
న్యూఢిల్లీ: ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన ‘మన భాష – మన సమాజం – మన సంస్కృతి’ అంతర్జాల సదస్సును ప్రారంభించిన ఆయన, గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాష, సంస్కృతి, సమాజం పరంగా మనం ఎక్కడ ఉన్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవటం ముదాహమని తెలిపారు. మాతృభాష దినోత్సవమంటే నిజమైన స్వాభిమాన దినోత్సవమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, విదేశాల్లో ఉంటూ మాతృభాష కోసం తపిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలకు, అదే విధంగా ఈ కార్యక్రమ ఏర్పాటుకు చొరవ తీసుకున్న, పాల్గొన వారందరికీ అభినందనలు తెలియజేశారు.
మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడమంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదు. అన్ని భాషలు నేర్చుకుని మాతృభాషను మనసులో నిలుపుకోవాలి. భాష ద్వారా మంచి సంస్కృతి, తద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.#TeluguLanguageDay pic.twitter.com/hMCeJvPdLU
— Vice President of India (@VPSecretariat) August 29, 2020
బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞను చూపించిన గిడుగు వారు, విజ్ఞానం అందరికీ అందాలనే సంకల్పంతో, వ్యావహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారన్న ఉపరాష్ట్రపతి.. ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదని భావించారని.. పుస్తకాల్లోనూ సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని.. ఫలితంగా తెలుగు భాష దినదిన ప్రవర్థమానమై వెలుగొందుతుందన్నదే వారి ఆకాంక్ష అని పేర్కొన్నారు. కొద్దిమందికే పరిమితమైన విద్య.. శ్రీ గిడుగు వారి ఉద్యమం కారణంగా అందరికీ చేరువైందని, పండితులకే పరిమితమనుకున్న సాహిత్య సృష్టి, సృజనాత్మకత ప్రజలందరి పరమయ్యాయని, మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహనీయుకి అందించే నిజమైన నివాళి అని తెలిపారు.
పురోభివృద్ధిని కోరుకునే వారు పూర్వవృత్తాన్ని మరువకూడదన్న పెద్దల మాటను ఆదర్శంగా తీసుకోవాలి. మన కట్టు, మన బొట్టు, మన భాష, మన యాస, మన పండుగలు, పబ్బాలు ఇలా అన్నింటిని గౌరవించుకుని మన సంస్కృతిని కాపాడుకోవాలి. ముందు తరాలకు అందించాలి. #TeluguLanguageDay pic.twitter.com/uv3PdeNCDH
— Vice President of India (@VPSecretariat) August 29, 2020
మాతృభాష నేర్చుకోవడం మాట్లడటం కోసమే కాదన్న ఉపరాష్ట్రపతి, ప్రతి నాగరికత తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేసిందని, మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు భాష లేకుండా పెంపొందలేవని తెలిపారు. భాష సమాజాన్ని సృష్టించి, జాతిని బలపరచి అభివృద్ధికి మార్గం వేస్తుందన్న ఆయన.. మన గతం, సంస్కృతి, చిరునామాలను భవిష్యత్ కు తెలియజేయడం భాష ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పలు భాషలు అంతరించే ప్రమాదంలో పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, అన్ని శాస్త్రాలను వారి వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, రష్యా, జపాన్, చైనా, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్లదేశాలతో పోటీ పడుతున్నాయని, ఆయా దేశాల ఒరవడి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి భాష, సంస్కృతులే పునాది. ప్రపంచీకరణ నేపథ్యంలో పలుభాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. వాటిని కాపాడుకోవాలి. మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్న ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, రష్యా, జపాన్, ఇటలీ, బ్రెజిల్ దేశాల ఒరవడిని ఆదర్శంగా తీసుకోవాలి. #TeluguLanguageDay
— Vice President of India (@VPSecretariat) August 29, 2020
20వ శతాబ్దం తొలినాళ్ళలో కందుకూరి వీరేశలింగంపంతులు, గురజాడ అప్పారావు, కొమర్రాజు లక్ష్మణ రావు, గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాష వైభవాన్ని ఎలుగెత్తి చాటారన్న ఉపరాష్ట్రపతి, పిల్లలకు బోధించే విషయాలు వారి జీవితానికి వెలుగు చూపాలని, కేవలం పాండిత్యం కోసం ఉపయోగం లేని విషయాలను వారి చేత వల్లె వేయించటం ద్వారా కాలం వ్యర్థం అవుతుందన్న కొమర్రాజు వారి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాని తెలిపారు. స్థానిక భాషల మీద ఆయా ప్రాంతాల విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని సూచించిన ఉపరాష్ట్రపతి, నూతన జాతీయ విద్యావిధానం – 2020 సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ, భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దే దిశగా ఉందని అభిప్రాయపడ్డారు.
పురోభివృద్ధిని కోరుకునే వారు పూర్వ వృత్తాన్ని మరువకూడదన్న పెద్దల సూక్తిని గుర్తు చేసిన ఉపరాష్ర్టపతి, మన సంస్కృతిని మరచిపోరాదని మన కట్టు, బొట్టు, మన భాష, ప్రాస, యాస, మన గోస.. మనమెప్పుడూ విడవరాదని, మనపద్యం, గద్యం, మన పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటినీ గౌరవించుకుని, ఎక్కడ ఉన్నా శ్రద్ధగా జరుపుకోవాలని సూచించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ గిడుగు వారు, విజ్ఞానం అందరికీ అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషోద్యమానికి నాంది పలికారు. పుస్తకాల్లోనూ సులభమైన భాషను వాడాలని ఉద్యమించారు. తద్వారా తెలుగు భాష అభివృద్ధిని ఆకాంక్షించారు. మాతృభాషను కాపాడుకోవడమే వారికిచ్చే నిజమైన నివాళి.#TeluguLanguageDay pic.twitter.com/qDMnPuaxYO
— Vice President of India (@VPSecretariat) August 29, 2020
భాషను బట్టే జాతిని గుర్తిస్తారన్న ఉపరాష్ట్రపతి, సాంకేతిక రంగంలో నిపుణులుగా మారుతున్న విద్యార్థులు మాతృభాష పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ పరిజ్ఞానాన్ని సామాన్యులకు కూడా చేరువ చేయవచ్చని, ఫలితంగా గిడుగు వారు కలగన్న విజ్ఞాన, వికాసాలు సాధ్యమౌతాయని తెలిపారు. మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడమంటే ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదని, అన్ని భాషలను నేర్చుకుంటూ మాతృభాషను మనసులో నిలుపుకోవాలని తెలిపారు. భాష ద్వారా మంచి సంస్కృతి తద్వారా ఉన్నతమైన సమాజం సాకారమౌతాని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో భాగం కావాలని ఆకాంక్షించారు.
శ్రీ గిడుగు వేంకట రామమూర్తి పంతులు జయంతి, తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని “మనభాష-మన సమాజం-మన సంస్కృతి” అంతర్జాల సదస్సు నిర్వహణ అభినందనీయం. ఇందు కోసం చొరవ తీసుకున్న దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య, ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ఇతర సంస్థలకు అభినందనలు.#TeluguLanguageDay pic.twitter.com/DOuWLXHUFM
— Vice President of India (@VPSecretariat) August 29, 2020
ఈ కార్యక్రమంలో వేములవాడ శాసన సభ్యులు డా. రమేష్ చెన్నమనేని, తెలంగాణ జాగృతి సంస్థాపక అధ్యక్షులు కవిత, దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య అధ్యక్షులు విక్రమ్ పెట్లూరు, జర్మనీలోని హైడల్బర్గ్ విశ్వవిద్యాలయ భాష, సాంకేతిక అంశాల శాస్త్రవేత్త గణేష్ తొట్టెంపూడి సహా వివిధ విశ్వవిద్యాలయాల సంచాలకులు, తానా, ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్ బెర్రా – ఆస్ట్రేలియా, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ – ఆస్ట్రేలియా, తెలుగు కళా స్రవంతి – అబుదాబి, కలోన్ తెలుగు వేదిక – జర్మనీ, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, శ్రీ సాంస్కృతిక కళాసారధి – సింగపూర్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
On the occasion of Telugu Language Day, the Vice President Shri M. Venkaiah Naidu inaugurating the webinar 'Mana Bhasha-Mana Samajam-Mana Samskriti' organised by the South African Telugu Community.#TeluguLanguageDay pic.twitter.com/t8qQhEf2aI
— Vice President of India (@VPSecretariat) August 29, 2020
Be the first to comment