చెప్పే మాట విలువైనదైతేనే వినేవాళ్లు శ్రద్ధగా వింటారు: రేడియో జాకీ డాక్టర్ సురభి రమేష్‌

ప్రతి వారం ఒక టాలెంటెడ్ రేడియో జాకీని ఇంటర్వ్యూ చేస్తోంది ఈక్షణం. ఈ వీకెండ్ Rj డాక్టర్ సురభి రమేష్‌తో కాసేపు ముచ్చటిద్దాం…..

సురభి రమేష్… ఈ పేరు గురించి చెప్తారా?

తెలుగు నాటకరంగంలో పరిచయం అక్కరలేని పేరు సురభి. 135 ఏళ్ళుగా నాటకమే వృత్తిగా కొనసాగిస్తున్న సమాజం సురభి కుటుంబానికి చెందినవాడిని అవ్వడం వల్ల ఇంటి పేరు సింధే అయినప్పటికీ అందరూ సురభి రమేష్‌గా పిలుస్తారు. అంతే కాకుండా సురభి ఫ్యామిలీ నుంచి ఆర్జేగా ఆలిండియా రేడియోలో సెలక్ట్ అయిన మొదటి వ్యక్తిని నేను. అందువల్ల సురభి జోడించి పిలిస్తే ఒక గొప్ప వ్యవస్థను కూడా జనాలకు గుర్తు చేసినట్టు ఉంటుంది. అందుకే రేడియోలో కూడా Rj సురభి రమేష్‌గా కంటిన్యూ అవుతున్నా. అలా పిలిస్తేనే నాకూ చాలా ఇష్టం.


థియేటర్ ఆర్ట్స్‌ చదివిన మీరు RJ ఎలా అయ్యారు?

పీజీ అయిపోయి థియేటర్ ఆర్ట్స్ లోనే ఎంఫిల్ చేస్తున్న సమయంలో ఇగ్నో వాళ్ల జ్ఞానవాణి ఎఫ్ ఎంలో రేడియో ఆడిషన్స్ ఉన్నాయని నా పీజీ క్లాస్ మేట్ సాయి పట్టెపు నాతో చెప్పడంతో పాటు అప్లికేషన్ కూడా తెచ్చిచ్చాడు. అలా అనుకోకుండా అప్లయ్ చేయడం, ఆడిషన్ కి వెళ్లడం, సెలక్ట్ అవ్వడం జరిగింది.

ఆల్ ఇండియా రేడియో వంటి పెద్ద సంస్థలో రేడియో జాకీగా చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెబుతారా…?

ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తే, బయట ప్రయివేట్ రేడియో స్టేషన్ల్లలో ఆర్జేస్‌గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, టివి యాంకర్స్‌గా ఇలా ఎక్కడైనా చాలా సమర్దవంతంగా పని చేయవచ్చు. ముందు భాష మీద పట్టు వస్తుంది. సాధారణ శ్రోతలకు కూడా అర్దమయ్యే విధంగా ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి అనేది ప్రధానంగా నేర్చుకుంటాం. ముఖ్యంగా రేడియో అంటే వాయిస్. న్యూస్ సెక్షన్, డ్రామా సెక్షన్, కథానికలు చదవడం, గెస్ట్‌లతో ప్రత్యేక ఇంటర్యూలు చేయడం అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ఎటువంటి కంటెంట్‌ని ఏ విధంగా చదవాలి, చెప్పాలి అన్ని విషయాలపై అవగాహన వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా గైడ్ చేసే ఆఫీసర్స్ అందరూ సంగీతం, సాహిత్యం, నాటకం, ఇలా అన్ని విషయాలపై అవగాహన ఉన్నవారు కావడంతో నాకున్న నాలెడ్జ్‌ని మరింతగా పెంచుకోడానికి అవకాశం కలిగింది.

రేడియోలో మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చే టాపిక్స్ ఏవి? అసలు టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?

ఏదైనా టాపిక్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు శ్రోతలకు ఉపయోగపడేదిగాను, ఆలోచింపజేసేలా ఉండేటట్టు చూసుకుంటాను. దానికోసం ఒక టాపిక్‌పై ముందు సరైన అవగాహన తెచ్చుకుని, దానికి సంబందించిన విషయ సేకరణ చేసుకుని మరీ మాట్లాడతాను. టాపిక్‌ సెలక్షన్ విషయంలో షో జరిగే సమయం అంటే ఆ రెండు మూడు రోజుల్లో సమాజంలో ఉన్న పరిస్థితులను గమనిస్తూ, వాటికి సంబందించిన రిలేటెడ్‌గా ఉండే టాపిక్‌ను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే… కరోనా వైరస్‌కు సంబందించి లాక్ డౌన్ టైంను ఏవిధంగా సద్వినియోగం చేసుకున్నారు, కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేనిని బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. ఇలాంటివి సిట్యుయేషన్‌కి రిలేటెడ్‌గా ఉండే వాటిని టాపిక్‌గా తీసుకుంటున్నాను. అలాంటి వాటికి లిజనర్స్ కూడా చాలా బాగా స్పందిస్తారు.

పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా.. ఎలా అనిపిస్తుంది..?

రేడియోలో మాట్లాడే ప్రతి మాట ఒక ఛాలెంజింగ్ గానే ఉంటుంది. అంటే వినేవాళ్లకు క్యాజువల్‌గా వినబడినా, మేము రెస్పెక్టబుల్ గాను, రెస్పాన్సిబుల్‌గానూ వీటితో పాటు జోష్ ఫుల్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే లిజనర్స్‌ని ఆనందపరచటం కోసం మాట్లాడటం అనేది ఒక టాస్క్ అయితే, లిజనర్స్‌తో మాట్లాడటం, పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మరో పెద్ద టాస్క్. మాట్లాడే వాళ్లలో అన్ని రకాల వయసుల వాళ్లతో పాటు, అనేక రకాలైన అనుభవాలు కలిగిన వాళ్లు ఉంటారు. అందరినీ గౌరవిస్తూ మాట్లాడాలి, ఆనంద పరుస్తూ మాట్లడాలి.ఇన్స్‌పైర్ చేస్తూ మాట్లాడాలి. అప్పుడప్పుడూ మ్యానేజ్ చేస్తూ కూడా మాట్లాడాలి. వినే వాళ్లు వున్నపుడే చెప్పే వాళ్లకు విలువుంటుంది. చెప్పే మాట విలువైనదైతేనే వినేవాళ్లు శ్రద్ధగా వింటారనేది ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. దానికి తగ్గట్టే వాళ్లతో మాట్లాడతాను.

ఆర్జేస్‌కు కూడా ఫ్యాన్స్ వుంటారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది.?

రేడియోలో వినిపించే గొంతు, చెప్పే మాటను గుర్తించి, అభిమానించే ఫ్యాన్స్ తయారవుతారు. అలా ఫ్యాన్స్ ఉండడం అనేది ప్రతి ఒక్క ఆర్జేకి గొప్ప ఫీల్ కలిగిస్తుంది. ఆ ఫీల్ అనేది మరింత ఉత్సాహాన్నిస్తుంది. మీరు చెప్పిన విషయాలు పాటిస్తున్నామండి, మీ ఆర్జేయింగ్ బాగుంటుందండి అని అంటే ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది ప్రతి ఆర్జేకి. అందుకోసం మాట్లాడే మాట నుంచి, వినిపించే పాట వరకు మనకంటూ ఒక మార్కు ఉండేలా చూసుకుంటాను. నాకు నచ్చిన పాటలు కాకుండా లిజనర్స్‌కి ఏవి నచ్చుతాయో అవి వినిపించే ప్రయత్నం చేస్తాను.

ఫ్యాన్స్‌తో మీకు గుర్తుండిపోయిన ఎక్స్పీరియన్స్…?

మీ మాటల్లో జోష్, ఎనర్జీ వింటుంటే… మాకు అంతటి ఎనర్జీ వస్తుందండి.. అనే లిజనర్స్ చాలా మంది ఉన్నారు. అదో గొప్పఫీలింగ్. అందుకోసం ఎప్పుడూ నా టాక్‌లో ఆ జోష్, ఎనర్జీ తగ్గకుండా చూసుకుంటా. కరోనా వేళ ఆర్జేలు చేస్తున్న రిస్క్‌ని గుర్తించి ఓ శ్రోత ఆర్జేలందరికీ మాస్కులు కుట్టి మరీ పంపించారు. అభిమానులుండడం అనేది మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అంతే కాకుండా మాలో మరింత బాధ్యతను కూడా పెంచుతుంది.

ఆర్జేయింగ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? ట్రయినింగ్ అనేది అవసరమంటారా.?

ఆర్జే కావాలంటే ప్రధానంగా వాక్చాతుర్యం అనేది ముఖ్యం. ఏ విషయాన్నాయినా మాటలతో హ్యాండిల్ చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉండాలి. వీటికి తోడు చుట్టూ జరిగే విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ, ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి. అవగాహన గానీ, ప్రత్యేకమైన ట్రయినింగ్‌గానీ తీసుకుంటే ఆడిషన్లో సెలక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ఇబ్బందిని తప్పించాలనే నేను ప్రత్యేకంగా ఆర్జే ట్రయినింగ్ వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం ఆన్లైన్‌లో క్లాస్‌లు కూడా చెప్తున్నాను.


నాటకాలు, టివీ, రేడియోని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?

థియేటర్ ఆర్ట్స్‌లో రేడియో నాటకం, టివి యాక్టింగ్ అనేవి కూడా సబ్జెక్ట్‌లు. సురభి నేపథ్యం కావడం వల్ల బ్యాలన్స్ చేయడం నేర్చుకున్నాను. ఆలిండియా రేడియోలో పని చేయడం వల్ల టైం మేనేజ్మెంట్, డిసిప్లీన్, సబ్జక్ట్ పై గ్రిప్ .. ఇలా అన్ని అంశాలపై అవగాహన అనేది పెరిగింది. అర్జేయింగ్ అనేది ఒక క్రియేటి వర్క్‌గా చూశా. మిగతా పనుల్లో ఎంత స్ర్టెస్ ఉన్నప్పటికీ కూడా మైక్ ముందుకు వచ్చేటప్పటికీ ఆ జోష్, ఆ యాక్టీవ్‌నెస్ అనేది ఆటో మేటిక్‌గా వచ్చేస్తుంది. అందువల్ల దీనిని బ్యాలెన్స్ చేయడం అనేది పెద్ద సమస్య కాలేదు. నిజం చెప్పాలంటే ఆర్జేయింగ్ అనేది రిఫ్రెషింగ్ వర్క్ నాకు.


మీ పేరులో డాక్టర్ ఎలా యాడ్ అయింది?

నేను నాటకరంగంలో పీహెచ్‌డి చేయడం ద్వారా డాక్టరేట్ పొందిన డాక్టర్ని.


ఒకవైపు ఆర్జేగా చేస్తున్నారు, టీవీలో చేసిన అనుభవం ఉంది. నాటకరంగంలో పీహెచ్‌డి వరకు చదివారు. వీటిలో ఏది మీకు ఎక్కువ ఇష్టం?

దేని దారి దానిదే. అన్నీ కూడా డిఫరెంట్ జోనర్లు. అయితే మీరు ముందు అడిగిన ఆర్జే అవ్వడం, టీవీలో చేయడం అనేది రెండూ కూడా నేను థియేటర్ ఆర్ట్స్ చేయడం వల్లే సాధ్యమయ్యాయి. అయితే ఆర్జేయింగ్ టోటల్‌గా డిఫరెంట్ జోనర్. ఆర్జేయింగ్ అనేది అనేక పాత్రలను, ఎమోషన్స్‌ని ఒకే వ్యక్తి నిర్వహించాలి. కేవలం మాటల ద్వారా ఎంటర్‌టైన్ చేయాలి. ఇది నన్ను ఆకర్షించింది. క్రియేటివ్ వర్క్‌గా భావిస్తూ షోను ఇష్టంగా చేస్తా. అందువల్లే ఎన్ని పనులు, ఉద్యోగాలు చేసినా, వదిలేసినా, గత 14 సంవత్సరాలుగా ఆర్జేయింగ్ మాత్రం వదల్లేదు.

మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ…?

యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలనేది నా డ్రీం. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నా.

RJలు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్..

మెస్సేజ్‌లు ఇచ్చేటంతటి వాడిని కానుగానీ, ఒక విషయం మాత్రం గట్టిగా చెప్తా. ఆర్జేయింగ్ అంటే ప్యాషన్ ఉండాలి. మీ మాటలు కొన్ని లక్షల మెదళ్లని కదిలిస్తాయి అనేది గుర్తుంచుకుని, భాషపైన పట్టు, దానికి తగ్గ ప్రాక్టీస్, మన చుట్టూ నిత్యం జరిగే విషయాలపై అవగాహన పెంచుకుని ఈ రంగంలోకి రండి. ఆర్జేయింగ్ అంటే మాటల ద్వారా మనుషుల్ని ఉల్లాసపరిచే ఒక మంత్రం.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*