స్వామి వివేకానంద సందేశాలతో స్ఫూర్తి పొందాను: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: స్వామి వివేకానంద సందేశంతో తాను స్ఫూర్తిని పొందానని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెప్పారు. వివేకానంద సందేశాలు శక్తిని, స్ఫూర్తినిస్తాయన్నారు. రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 21వ వార్షికోత్సవంతో పాటు స్వామి వివేకానంద చారిత్రక చికాగో ప్రసంగానికి 127 ఏళ్లైన సందర్భంగా ప్రత్యేక ఆన్‌లైన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

2 రోజుల ఆన్ లైన్ వెబినార్‌లో రెండో రోజు జరిగిన కార్యక్రమంలో సౌందరరాజన్‌‌తో పాటు రామకృష్ణ మఠ్, మిషన్ జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి గౌతమానంద మహరాజ్, హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద మహరాజ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద సంధానకర్తగా వ్యవహరించారు.

స్వామి వివేకానంద ప్రసంగాలలో విశ్వాత్మ భావం గురించి మత సామరస్యం గురించి, సర్వ మానవ సౌభ్రాతృత్వం గురించి మరియు మానవునిలోని దివ్యత్వం గురించి స్వామి గౌతమానందజీ మహరాజ్ ప్రస్తావించారు. ప్రపంచ శాంతిలో స్వామి వివేకానంద ప్రసంగాల పాత్ర గురించి, ఆయన సందేశం సమకాలీనత గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా వివేకానంద బాలవికాస కేంద్రం విద్యార్థిని పరివీత చికాగో ప్రసంగ పఠనం ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ సభ్యులు అజిత్ సింగ్, టిజికె మూర్తి, రాకా సుధాకర్, ఇతర ప్రముఖులు, వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 21వ వార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన ఆన్‌లైన్ కార్యక్రమంలో తొలిరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

-సాయి ప్రశాంతి నీల్దవార్, రామకృష్ణ మఠం వాలంటీర్, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*