హాట్‌హాట్‌గా కొనసాగుతోన్న CWC సమావేశం.. ఆజాద్, సిబల్‌పై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగుతోంది. నాయకత్వం నుంచి సోనియా తప్పుకోవాలంటూ 23 మంది సీనియర్ నేతలు రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని రాహుల్ ప్రశ్నించినట్లు తెలిసింది. సోనియాకు అనారోగ్యం సమయంలో, రాజస్థాన్‌లో పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో లేఖ ఎలా రాస్తారని రాహుల్ ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీలో సీనియర్లకు నిబద్ధత లేకుండా పోయిందని రాహుల్ మండిపడ్డారు.

అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీ కార్యకర్తల్లా మారారని రాహుల్ ఆరోపించడంపై కపిల్ సిబల్ తీవ్రంగా రియాక్టయ్యారు.

30 ఏళ్లుగా పార్టీకి సేవలందించిన తనకు బీజేపీతో లింకు పెట్టడాన్ని సిబల్ ఆక్షేపించారు.

ఆజాద్ అయితే తనను బీజేపీ ఏజెంట్ అని రాహుల్ ఆరోపించడంపై నొచ్చుకున్నారు. తనను బీజేపీ ఏజెంట్‌గా నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని ఆజాద్ చెప్పారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో 48 మంది సభ్యులు పాల్గొన్నారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, మోతిలాల్ఒరా, ముకుల్ వాస్నిక్, అంబికా సోని, ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, చిదంబరం, ప్రియాంక గాంధీ, ఆనంద్ శర్మ సహా సిడబ్ల్యుసి సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకత్వ మార్పు, పార్టీ కేంద్ర కార్యాలయ మార్పు, క్షేత్ర స్థాయి నుంచి ఏఐసీసీ వరకు పార్టీ ప్రక్షాళన, సీనియర్ జూనియర్ల మధ్య సమన్వయం, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు, క్షేత్ర స్థాయి నుంచి ఏఐసీసీ వరకు కమిటీల నియామకం అంశాలపై చర్చిస్తున్నారు.

రాహుల్‌ను ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రకటించాలంటూ సీనియర్ నేత ఏకే ఆంటొనీ ప్రతిపాదించగా సోనియాయే కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందనే అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శశిథరూర్, అశోక్ గెహ్లాట్, కెప్టెన్ అమరీందర్ సింగ్, సచిన్ పైలట్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చేస్తోన్న ఆరోపణలను తిప్పకొట్టేందుకు నెహ్రూ కుటుంబేతరులకు కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ యోచిస్తున్నారని తెలిసింది. అయితే చివరకు పార్టీలోని సీనియర్ నేతలంతా రాహులే కొనసాగాలని నిర్ణయించడంతో రాహుల్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*