
సింగపూర్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా సింగపూరలో “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా, సహస్రావధాని, బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు పాల్గొని తమ ఆశీస్సులను అభినందనలను అందించారు. వినాయక చవితి విశిష్టతను వర్ణించి వినాయకుని ఆకార విశేషాన్ని అవతార విశేషాల వెనుక ఉన్న పరమార్థాన్ని విశదీకరించారు. చిత్తశుద్ధిలేని ఆర్భాటాలు, ఆడంబరాలు భక్తి అనిపించుకోవని , భగవంతునిపై ప్రేమతో చేసే పూజలే సంతృప్తిదాయకం, సత్ఫలితదాయకం అని తెలియజేశారు.వినాయక వ్రత కథ మహత్యం, దాని వెనుక ఆంతర్యం గురించి గరికిపాటి నరసింహారావు సోదాహరణంగా చక్కటి చలోక్తులతో ఆసక్తికరంగా వివరించారు. నేటి కరోనా పరిస్థితుల నుండి మానవజాతి నేర్చుకోవలసిన పాఠాలను గురించి కూడా అన్వయించి ఆద్యంతం అత్యద్భుతంగా ప్రవచించారు.
Posted by Sri Samskrutika Kalasaradhi, Singapore on Saturday, August 22, 2020
దేశవిదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చేయబడిన ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి ఆనందించారు. సింగపూర్ తెలుగు ఆడపడుచులు విద్యాధరి, సౌభాగ్యలక్ష్మి, పద్మావతి వినాయకుని కీర్తిస్తూ భక్తి సంకీర్తనలు ఆలపించారు. “సింగపూర్ లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు కళలకు అద్దం పట్టే విధంగా కార్యక్రమాలు రూపొందించి నిర్వహించడమే మా సంస్థ యొక్క ఆశయమని, నేటి పరిస్థితుల పరిమితులను దృష్టిలో పెట్టుకొని అంతర్జాలం ద్వారా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ వినాయకచవితి పండుగనాడు ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశమని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు.
దాదాపు రెండు గంటలపాటు అత్యద్భుతంగా సాగిన ఈ కార్యక్రమానికి శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు, పాతూరి రాంబాబు ముఖ్య నిర్వాహకులుగా వ్యవహరించగా ఊలపల్లి భాస్కర్, గణేశ్న రాధా కృష్ణ, కిరణ్ కుమార్ తూము సాంకేతిక సహకారం అందించారు.
Be the first to comment