
న్యూఢిల్లీ: తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంటులో జరిగిన ప్రమాద ఘటన విచారకరమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు.
తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంటులో జరిగిన ప్రమాద ఘటన విచారకరం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) August 21, 2020
మరోవైపు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల్లో డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమరరాజ కంపెనీ ఉద్యోగులున్నారు. ఆరుగురి మృతదేహాలు జెన్కో ఆస్పత్రికి తరలించారు.
అటు శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్‌సింగ్‌ను నియమించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డి.జి.పి. శ్రీ గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) August 21, 2020
మృతుల వివరాలు
………………………..
డీఈఈ శ్రీనివాసరావు (హైదరాబాద్), ఏఈ సుందర్ (సూర్యాపేట)
ఏఈ కుమార్(హైదరాబాద్), ఏఈ సుష్మ(హైదరాబాద్)
ఏఈ ఫాతిమా(హైదరాబాద్), ఏఈ వెంకట్రావు (పాల్వంచ)
ఏఈ మోహన్ (హైదరాబాద్), అమరరాజ ఉద్యోగులు రాంబాబు, కిరణ్
ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై మంత్రి జగదీష్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం మాట్లాడారు.
Be the first to comment