భారత రాజకీయాలకు ఆదర్శం.. మోదీ-ప్రణబ్ అనుబంధం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. 2014లో తాను ఢిల్లీకి కొత్త అయినా ప్రణబ్ తన మార్గదర్శకత్వం, సహకారం అందిస్తూ తనను ఆశీర్వదించారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయనతో జరిగిన చర్చలను గుర్తు చేసుకున్నారు. ముఖ్య విషయాలపై ఆయన సలహాలను ఎప్పటికీ మరవలేనని మోదీ చెప్పారు.

రాష్ట్రపతి భవన్‌ను ప్రణబ్ ప్రజలకు చేరువ చేశారని మోదీ చెప్పారు. నూతన ఆవిష్కరణలు, సంస్కృతి, సైన్స్, సాహిత్యాలకు వేదిక చేశారని కొనియాడారు.
కేంద్ర మంత్రిగా ప్రణబ్ విశేష సేవలందించారని మోదీ కీర్తించారు. పార్లమెంటేరియన్‌గా ఉత్తమసేవలందించారని, బాగా ప్రిపేరై మాట్లాడేవారని మోదీ గుర్తు చేశారు.

అందరి అభిమానం పొందిన గొప్ప స్టేట్స్‌మన్‌ను భారత్ కోల్పోయిందని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

2014లో బంపర్ మెజార్టీతో గెలిచి ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు.. బీజేపీకి చెందిన ప్రధాని కావడం వల్ల మోదీని రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ఇబ్బంది పెడతారేమో అని రాజకీయ పండితులు అంచనా వేశారు. అయితే రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తూ ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రణబ్ తన పదవీకాలం పూర్తి చేశారు. మోదీతో ఆయనకున్న సయోధ్య ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసింది. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో వీరి అనుబంధం సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రణబ్ సేవలకు గుర్తింపుగా 2019లో కేంద్ర ప్రభుత్వం భారత రత్న అందించింది.

– కొత్తూరు విజయ్ కుమార్, జర్నలిస్ట్, గుడివాడ, ఆంధ్రప్రదేశ్.