ఆన్ లైన్ విద్య అందరికీ అందాలి: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: ఆన్ లైన్ విద్య అందరికీ అందాలని, ఈ దిశగా విద్యా సంస్థలు, విద్యా వేత్తలు కృషి చేయాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్‌లు గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఎక్కువ మంది విద్యార్ధులకు అందుబాటులో లేవని, దీనివల్ల వారు విద్యకు దూరం కాకూడదని గవర్నర్ అన్నారు. “ఇన్నోవేషన్స్ ఫర్ న్యూ నార్మల్” అన్న అంశంపై జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ వర్చువల్ సెమినార్ లో ఈరోజు ముఖ్య అతిధిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్.ఆర్.ఏ) ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో గొప్ప మలుపన్నారు. ఎన్.ఆర్.ఏ ద్వారా ఏటా 1.35 లక్షల కేంద్ర ఉద్యోగాలు భర్తీ అవుతాయని, దాదాపు 2.5 కోట్ల నుండి 3 కోట్ల మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరవుతారని, ఎన్.ఆర్.ఏ ద్వారా ఇంతమంది అనేక పోటీ పరీక్షలు, వివిధ ప్రాంతాలలో రాసే ఇబ్బందులు తొలుగుతాయన్నారు.

ఆవిష్కరణలు అనేవి నవభారత నిర్మాణానికి ఎంతో తోహదపడుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విధంగా స్ఫూర్తి పొంది దేశాన్ని నవశకంలోకి తీసుకువెళ్ళే ఆవిష్కరణలు చేయాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు. కొత్త తరహా ఆలోచనలు, సృజనాత్మకతతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమౌతాయని గవర్నర్ సూచించారు. వరంగల్ (రూరల్) జిల్లా పర్కాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ సెమినార్ నిర్వహిస్తున్నది. కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమీషనర్ నవీన్ మిట్టల్, ఐఐఎమ్ ఆచార్యులు జి. శ్రీనివాస్, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటి ఆచార్యులు గిరిజా శంకర్, దాదాపు 200 మంది పత్ర సమర్పకులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*