర్కైవ్స్” పుస్తకాన్ని ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి భారత దేశ స్వరాజ్య సంగ్రామంలో నేతాజీ కృషిని వెలుగులోకి తీసుకొచ్చే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు.

భారతదేశ చరిత్ర, సంస్కృతి గురించి యువత సమగ్రంగా అధ్యయనం చేయవలసి అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను, వారి శౌర్య గాథలకు పాఠ్యప్రణాళికలో చోటు కల్పించాలని సూచించారు. స్వరాజ్య సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్రను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, చైతన్యవంతమైన, సాహసోపేతమైన నాయకత్వం ద్వారా ప్రజలకు ముఖ్యంగా యువతకు నేతాజీ స్ఫూర్తిని పంచారని పేర్కొన్నారు. ఐ.ఎన్.ఏ. శక్తి సామర్థ్యాలను ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు తెలియజేస్తాయన్న ఆయన, ఐ.ఎన్.ఏ. పట్ల ప్రజల్లో సానుభూతి పెరగడం, బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు మొదలైందని, స్వాతంత్ర్య సంగ్రామ విజయంలో ఇది కీలక పాత్ర పోషించిందన్నారు.

కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, నేతాజీ జీవితం నుంచి యువత ప్రేరణ పొంది, నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వరాజ్యం సముపార్జించుకుని ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా వివిధ రంగాల్లో భారతదేశం అనేక సవాళ్ళు ఎదుర్కోవడం ఆలోచించాల్సిన విషయమన్న ఆయన పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, కులం, లింగ వివక్షలు లేని, అందరికీ సమాన అవకాశాలు అందించే నవ భారత నిర్మాణ రథ సారథులుగా యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. భారతదేశ నాగరిక విలువలు, చరిత్ర మరియు సంస్కృతికి నేతాజీ గర్వకారణమని, గొప్ప దేశాలు తమ తలరాతను తామే రాసుకోగలవని ఆయన గట్టిగా విశ్వసించి, ప్రజల్లో ఈ స్ఫూర్తిని ప్రేరేపించే ప్రయత్నం చేశారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ముందు భారతీయులనే విషయాన్ని నేతాజీ పరిపూర్ణంగా విశ్వసించారన్న ఆయన కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఉన్న ఉపగుర్తింపులు భారతీయులమనే ప్రధాన స్ఫూర్తికి అడ్డుగా నిలవరాదన్నదే బోస్ అభిమతమని తెలిపారు.

భారతదేశం మరియు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల మీద కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఈ మహమ్మారి మీద జరుగుతున్న పోరాటంలో విజయం సాధించేందుకు, ఇందులో భాగంగా ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ అధిక శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. భారతదేశం లాంటి దేశాలు నిజమైన స్వావలంబనను పొందడం ద్వారా, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగల సామర్థ్యం గల ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన ఆవశ్యకతను కోవిడ్ -19 బలంగా గుర్తు చేసిందన్న ఆయన, ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రైవేట్ రంగంతో పాటు పరిశోధనల ద్వారా శిక్షణా సంస్థలు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం తక్షణావసరం అని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*