LAC వెంబడి మళ్లీ ఉద్రిక్తత… భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ… యుద్ధం తప్పదా?

లడక్: గల్వాన్ లోయ ఘటన మరవకముందే చైనా మరో దుస్సాహసానికి పాల్పడింది. లడక్ ప్యాంగ్యాంగ్ వద్ద చైనా సైనికులు భారత జవాన్లతో తలపడ్డారు. భారత భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిన చైనా సైనికులను భారత జవాన్లు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది.

ఘటన 29వ తేదీ రాత్రి సమయంలో జరిగింది. చైనా బలగాల దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యాన్ని భారీగా మోహరించారు.

మరోవైపు చుషూల్‌లో భారత్ చైనా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్నాయి. తాజా ఉద్రిక్తతలపై చర్చిస్తున్నారు. ఉద్రిక్తతలను తగ్గించే యత్నంలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి.

ఇటీవల గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు దుర్మార్గంగా వ్యవహరించి భారత జవాన్లపై దాడి చేశాయి. దీంతో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత సైనికులు చనిపోయారు. భారత జవాన్లు జరిపిన ప్రతీకార దాడిలో 50 మంది వరకూ చైనా సైనికులు చనిపోయారు. అయినా కూడా చైనా తమ సైనికుల మృతిని ధృవీకరించలేదు. అయితే రెండువైపులా నష్టం జరిగిందని మాత్రమే ప్రకటించింది. భారత జవాన్లపై చైనా బలగాల దాడి నేపథ్యంలో చైనాతో ఆర్ధిక సంబంధాలను పూర్తి స్థాయిలో తెంచుకోవాలని భారత్ నిర్ణయించింది. టిక్‌టాక్‌లాంటి యాప్‌లను నిషేధించడం, ఇప్పటికే ఖరారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం వంటి చర్యలు తీసుకుంది. దీంతో చైనా కొంత దారిలోకి వచ్చినట్లు కనపడింది. మళ్లీ ఎల్‌ఏసీ వెంబడి జే20 యుద్ధ విమానాలను, సైన్యాన్ని భారీ స్థాయిలో మోహరిస్తోంది.

చెప్పేదొకటి, చేసేదొకటిలా చైనా తీరు ఉండటంతో భారత్ పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి పూర్తి స్థాయిలో నిఘా పెంచింది. యుద్ధం వస్తే గట్టిగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమైంది. స్వయంగా ప్రధాని, రక్షణ మంత్రి, త్రిదళాధిపతి, ఆర్మీ చీఫ్ లడక్‌లో పర్యటించారు. యుద్ధం వస్తే దీటుగా తిప్పికొట్టేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలను రూపొందించారు. వ్యూహాల్లో భాగంగా ఫ్రాన్స్ నుంచి అత్యంత అధునాతనమైన రఫెల్ యుద్ధ విమానాలను ముందే తెప్పించుకున్న భారత్ మరిన్ని అత్యాధునిక ఆయుధాలను, క్షిపణి రక్షక వ్యవస్థలను రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం అంటూ వస్తే చైనాకు గట్టిగా గుణపాఠం నేర్పాలని భారత్ యోచిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*