మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే వేర్వేరు ఉద్యోగ పరీక్షల స్థానే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీఈటీ) పెట్టనుంది. ఇందుకోసం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని (ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఏజెన్సీలకు వివిధ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇది ముమ్మాటికీ శుభవార్తే. ఉద్యోగార్ధులు ఇప్పుడు ఒకే ఒక్క (సీఈటీ) పరీక్ష ఆన్‌లైన్‌లో రాస్తే చాలని కేంద్రం ప్రకటించింది.

సీఈటీలో వచ్చే మార్కులు, ఫలితాలు మూడేళ్ల పాటు చెల్లుబాటవుతాయి. మార్కులు మెరుగుపరుచుకునేందుకు ప్రతి అభ్యర్థికి మరో రెండు అదనపు ఛాన్సులిస్తారు. మూడింట్లో అధికంగా వచ్చిన మార్కులే పరిగణనలోకి తీసుకుంటారు. కాస్ట్-షేరింగ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఎన్ఆర్ఏ వల్ల వృథా ఖర్చుల భారం తగ్గనుంది. ప్రభుత్వానికి, ఉద్యోగార్ధులకు సమయం కలిసివస్తుంది. నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం వేర్వేరు పరీక్షలు అవసరం లేకుండా సింగిల్ ఆన్‌లైన్ సీఈటీకి హాజరైతే సరిపోతుంది. భారత్‌లోని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరహాలోనే ఈ ఎన్ఆర్ఏ కూడా ఉంటుందని కేంద్రం తెలిపింది.

కోట్లాది మంది యువతకు ఎన్ఆర్ఏ మేలు చేస్తుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

కేంద్ర నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పారదర్శకతను పెంచుతుందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

అన్ని వర్గాల ప్రజలకూ సమాన అవకాశాలు కల్పిస్తుందని, ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రం ఉంటుందని, పరీక్ష బహుభాషల్లో ఉంటుందని షా ట్వీట్ చేశారు.

నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ కోసం మోదీ సర్కారు 1,517.57 కోట్ల రూపాయలు మంజూరు చేసింది, 117 జిల్లాల్లో పరీక్షల మౌలిక సదుపాయాలకు కూడా ఈ నిధులను ఉపయోగిస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*