
న్యూఢిల్లీ: సమాజం, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం, మరింత లోతైన పరిశోధనలు జరపడం ద్వారా ఆయా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని ఐఐటీలతో పాటు ఉన్నత విద్యాసంస్థలకు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, అనారోగ్య సమస్యలు తదితర అంశాలను మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని సూచించారు.
ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలను ఆన్లైన్ వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారమార్గాలను కనుగొనడం ఐఐటీ, ఇతర ఉన్నత విద్యాసంస్థల ముందున్న తక్షణ కర్తవ్యమని తెలిపారు. ఈ దిశగా పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డీ)పై ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఇందుకోసం విద్యారంగంలోని ఇలాంటి ప్రాజెక్టులను గుర్తించి వాటికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రైవేటు రంగం ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమలు పరస్పర సహకారాన్ని కలిగి ఉండి, అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో కలసి ముందుకెళ్లాలని సూచించారు. విద్యాసంస్థల్లో పరిశోధనలను చేస్తున్న వారికి వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు అండదండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వీలైనంత త్వరగా చక్కటి పరిష్కారాలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
उपराष्ट्रपति श्री एम वेंकैया नायडू ने आईआईटी दिल्ली के हीरक जयंती चिन्ह तथा आईआईटी दिल्ली, 2030 विजन डॉक्यूमेंट का लोकार्पण किया।@iitdelhi #DiamondJubilee pic.twitter.com/gnp6Tmfq2W
— Vice President of India (@VPSecretariat) August 17, 2020
గతేడాది ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థల్లో కేవలం 8 భారతీయ సంస్థలే ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యావిధానం-2020 ద్వారా మళ్లీ భారత్ విశ్వగురువుగా, ప్రపంచ విద్యాకేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలు, ప్రైవేటు రంగం కలిసి విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి, అత్యుత్తమ విధానం దిశగా చొరవ తీసుకోవాలని, ఇది అందరి సంయుక్త ప్రయత్నం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
I am happy to note that the New Education Policy seeks to promote India as a global study destination providing premium education at affordable costs, thereby helping to restore its role as a Vishwa Guru. @iitdelhi #DiamondJubilee pic.twitter.com/uJQhCLGfQe
— Vice President of India (@VPSecretariat) August 17, 2020
దేశానికి, యువశక్తి కీలకమైన వనరు అని.. యువతలో ప్రతిభాపాటవాలకు కొదవలేదని.. వీరికి సరైన నైపుణ్యాన్ని అందించగలిగితే భారత్.. ప్రపంచ యవనికపై పుష్కలమైన అవకాశాలు అందిపుచ్చుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే దిశగా ముందుకు సాగడం ఖాయమని తెలిపారు. ఇందుకోసం విద్యాప్రమాణాలను పెంచుకోవాల్సిన అవసరముందని, నూతన విద్యావిధానం ద్వారా ఈ రంగంలోని సమస్యలను పరిష్కరించుకుని మరింత వృద్ధి సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ న్యూఢిల్లీ డైమండ్ జూబ్లీ లోగో, 2030 స్ట్రాటజీ డాక్యుమెంట్ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ఐఐటీ ఢిల్లీ డైరక్టర్ ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్ రావ్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment