
హైదరాబాద్: ఆ గొంతు జానపద గీతాలకు కేరాఫ్ అడ్రస్. ఆ నోటి నుంచి జాలువారే పల్లె పదాలు పండుగ చేసుకుంటాయి. పాత మాటలను వెతికి పట్టినట్టే ఉంటాయి ఆ పాటలు. నాన్నమ్మ తొలి గురువుగా ఆమె మొదలుపెట్టిన పాటల ప్రయాణానికి తొలి వేదిక బడి. స్టేజీ ఎక్కిపాడుతుంటే అందరూ అటువైపే. ఆ తర్వాత కాలేజీలోనూ ఆమె పాట ప్రత్యేక బాణీ సంతరించుకుంది.
అచ్చమైన జానపద పాటలను వెలికి తీస్తున్న మైక్ టీవీ తెలుగు రాష్ట్రాలకు అఖిలను పరిచయం చేసింది. ఆ పల్లె పాటల బంగారు తల్లి అడ్ల అఖిల గౌడ్. పాలమూరుకు చెందిన అఖిల.. తాజాగా గట్టుకు గన్నేరాకు పాటతో మరోసారి జనం ముందుకు వచ్చింది. అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే పాటకు వేలల్లో వ్యూస్ రావడం విశేషం.
అఖిల నాయనమ్మ నర్సమ్మ పల్లె పాటల పూదోట. ఆమె ఎన్నో పాటలకు బాణీ కట్టిందని.. అప్పటికప్పుడు పాటలను కట్టడంలో ఆమెకు ఆమే సాటని అఖిల తెలిపింది.
తాను నగరంలోని సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ చదివానని.. నాన్న మహేశ్ గౌడ్, అమ్మ లక్ష్మి ఇచ్చిన ప్రోత్సాహం మరిచిపోలేనని తెలిపింది.
ముఖ్యంగా తన గురువు ..
జానపద గాయకుడు జంగి రెడ్డి ఇచ్చిన తోడ్పాడుతోనే ఇంత దూరం రాగలిగానని చెప్పింది.
మైక్ టీవీ నిర్వహించి ఫోక్ స్టూడియో పోటీలతో తాను వెలుగులోకి వచ్చినట్టు పేర్కొంది.
అయితే ఆ పోటీలలో తాను గెలుపొందక పోయినా.. ఆ తర్వాత వారు రూపొందించిన సంక్రాంతి పాట గొబ్బియల్లో గొబ్బియల్లో ప్రత్యేక గుర్తింపునిచ్చిందని తెలిపింది.
సోషల్ మీడియాలోనూ అఖిల చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన కొత్త పాటల వివరాలు అభిమానులకు అందిస్తోంది.
అఖిల మరింత బాగా పాడుతూ ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంటూ జానపద పాటల్లో తనదైన ముద్రను వేయాలని ఈక్షణం టీం కోరుకుంటోంది.