లింగ వివక్ష లేని సమాజం సాకారం కావాలి: వెంకయ్య మనోగతం

న్యూఢిల్లీ: లింగ వివక్ష లేని సమాజం సాకారం కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిలషించారు. సామాజిక దృష్టికోణంలో మార్పురావాలని సూచించారు. మనోగతం పేరిట ఆయన సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా వివిధ సామాజిక అంశాలపై రాస్తూ వస్తున్నారు. తాజాగా లింగవివక్ష లేని సమాజాన్ని కాంక్షిస్తూ ఆయన ఆర్టికల్ రాశారు.

పూర్తి పాఠం…

2022 నాటికి భారతదేశం స్వాతంత్ర్యం సముపార్జించి 75 సంవత్సరాల మైలు రాయిని అధిగమించి ముందుకు సాగబోతోంది. ఈ తరుణంలో ఆహారభద్రత మొదలుకుని ఔషధాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రశ్రేణి దేశాల్లో ఒకటిగా భారత్ సాధించిన విజయాలు మనందరికీ గర్వకారణం. అదే సమయంలో కార్యనిర్వాహక, శాసన మరియు న్యాయ వ్యవస్థలను ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభాలుగా భావిస్తూ, వాటి పునాదుల్ని బలోపేతం చేసుకునే దిశగా ముందుకు సాగి శక్తివంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గొప్పతనాన్ని సగర్వంగా చాటుతున్నాము కూడా. నిజానికి నాలుగో స్తంభం మీడియా కూడా మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, వ్యవస్థ గొప్పతనాన్ని చాటడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలకు గర్విస్తూనే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళ మీద కూడా దృష్టి పెట్టడం మనందరి బాధ్యత. దాదాపు 20 శాతం మంది జనాభా దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా, అదే స్థాయిలో నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. వీటితో పాటు స్వాతంత్ర్యం సముపార్జించుకున్న ఏడు దశాబ్ధాల తర్వాత కూడా దేశం సామాజిక, లింగ వివక్ష లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉండడం ప్రజలను కలిచివేసే అంశం. నవభారత నిర్మాణ మార్గంలో ఎదురౌతున్న పేదరికం, నిరక్షరాస్యత మరియు ఇతర సామాజిక అడ్డంకుల మీద మనం సమష్టిగా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. సుసంపన్నమైన, సంతోషకరమైన నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కీలక భాగస్వామి కావాలి. ఈ మహా యజ్ఞంలో కుల, మత, లింగ, వర్గ, వర్ణ, భాషలకు అతీతంగా, ఎలాంటి వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి.

ఈ వారంలోనే ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఫర్ పాపులేషన్ అండ్ డెవలప్ మెంట్ ( ఐ.ఏ.పి.పి.డి) రూపొందించిన “భారత దేశంలో శిశు లింగ నిష్పత్తి (స్టేటస్ ఆఫ్ సెక్స్ రేషియో ఎట్ ఇండియా)” మరియు “భారతదేశంలో పెద్దల జనాభా స్థితి (ఎల్డర్లీ పాపులేషన్ ఇన్ ఇండియా)” అనే రెండు నివేదికలను విడుదల చేశాను.

ఈ నివేదిక (2001 నుంచి 2017 వరకూ) లింగ నిష్పత్తి ప్రతికూల పరిణామం రూపంలో ఎదురౌతున్న సామాజిక సమస్యను అరికట్టాల్సిన ప్రాధాన్యతను తెలియజేయడమే గాక, ఇదే ధోరణి కొనసాగితే సమాజ స్థిరత్వం మీద పడే తీవ్రమైన పరిణామాలను తెలియజేస్తూ హెచ్చరిస్తోంది.

భారతీయ సంస్కృతి అనాదిగా మహిళలకు గౌరవం ఇచ్చి, సమాన స్థాయిని అందించిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్త్రత్రాఫలా క్రియః”

అంటే ఎక్కడ స్త్రీలు గౌరవం అందుకుంటారో అక్కడ దైవత్వం వికసిస్తుంది. ఎక్కడ స్త్రీలు గౌరవం అందుకోరో అక్కడ చేసే పనులన్నీ నిష్ఫలం అని అర్థం. వేదకాలంలో గార్గి, మైత్రేయి, ఘోషా, విశ్వతార వంటి ఎంతో మంది మహిళలు వేద విద్యను అభ్యసించి, బోధించారు. పురుషులతో సమానమై గౌరవాన్ని, హోదాను పొందారు. చర్చా వేదికల్లో పాల్గొన్నారు. మహిళలను గౌరవించడం, వారి ప్రతిభను, సహకారాన్ని గుర్తించడం భారతీయ జీవన విధానం. మన నదుల్లో సింహ భాగం మహిళల పేర్లతోనే అలరారుతున్నాయి.

భారతదేశ చరిత్రలో అద్భుతమైన ప్రతిభతో, సాటిలేని విజయాలతో తమకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్న స్త్రీ మూర్తులు ఎందరో ఉన్నారు. రెండో చంద్రగుప్తుని కుమార్తె ప్రభావతి తమ రాజ్యంలో పరిపాలనా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఝాన్సీ రాణి లక్ష్మి బాయ్, గోండు రాణి దుర్గావతి, కిట్టూర్ చెన్నమ్మ, ఢిల్లీని పాలించిన ఏకైక మహారాణి రజియా సుల్తానా సహా ఎందరో ఈ జాబితాలో ఉన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మొదలుకుని క్రీడల వరకూ ఆంక్షల అద్దాల మేడలు పగలగొట్టి, భారత దేశ ఖ్యాతిని దిగ్దిగంతాలకు వ్యాప్తి చేసిన ఎందరో మహిళా మూర్తులు మన దేశానికి గర్వకారణం.

అయితే దురదృష్టవశాత్తు, కారణాలు ఏవైనా శతాబ్ధాలుగా మన సంస్కృతి గర్వించే ఎన్నో విలువలు క్రమంగా క్షీణించడమే గాక, కూతురి కంటే కొడుకుకే ప్రాధాన్యత ఇవ్వడం లాంటి అవాంఛిత పద్ధతులు భారత సాంఘిక జీవనంలోకి అసంకల్పితంగా ప్రవేశించాయి. ఈ పరిస్థితులు బాలికల భ్రూణ హత్యలు, శిశు హత్యల వంటి అమానవీయ సంఘటనలకు తావిచ్చాయి.
2001 నుంచి 2017 మధ్య కాలంలో భారతదేశం మహిళా లింగ నిష్పత్తిలో ఎలాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకోలేదని ఐ.ఏ.పి.పి.డి. నివేదిక పేర్కొంటోంది. పుట్టిన ఆడపిల్లల సంఖ్య సాధారణ లేదా సహజమైన దాని కంటే చాలా తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ప్రతి 1000 మంది పురుషులకు 889 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అంతే కాదు ఏటా సరాసరిన 109 మంది బాలురు జన్మిస్తుంటే, కేవలం 100 మంది మాత్రమే బాలికలు జన్మిస్తున్నారని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి.

ఈ విషయంలో భారతీయ సమాజం మొదలుకుని, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వం, విధాన నిర్ణేతలు, నాయకులు, మీడియా సంస్థలు, మహిళా సాధికారత కోసం పని చేస్తున్న వివిధ సంస్థల వరకూ ప్రతి ఒక్కరూ ఈ వివక్ష పరిష్కారం దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.
ఈ సందర్భంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆవేదనా పూరితమైన మాటలను తెలియజేయాలనుకుంటున్నాను. “కొడుకు పుడితే సంతోష పడేందుకు, కూతురు పుడితే బాధ పడేందుకు సరైన కారణమేదీ నాకు కనిపించడం లేదు. ఇరువురూ దైవ ప్రసాదితాలే. జీవించడానికి వారికి సమానమైన హక్కు ఉంది. అదే సమయంలో ప్రపంచం ముందుకు సాగడానికి ఇది అత్యంత కీలకం కూడా” అంటూ మహాత్ముడు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

బాలికలు మరియు మహిళల పట్ల జరుగుతున్న వివక్ష కావచ్చు లేదా హింసను కావచ్చు, అది ఏ రూపంలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని సహించరాదు. వీటిని మార్చే సంకల్పంతో ప్రారంభించిన “బేటీ బచావో, బేటీ పఢావో” పథకం సానుకూల ప్రభావాన్ని చూపించిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో సామాజిక దృష్టి కోణంలో మార్పు తీసుకురావడం కూడా అత్యంత ఆవశ్యకం. మహిళా సాధికారతను సాధించడమే గాక, బాలికా విద్యకు ప్రోత్సాహం అందించడం లాంటివి ఒక సామాజిక ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లింగ నిష్పత్తిలో సమతుల్యతను తీసుకురావడానికి ప్రీ కాన్సెప్షన్స్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పి.సి. అండ్ పి.ఎన్.డి.టి) చట్టం చురుగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.

భారతదేశ జనాభాలో 50 శాతం మంది మహిళలు ఉన్న నేపథ్యంలో, రాజకీయ రంగంతో సహా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో మహిళల ఆర్థిక సాధికారత కూడా కీలకమైనది. మహిళలకు చట్టసభల్లో సముచిత రిజర్వేషన్ కల్పించాలన్న దీర్ఘకాలిక ప్రతిపాదన పై అన్ని రాజకీయ పార్టీలు సత్వరం ఏకాభిప్రాయానికి రావాలి. అదేవిధంగా ఆస్తి హక్కులోనూ మహిళకు సమాన అధికారాలు చట్టబద్ధంగా కల్పించాలి. ఇది పురోగతి మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. దేశంలో లింగ వివక్ష లేదనే విషయాన్ని మన మాటల్లో, చేతల్లో స్పష్టంగా చూపించడమే లక్ష్యంగా ప్రతి భారతీయ పౌరుడు సమష్టిగా ముందుకు సాగాలి.

ఈ ప్రతికూల లింగ నిష్పత్తి విషయంలో ఆయా ప్రాంతాలు ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం దృష్టి కేంద్రీకరించాలని ఆశిస్తున్నాను. ఈ సమస్య కారణంగా భవిష్యత్ లో ఎదురు కానున్న సవాళ్ళ మీద సమాజంలో అవగాహన కల్పించేందుకు వారు చొరవ తీసుకోవాలి. వరకట్నం లాంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రతి పౌరుడు ముందుకు రావాలి. “పుత్ర ప్రాధాన్య” మనస్తత్వం మన మెదళ్ళ నుంచి పూర్తిగా దూరంగా కావాలి. ఈ కలను సాకారం చేసేందుకు ప్రతి యువకుడు ఓ యోధునిగా వ్యవహరించాలి. సమాజంలో బాలికలకు మరియు మహిళలకు మనం సమాన ప్రాధాన్యత ఇవ్వడమే గాక, వారి సాధికారతను సాకారం చేసే ఏ అవకాశాన్ని వదలబోమని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని ఆకాంక్షిస్తున్నాను.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*