ఇంజనీరింగ్ అద్భుతం– దేశ రక్షణలో కీలకం..అటల్ టన్నెల్

ఇదో ఇంజినీరింగ్ అద్భుతం.. దేశ రక్షణలోనూ కీలకం.. ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు దీని సొంతం.. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ రహదారి కూడా ఇదే…ఇదంతా హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమైన అతి పొడవైన అటల్ రోహ్ తంగ్ సొరంగ మార్గం గురించే…ఈ సొరంగ మార్గం గురించి ఎంత చెప్పినా తక్కువే …ఇంత కాలానికి ఈ సొరంగమార్గం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది .యావత్ జాతికి అందుబాటులోకి వచ్చింది.

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ నుంచి కాశ్మీర్లోని లేహ్ ను కలిపే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రహదారిని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఏదో ఒక సొరంగ మార్గాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు అనుకుంటే పొరపాటే. ఎన్నో ప్రత్యేకతలు ఈ అటల్ రోహ్ తంగ్ సొరంగ మార్గం సొంతం. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ సొరంగ మార్గం ఒక ఇంజినీరింగ్ అద్భుతం కూడా…

కాశ్మీర్ లోని లఢక్ కు ఇది జీవన ప్రదాయిని కూడా,అదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు .సరిహద్దు భద్రత కు ఏ దేశమైనా ,ఏ ప్రభుత్వం అయినా తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అయితే ఎంతో ముందు చూపుతో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 2002 సంవత్సరం మే 26న రోహ్ తంగ్ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేస్తే మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. దాంతో ఆరేళ్లలో ఈ మార్గాన్ని పూర్తి చేయాలని భావించినా సాధ్యపడలేదు.ప్రస్తుతం బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి అటల్ బిహారీ వాజపేయి స్వప్నాన్ని సాకారం చేసింది.

శంకుస్థాపన జరిగిన నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు చోటు చేసుకున్న పరిణామాలను ప్రధాని మోడీ సొరంగం ప్రారంభం సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ అంటే నాటి ప్రధాని వాజ్ పేయికి ప్రత్యేకమైన ఇష్టం ఉండేది కూడా …మనాలిలో విడిది చేసి ఆ ప్రకృతి అందాలను వాజ్ పేయి ఆస్వాదించేవారు.దేశ రక్షణ పరంగా ఆ సరిహద్దు ప్రాంతం అభివృద్ధి ఎంతో ముఖ్యమని ఆయన ముందుగానే ఊహించారు. అప్పుడే కార్యాచరణ మొదలుపెట్టారు. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ అటల్ టన్నెల్ ద్వారా దేశ భద్రత పరంగా సైన్యానికి ఎంతో ఉపయోగ పడటమే కాదు,హిమాచల్ వంటి చిన్న రాష్ట్రం దేశంలోనే కాక ప్రపంచంలోని ప్రత్యేక గుర్తింపు పొందుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

భద్రతా దళాలు వేగంగా సరిహద్దులకు కోరుకోవడంలో ఈ సొరంగమార్గం ఎంతో కీలకం కానుంది. వ్యూహాత్మకంగా ను ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. గతంలో ఈ సొరంగాన్ని రోహ్ తంగ్ టన్నెల్ గా పిలిచినా 2019 డిసెంబర్ 24 న దీని పేరును అటల్ రోహ్ తంగ్ టన్నెల్ గా మార్చారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఈ సొరంగ మార్గం నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. సైనికులు హిమాచల్ నుంచి లేహ్ చేరుకోవటానికి, లేహ్ లో ఉన్న భద్రతా దళాలకు ఆహారం, ఆయుధాలు, ఇతర సామగ్రి సరఫరా చేయటానికి ఈ సొరంగ మార్గం ఎంతో కీలకంగా మారుతుంది. మంచు కారణంగా ఆరు నెలల పాటు అష్ట కష్టాలు పడే అక్కడి ప్రజలతో పాటు భద్రతా దళాలకు ఏడాది పొడవునా ఈ సొరంగం మార్గం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

దేశంలో గొప్ప పర్యాటక ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు ఈ అటల్ టన్నెల్ మరో అద్భుతం గా మారింది. అన్ని రకాలుగా ఈ టన్నెల్ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంజనీరింగ్ అద్భుతం గా మారిన ఈ అటల్ టన్నెల్ కు ఉన్న ప్రాధాన్యత ఏంటి ?
అసలు ఈ సొరంగ మార్గంలో ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారు..?
భద్రతా పరంగా టన్నెల్ లో ఎలాంటి ప్రమాణాలు పాటించారు..?
అత్యంత సురక్షితంగా ప్రయాణం సాగటానికి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి..?
భద్రతా దళాలకు ఏ విధంగా ఈ సొరంగమార్గం ఉపయోగపడుతుంది…?

అటల్ టన్నెల్ లో ఆకర్షించే అంశాలు

ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగమార్గం ఇండియాలోనే ఉందంటే అది మనకో గర్వకారణం. 9.02 కిలోమీటర్ల పొడవున నిర్మితమైన ఈ అటల్ టన్నెల్ నిర్మాణానికి 3500 కోట్లు ఖర్చు చేశారు. దీనివల్ల మనాలి నుంచి లఢక్ లోని లేహ్ వరకు వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. అయితే సంవత్సరం లో సగం రోజులపాటు మంచుతో పూడుకుపోయే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇది సొరంగమార్గం కావటంవల్ల దానిలోనికి మంచు వచ్చే అవకాశం లేదు . ఈ రహదారిని ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేదు.

ఇంతకాలం అక్కడి ప్రజలు లఢక్ వెళ్లేందుకు హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తాంగ్ పాస్ వైపు వెళ్లే లెహ్ -మనాలి హైవేను ఉపయోగించేవారు. అది ఏడాదిలో నాలుగు నెలల తెరచి ఉంటుంది. లడక్ వెళ్లేందుకు మరో మార్గం ఉన్నా దాని పరిస్థితి కూడా అంతే.

ఇప్పుడు ఈ సొరంగమార్గం తో ఏడాది పొడవునా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. ఈ అటల్ టన్నెల్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.దీని దక్షిణద్వారం మనాలి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక దీని ఉత్తర ద్వారం రాహౌల్ లోని తేలింగ్ సిస్సు గ్రామ సమీపంలో సముద్రమట్టానికి 3071 మీటర్ల ఎత్తులో ఉంది. మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా, నిరంతరాయంగా రాకపోకలు సాగటానికి అనువుగా ,అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా, అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. రెండు ముఖ ద్వారాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ సొరంగమార్గం వెడల్పు 10.5 మీటర్లు కాగా ఇందులో ఎనిమిది మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరిగింది. సింగిల్ ట్యూబ్ లో రెండు లైన్ల రోడ్డు నిర్మాణం దీని ప్రత్యేకత. 5.5 మీటర్ల ఓవర్ హెడ్ క్లియరెన్స్ సౌకర్యం కూడా వుంది.

ఈ సొరంగ మార్గంలో వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.రోజుకి మూడు వేల కార్లు 1500 ట్రక్కులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది.సొరంగ మార్గం పొడవునా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం దీని ప్రత్యేకత అత్యవసర సమయంలో సొరంగం నుంచి సంప్రదించేందుకు ప్రతి 150 మీటర్ల కు టెలిఫోన్ సౌకర్యం కూడా ఉంది .అగ్నిమాపక యంత్రాలను ప్రతి 60 మీటర్లకు ఏర్పాటు చేశారు. ప్రతి 250 మీటర్లకు ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ తో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటం భద్రతా ప్రమాణాలను మరింత పెంచింది. వీటన్నిటితో పాటు ప్రతి కిలోమీటరుకు గాలి నాణ్యత గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి 25 మీటర్లకు కు సొరంగం నుంచి బయటకు వెళ్లేందుకు దారి చూపే సూచీలు లైటింగ్ నూ అమర్చారు.సొరంగంలో వెలుతురు కోసం సెమీ ట్రాన్స్పరెంట్ వెంటిలేషన్ సిస్టమ్ ఏర్పాటయింది.

ఇలా అత్యాధునిక హంగులతో ఉన్న ఈ అటల్ టన్నెల్ ఇంజనీరింగ్ లో ఒక మహాద్భుతమేనని చెప్పాలి.దేశ సరిహద్దుల్లో భద్రతా దళాలకు ఉపయోగంగా అటు ప్రజలకు సౌలభ్యంగా నిర్మితమైన ఈ టన్నెల్ నాటి ప్రధాని వాజ్ పేయి కలలను సాకారం చేయడమే కాక, వాజ్ పేయి ప్రభుత్వ దూరదృష్టిని ప్రపంచానికి చాటింది. ఏదైనా అటల్ టన్నెల్ మాత్రం దేశానికి ఒక అద్భుతంగా మిగులుతోంది.

– వెలది కృష్ణకుమార్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*