బాలు గారితో నా అనుబంధం- మౌనశ్రీ మల్లిక్, సినీగేయ కవి

హైదరాబాద్: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు నన్ను అత్యంత ప్రభావితం చేశాయి. నా బాల్య జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఆయన పాట నాకు ఓదార్పు నేస్తమైంది. సినిమాకెళ్లినా, రేడియో విన్నా, గుడికెళ్ళినా, బడికెళ్ళినా, టీవీ చూసినా, నిద్రలోనూ, మెలకువలోనూ ఆయన పాట నా జీవనసర్వసంగా మారిపోయింది.

బాలుగారి గాన మాధుర్యంలో తెలుగు భాష సొబగు కాంతులీనుతూ నాకు సరి కొత్తగా పరిచయమైంది. ఆయన గొంతు నుండి జారి వారిన ప్రతి పదం మెదడులోకి దూసుకెళ్లి కొన్ని వేల పాటలు శాశ్వత జ్ఞాపకాల గదులను నిర్మించుకున్నాయి. రేడియోలో వచ్చే ఆయన పాటలను వినుకుంటూ వాటిని పాడుకోవడమే జీవితంగా మారింది. ఆ వయసులో పాటల్లోని పదాలకు అర్థం తెలియకపోయినా.. వయసు పెరిగుతున్న కొద్దీ ఆ పదాల భావం తెలుస్తూ వచ్చింది. గానం వైపు గీతరచన వైపు మనసు అలవోకగా ఒరిగిపోయింది. చాలా చిన్న వయసులో బాలు గారి ఇంటర్వ్యూ రేడియోలో విని, ఆయన గాత్ర మాధుర్యానికి ముగ్దుడనైపోయాను. టీవీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో ఆయన పాడటం, మాట్లాడటం చూసి ఆయనపై అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. మా ఇంటి గోడపై ‘శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం’ అని రాసుకుని ఆ పేరును ముట్టుకొని మురిసి పోయే వాడిని. అలా ఆయనపై ఏర్పడిన గురు భావం దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ వచ్చింది.

1980 తర్వాత బాలు గారు దక్షిణ భారతదేశానికి సంబంధించి యువతకు పాటను చేరువ చేసిన గాయక గురుతుల్యులు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర నటులతో పాటు ఎందరో నటులకు అద్భుతమైన పాటలు పాడారు. బాలు గారి గానంతో ప్రభావితులై ఎందరో గాయకులుగా మారారు. వేలాది మంది స్టేజీ కళాకారులుగా మారి ఉపాధి పొందుతున్నారు. ఈ శతాబ్దంలో యువతను అత్యంత ప్రభావితం చేసిన కళాకారుడు బాలు గారు.
వారిలో నేనూ ఒకడిని.

నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు సంగీతసాహిత్యాలతో ఏమాత్రం పరిచయం లేదు. చిన్నతనం నుండి బాలు గారి పాటలు వింటూ పెరిగాను. ఆయన పాట నాకు పాట నేర్పింది. ఆయన మాట నాకు మాట నేర్పింది. ఆ పాటే నాకు సంగీత సాహిత్య విలువలను నేర్పింది.

ఆ పాట రామాయణ మహాభారత భాగవతాలను పరిచయం చేసింది. మహాప్రస్థానం కవిత్వం వైపు నన్ను నడిపించింది. 1995లో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు బాలు గారు మేస్ట్రో అవార్డు స్వీకరించడానికి మా వరంగల్ వచ్చారు. ఆ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. నేను నా మిత్రుడు తుమ్మల రవి కుమార్ కలిసి వెళ్లి బాలు గారిని చూసి మురిసిపోయాం. అప్పుడే అనుకున్నాను నేను గీత రచయిత కావాలని. నేను రాసిన పాటలు బాలు గారు పాడాలనే లక్ష్యం పెట్టుకున్నాను. 1998లో హైదరాబాద్ చేరాను. ఆ తర్వాత ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. నిమ్మదిగా కవిగా గుర్తింపు పొందాను. ఇప్పుడు సినిమాలకు, సీరియళ్లకు రాస్తున్నాను.

ఇప్పటి వరకు అన్నీ కలిపి వెయ్యికి పైగా పాటలు రాశాను. అందులో ఓ రెండు పాటలు బాలు గారు పాడారు. నేను వేయి పాటలు రాయడం ఒక ఎత్తయితే, అందులో ఓ రెండు పాటలు బాలు గారు పాడటం మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి.
ప్రపంచం గర్వించదగ్గ ఆ మహా గాయకుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను.

~మౌనశ్రీ మల్లిక్, సినీగేయ కవి(89193 38546)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*