మా పులిందల డాక్టరు గంగిరెడ్డి సారు గ్యాపకాలు

మా పులింద‌ల..
పిల్లల గంగిడ్డి సారు గ్యాపకాల్లో..
(AP CM JAGAN sir మామ ఆయప్ప)
…………………………..

మా పులింద‌ల తిక్కు అంతా డాక‌్టరు ఇ.సి.గంగిరెడ్డి సారుకు దండిగా ఫ్యాన్సు.
ఏంటికంటే ఆయ‌ప్ప చెయ్యి మంచిది. ప‌నిలో మామూలోడు కాదు. గొప్పోడు.

ఒక‌పారి పిల్ల‌ప్పుడు నాకు జ‌ర‌మొచ్చే మా నాయిన సిమాప‌ల్లెకు పిల్చ‌క‌పోయి అయ్య ద‌గ్గ‌ర అంత్రం ఏపిచ్చినాడు.త‌గ్గ‌ల్యా.క్రిష్ణ‌మూర్తి డాక్ట‌రు కాడికి ప‌ట్ట‌క‌పోయినాడు. ఇంజెక్ష‌న్ ఏపిచ్చినాడు. త‌గ్గ‌ల్యా. అప్పుడు నేను ఏడోత‌ర్తి. ‘పాడు నాకొడుకు జ‌రం. త‌గ్గ‌ల్యా. క‌నుగుడ్లు ఎల్లొచ్చానాయి. కండ్లు ప‌చ్చ‌గ‌యినాయి. నా బిడ్డ‌ను సంపుతాదేమో జరం’అని మాయ‌మ్మ వ‌ల‌వ‌ల ఏడ్చినాది. మా నాయిన టాక్ట‌రు ప‌ని ఇర్సిపెట్టి పులింద‌ల‌కు పోదాంపా ప్పా రెడీగా అన్యాడు ప‌ద్ద‌న. నిడెల్ల కాడికి మూడు కిలోమీట‌ర్లు న‌డ్సుకుంటా పోయినాం. రోడ్డు మీద నిల‌బ‌డి తాడిపిత్రి బ‌స్సు ఎక్కి పులింద‌ల‌కు పోయినాం. ఆ‌ నాపొద్దు పులింద‌ల‌కు గంగిడ్డి సారు ద‌గ్గ‌ర‌కు ప‌ద్ద‌నే ప‌ట్ట‌క‌పోయినాడు. గంగిడ్డి సారు నా చేయి ప‌ట్టుకోని, ఏం కాదులే బెరీన వ‌చ్చినావు అని.. ఎన‌క‌ల ఓ ఇంజ‌క్ష‌న్ పొడిచి, ట్యాబ్లెట్లు రాపిచ్చి ఇంగ పా..అయి మింగు బాగ‌ అన్యాడు. నా వేడి శ‌రీరం.. బాగైనాది. నాల్రోజుల‌కు తిరుక్కున్యా. అదీ గంగిడ్డి సారును ఫ‌స్టుపారి చూడ‌టం.

పిల్లల గంగిడ్డి సారు.. అని పేరు!
……………………………………….
E.C. గంగిడ్డి సారు అంటే మాక‌ల్ల క‌నుక్కోలేరు. పిల్ల‌ల గంగిడ్డి సారు అంటే ఎవుర‌యినా క‌నుక్కుంటారు. ఆమైన పేరు పోయినాడు. గంగిడ్డి సారు పిల్లోల్ల‌కు బాగా చూచ్చాడ‌ని మా జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు, పొద్దుటూరు, తాడిపిత్రి, ఏంప‌ల్లె, క‌డ‌ప‌, రాయ‌చోటి, రాజంపేట తిక్కే కాదు అట్ల తిరుప‌తి, అనంత‌పురం, బ‌ళ్లారి వ‌రుకూ ఫేమ‌స్సు ఆయ‌ప్ప‌. ఎంత‌కూ పోని, గ‌బ్బునాకొడుకు జ‌రాల‌న్నీ ఆయ‌ప్ప కాడికి పోతే దావ‌ప‌ట్టుకోని యాడికో దెంకోని పోతాయి. అందుకే గంగిడ్డి సారు కాడికి పిల్లోల్లు ఎత్తుకోని వ‌చ్చే వాళ్లు చానా మంది ఉంటాండిరి. ఎవురికైనా బాగ అయితాండ్య‌. ఆయ‌ప్ప చెయ్యి మంచిది సోమీ అని పాత‌బ‌స్టాండుకాడ‌, జివ్విచెట్టు కాడ బ‌స్స‌ల‌కు ఎదురుసూసే వాళ్లు మాట్లాడుకుంటాండిరి.

మంచి గుణమున్న మంచి!
……………………….
గంగిడ్డి సారు పాలిటిక్సులోకి వ‌చ్చినాంక నేను మాట్ల‌డ‌ను కానీ.. నా పిల్ల‌ప్ప‌టి క‌తే నేను చెప్తాండ. రాచేక‌ర్ రెడ్డి సారు ఉన్య‌ప్పుడు ఆస్పిట‌లంటే గంగిడ్డి సారుదే. తిన్నాళ ఉన్య‌ట్లుండ్య‌. మా తిక్కు చానామంది గంగిడ్డి సారు ఆస్ప‌టులో పుట్టినోళ్లే. గంగిడ్డి సారు భార్య గైన‌కాల‌జిస్టు. ఇద్దురు డాక్ట‌ర్లు ఒకేచోట ఉండ‌టంతో జ‌నం పిక్కొడుచ్చాండ్రి. మా చెల్లెలుకు బిడ్డ పుట్న‌ప్పుడు గంగిడ్డిసారు ఆస్ప‌ట‌లు లోనే వారం ఉంటిమి. ఆయ‌ప్ప‌ను ద‌గ్గ‌ర‌గా చూసినా. ఆయ‌ప్ప చానా బిజీగా ఉంటాండ్య‌. ఒక్కోపారి జనాల‌ను సూచ్చా సూచ్చా అట్ల‌నే నిద్ర‌పోయేవాడు ఓ ఐదునిమిషాలు టేబుల్ మింద‌. ఎవురినీ కాద‌న‌లేడు. పేద‌వాళ్లు అంతా చుట్టుకునేవాళ్లు. లెక్క త‌క్క‌వ తీసుకుంటాండ్య‌. నిద్రపోను కూడా టైము ల్యాకుండా ఉండ్య‌. వారం ఆగినాక ఆస్పిట‌ల్‌లో బిల్లు ఇచ్చినారు. తొమ్మిదివేల చిల్ల‌ర‌. నా ద‌గ్గ‌ర నాలుగున్న‌ర వేయి ఉండాయి. గంగిడ్డి సారుకాడికి పోతే.. యా ఊరు అన్యాడు. హిమ‌కుంట్ల అన్యా. లెక్క లేదు సార్ అన్యా. స‌రేలే.. అని నాలుగున్న‌ర వేలు క‌ట్టుపో అన్యాడు. అప్ప‌ట్లో ఆయ‌ప్ప అట్లుంటాండ్య‌. బీదాబిక్కీల డాక్ట‌రుగా పేరు రావ‌టానికి ఆ మంచి గుణం మంచిది!

గంగిడ్డి సారు చెప్పినాడంటే.. అంతే!
…………………………………………..
గంగిరెడ్డి సారు ఎంత ప‌నివాడంటే.. నాడి ప‌ట్టుకోని పేషెంట్ క‌త చెప్తాండ్య‌. రోంత అట్ల గాల్లోకి సూసి ట్యాబ్లెట్లో.. ఇంజ‌క్ష‌నో వేచ్చాండ‌. సీరియ‌సు అయితే మాత్త‌రం క‌‌డ‌ప‌, క‌ర్నూలు, హైద‌రాబాద్‌, బెంగుళూరో రాసిచ్చాండ్య‌. ఒక‌ప్పుడు సిమాప‌ల్లె తిక్కు రైతులు అప్పులు చేసి ప‌రువు పోతాద‌ని ఎల్ట్రీన్ తాగుతాండ్రి. ఎవురు పురుగుల మందు తాగినా.. గుళిక‌లు మింగినా గంగిడ్డి సారు ద‌గ్గ‌ర‌కు తీస‌క‌పోతాండ్రి. మంచిని అట్ల చూసి ఎంత సేపు బ‌తుతుతాడో చెప్తాండ్య‌. ఎల్ట్రీను తాగో, చెన‌క్కాయ‌ల్లో గుళిక‌లు తిన్యారంటే.. ఇంగ అవుట్ అనేవారు. గంట‌లోప‌ల పోయినోళ్ల‌కు ఆ మందు క‌క్కిచ్చి బ‌తికిచ్చినాడు కూడా. ఎవురైనా స‌రే గంగిడ్డి సారు ద‌గ్గ‌ర‌కి బాగ‌లేద‌ని పోతే… అది గుండెకు సంబంధ‌మో, కిడ్నీనో, న‌రాలో, మెద‌డో.. ఏ వ్యాధి అయినా ఇట్లే చెప్పేవాడు. మీరు ఫ‌లానా ఆస్ప‌ట‌ల‌కు పోక‌పోతే అంతే అంటూ హెచ్చ‌రిక సేచ్చాండ్య‌. మాయ‌మ్మకు బాగ‌లేద‌ని ఓ పారి హాస్ప‌ట‌లుకు తీస‌క‌పోతే.. *ఇది మెద‌డుకు వ‌చ్చింది. బెరీన స‌ర్జరీ చేయించ‌కుంటే బ‌త‌క‌దు. బెంగుళూరులో త‌ల‌కాయ ఆసుప‌త్రి నిమాన్సుకు తీస‌క‌పో అన్యాడు. అక్క‌డికి పోకుండా హైద‌రాబాద్ పెద్ద ఆస్ప‌త్రి కిమ్సుకు తొల‌క‌పోయి ఆప‌రేష‌న్ సేయిచ్చినా మాయ‌మ్మ‌కు. అందుకే ప‌దేండ్లు బ‌తికినాది. ఆ పొద్దు గంగిడ్డి సారు కాడికి పోకుంటే అప్పుడే ఇబ్బంది అయితాండ్య‌. ఇట్ల గంగిడ్డి సారు క‌రెక్టు చెబుతాడు కాబ‌ట్టే ఆయ‌ప్పకు అంత ఇల‌వ‌!

సారును లాకుడౌన్‌లో చూసినా.. క‌ల్చ‌లేక‌పోయా!
……..।।।।।।।।।।………
రాచేక‌ర్ రెడ్డి సారు ముఖ్య‌మంత్రి అయినాక పులింద‌ల గుట్ట‌మింద ల‌యోలా కాలేజీ తిక్కు దినేష్ మెడిక‌ల్ ఆసుప‌త్రి పేరుతో క‌ట్నారు. ట్రీట్ మెంటు ధ‌ర ఎక్కువ‌యినా.. గంగిడ్డి సారు ద‌గ్గ‌రికే జ‌నాలు పోతాన్యారు. పోవ‌డం మాత్రం చ‌ల్లుకోల్య‌. అంతెందుకూ.. మా పిట్టోడు పుట్టిండేది గంగిడ్డి సారు ఆసుప‌త్రిలోనే. మా తిక్కు ఎవురికి బాలేకున్నా.. దాదాపు గంగిడ్డి సారు ఆసుప‌త్రి తొక్కాల్చిందే. మొన్న లాకుడౌన్ లో మా బాబుకు జ‌ర‌మొచ్చే.. వాళ్ల ఆసుప‌త్రి వొక్క‌టే తెర్చినారు. అప్పుడు గంగిడ్డి సారు చానా మెత్త‌బ‌డిన్యాడు. ఆయప్ప‌ను క‌లుజ్జామంటే.. రాజ‌కీయ‌మంచి ఆయ‌. పైగా క‌రోనా వ‌ల్ల క‌ల్చ‌లేక‌పోయినా. ఆసుప‌త్రిలో రోంత సేపు ఉండి.. బాబును చిన్న‌డాక్ట‌రుతో సూపిచ్చుకోని వ‌చ్చినా!

ఏదేమైనా గంగిడ్డి సారు దాదాపు న‌ల‌భై ఏండ్లు పులింద‌లోళ్ల‌కు, ఆ మాట‌కొచ్చే చానా సీమ‌కు దిక్కూమొక్కు ఉండే డాక్ట‌రు. ఈ పొద్దు ఆ పిల్ల‌ల గంగిడ్డిసారు చ‌చ్చిపోయినాడంటే.. ఒక‌ప్పుడు ఆయ‌ప్ప దగ్గ‌రికి పోయింది.. ముడ్డికి, రెట్ట‌ల‌కు సూదులు ఏసింది మ‌తికొచ్చినాది. ఆరేడు జెన‌రేష‌న్ల‌కు పులింద‌ల్లోనే గంగిడ్డి సారంటే.. ఓ ఎమోష‌న్‌. ఆ ఎమోష‌న్ తోనే ఇంత రాసినా. ఆయ‌ప్ప ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుని ప్రార్థిస్తూ..
✍🏻✍🏻
రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి, 3.10.20(7989746115)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*