దావూద్ ఇబ్రహీం ప్రేయసి మెహ్విశ్ హయాత్‌కు పాక్ అత్యున్నత పురస్కారం

ఇస్లామాబాద్: మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం ప్రేయసి, నటి మెహ్విశ్ హయాత్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం తమ్‌గా ఎ ఇంతియాజ్ అనే అత్యున్నత పురస్కారం అందించడం వెనుక అసలు సంగతి బయటపడింది. సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఐటెం సాంగ్స్ చేసుకునే నటికి సినిమా రంగంలోని అత్యున్నత పురస్కారం అందజేయడంపై పాక్‌లో కలకలం రేగింది. దావూద్‌కు ప్రేయసి కావడం వల్లే ఆమెకు ఈ అవార్డు దక్కిందని పాక్ మీడియా కోడై కూస్తోంది.

ప్రస్తుతం మెహ్విశ్ హయాత్‌‌కు బోలెడన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు ఆమెతో సినిమాలు రూపొందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

దావూద్ కన్నా 27 సంవత్సరాలు చిన్నదైన మెహ్విశ్ హయాత్‌‌కు వస్తున్న తాజా అవకాశాలు చూసి పాకిస్థాన్ సినిమా ఉద్ధండులే ఆశ్చర్యపోతున్నారు.

మెహ్విశ్ హయాత్‌‌కు ఇంత ప్రియారిటీ పెరగడానికి కారణం దావూద్‌కు ప్రేయసి కావడమేనని పాకిస్థానీలందరికీ తెలుసు. దావూద్ భారత్‌లో ఉన్నప్పుడు నటి మందాకినితో ఎఫైర్ నడిపాడు. దీంతో సినిమా వాళ్లతో దావూద్‌కుండే సన్నిహిత సంబంధాలు బాలీవుడ్‌తో పాటు పాకిస్థానీలందరికీ తెలుసు. అయితే ఇమ్రాన్ సర్కారు మాత్రం దావూద్ పాక్‌లో లేడని బుకాయిస్తోంది. పాకిస్థాన్‌లోని దావూద్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు సంబంధించిన 23 స్థావరాలను మీడియా సంపాదించింది. అతడి కుటుంబానికున్న 19 ఆస్తులను గుర్తించింది. కరాచీలో ప్రభుత్వ బలగాల సంరక్షణలో దావూద్ సురక్షితంగా ఉన్నాడని మీడియా ధృవీకరిస్తున్నా ఇమ్రాన్ సర్కారు బుకాయిస్తోంది. ప్రస్తుతం దావూద్‌తో పాటు అతడి కుమారుడు, అల్లుడు కూడా అండర్ వరల్డ్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటున్నారని మీడియా వెల్లడించింది. అనేక దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించిన దావూద్ భారత్‌ను అస్థిరం చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాడు. కశ్మీర్‌లో యువతను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడంతో పాటు భారత్‌లో వేర్వేరు ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడే ముఠాలను, స్లీపింగ్ సెల్స్‌ను తయారు చేస్తూ పాకిస్థాన్‌ ఆర్మీ, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చేయలేని పనులన్నీ చేస్తూ పాక్ ప్రభుత్వానికి ప్రియమైనవాడయ్యాడు. పాక్‌లోని ఉగ్రవాద సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్నాడు. అందుకే దావూద్‌కు, అతడి కుటుంబ సభ్యులకు దేశ పౌరసత్వం ఇవ్వడమే కాకుండా పూర్తి రక్షణ కల్పిస్తోంది. దావూద్ వద్ద అనేక దేశాల పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి.

1993లో ముంబై పేలుళ్ల దోషి అయిన దావూద్ పేలుళ్ల తర్వాత పాకిస్థాన్‌కు పారిపోయి తలదాచుకున్నాడు. 1993 బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోయారు. 1400 మంది గాయపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*