ఉద్రిక్తతల వేళ మాస్కోలో చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ

మాస్కో: చైనాతో ఉద్రిక్తతల వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో చైనా రక్షణ మంత్రి వై ఫెంగేతో సమావేశమయ్యారు. రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. లడక్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాల బలగాలు భారీగా మోహరించబడి ఉన్న తరుణంలో ఇద్దరు మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతలూ సమావేశమయ్యారు.

గల్వాన్‌లో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైన్యం భారత జవాన్లపై దాడి చేసి కల్నల్ సంతోష్‌బాబుతో సహా 20 మందిని పొట్టనపెట్టుకుంది. దీంతో భారత్‌ చైనాతో ఆర్ధిక సంబంధాలు తెంచుకునేపనిలో పడింది. ఇప్పటికే టిక్‌టాక్, పబ్జీ వంటి యాప్‌లను నిషేధించడం ద్వారా చైనా సంస్ధలకు బోలెడంత నష్టం వచ్చింది. అదే సమయంలో అనేక టెండర్లను కూడా భారత్ రద్దు చేసుకుంది. ఎల్‌ఏసీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో మాస్కోలో రాజ్‌నాథ్ చైనా రక్షణ మంత్రిని కలుసుకుని చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సమావేశాల ద్వారా ప్రపంచ రక్షణ సహకారం పెంపొందుతుందని రష్యా రక్షణ మంత్రి షెర్జెయ్ తెలిపారు.

చైనా రక్షణ మంత్రి వై ఫెంగేతో జరిపిన చర్చల్లో ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు కట్టుబడి ఉండాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. చర్చల ద్వారానే వివాదం పరిష్కరించుకోవాలని సూచించారు. గత ఒప్పందాలకు చైనా కట్టుబడి ఉండాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*