పిల్లలను ఆస్తిపరులను కాదు విద్యావంతులను చేయండి: RJ రేఖ

హరికథ చెబితే చెవిలో అమృతమే
మైక్ పడితే మదిలో గిటారే
వారసత్వ కళను నలువైపులా చాటుతున్న
అభినవ రేడియో జాకీ RJ రేఖ గారితో ఈక్షణం ఇంటర్వ్యూ

హలో రేఖ గారు
హాయ్

రేడియో జాకీ ఛాన్స్ ఎలా వచ్చింది?

నేను రేడియో జాకీ గా ఆరేళ్ళుగా చేస్తున్నా. ఆ ఛాన్స్ రావడానికి కారణం మా శ్రీవారు. నాకు తెలియకుండానే రేడియో జాకీ జాబ్ కి అప్లై చేశారు. ఆడిషన్ కి పిలుపు వస్తే.. నాకెలా ఈ జాబ్ వస్తుందనుకున్న. కానీ మా ఆయనకు నాపై ఫుల్ నమ్మకం. నీ వాయిస్ చాలా బాగుంటుంది, కచ్చితంగా నీకు ఆఫర్ వస్తుంది అన్నారు. ఆయన అన్నట్టే నాకు రేడియో జాకీ ఛాన్స్ వచ్చింది. అలా జులై 7, 2014 న మొదటి షో చేశాను. ఇప్పటి వరకూ చేస్తూనే వున్నాను.

మీ ఫ్యామిలీ, చదువు?

నేను పుట్టింది మహబూబ్ నగర్, పెరిగింది హైద్రాబాద్. రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళే టైం లేకపోవడంతో అంబేద్కర్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను. మా ఆయన సత్య శ్రీనాథ్… టి.టి.డి అన్నమాచార్య ప్రాజెక్టు లో జాబ్ చేస్తున్నారు. ఆయన చాలా డ్రామాలకు మ్యూజిక్ అందించారు. ఇద్దరు పిల్లలు బాబు పవన్ కార్తికేయ 8 ఏళ్ళు, పాప చైత్ర మూడేళ్లు.

మీ చదువు వెనక కూడా మీ బెస్ట్ హాఫ్ వున్నారని విన్నాం

అవును. నన్ను చదువుకొమ్మని చాలా ప్రోత్సహించారు. ఆయన వల్లే MA థియేటర్ చేశాను. 7నెలల ప్రెగ్నెన్సీలో ఫైనల్ ఎగ్జామ్స్ రాసాను. 98% తో పాస్ అయ్యాను.

మీరు హరికథ కూడా చెబుతారు కదా? ఆ వివరాలు.

చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ హరికథ చెబుతున్నాను. సోమవారం నుంచి శుక్రవారం వరకూ వివిధ ప్రాంతాల్లో హరికథ చెప్పేదాన్ని. దీనితో కాలేజీ కూడా రెగ్యులర్ గా వెళ్లలేకపోయా. అయినా డిస్టెన్స్ లో చదివి 80% మార్క్స్ తెచ్చుకున్నాను. మా అమ్మానాన్న, అత్తయ్య కూడా హరికథ చెప్తారు.

హరికథ చెప్పడం అసలు ఎలా మొదలయింది?

మాది పెద్ద కుటుంబం. నాకు ఎనిమిదిమంది అన్నాదమ్ములు, నలుగురు అక్కాచెల్లెళ్లు. నాన్నగారు గురువుగా హరికథ వారసత్వo తీసుకుంది నేనే. మా ముగ్గురు అన్నలు తబలా వాయిస్తారు, వారికి నాన్ననే గురువు. అప్పట్లో మా తాత వాళ్ళకు ఒక డ్రామా కంపెనీ వుండేది. అందులోనే అమ్మానాన్నలు కూడా నాటకాలు వేసేవారు. అయితే, వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో నాన్న కొన్ని రోజులు బంగారం పని చేశారు. అయినా.. జీవితం కష్టంగా మారడంతో.. 25 ఏళ్ళు బ్రహ్మంగారి జీవిత చరిత్రతో సహా హరికథ గానం చేస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లిస్తూనే .. 12 మంది పిల్లలని చదివించి, పెళ్లిళ్లు చేసి, ECILలో సొంత ఇల్లు కొన్నారు. 23ఏళ్ళ తర్వాత అమ్మా నాన్నలకు ఆరోగ్యం సహరించలేదు. ఆ మిగిలిన రెండు ఏళ్ల మొక్కును నన్ను పూర్తి చేయమని అడిగారు. అలా 18 ఏళ్లప్పుడే నేను హరికథ చెప్పడం ప్రారంభించాను. మొక్కును పూర్తి చేశాను.


ఇప్పటి వరకు ఎక్కడెక్కడ హరికథ చెప్పారు?

మొదట నా హరికథ శ్రీశైలంకి ఉత్తరద్వారమైన ఉమా మహేశ్వరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత యాదగిరిగుట్ట, హైదరాబాద్ లోని పలు దేవాలయాలు, కృష్ణ పుష్కరాలు, వివిధ సభల్లో కంటిన్యూ అవుతోంది.


ప్రస్తుతం మీరు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు?

భాషా సాంస్క్రతిక శాఖ వారు నాకు నెలనెలా హరికథ ప్రోగ్రాం ఇస్తున్నారు. తెలంగాణలో హరిదాసులు తక్కువగా ఉన్నారు. ఉన్నవారి ద్వారా భావి తరాలకు ఈ అమూల్య కళ అందాలన్న ఉద్దేశ్యంతో, గౌరవనీయులు రమణాచారి గారు, మామిడి హరికృష్ణ గారు తెలంగాణ తరపున 20 మంది హరిదాసుల్లో నన్ను సెలెక్ట్ చేసారు. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయ పూర్వకంగా నమస్సులు.


మీ ఫ్యామిలీ పైన పద్యాలు రాసారు? ఆ విశేషాలు.

నాగర్ కర్నూల్ లో కపిలవాయి లింగమూర్తి అనే సాహితివేత్త మా అమ్మానాన్నలపై 5 పద్యాలు రచించి, బహుకరించారు. అప్పుడే హరికథలు చెప్పడం ప్రారంభించిన నాపై కూడా ఒక పద్యం రాసారు. అది నేను ఎప్పటికి మర్చిపోలేను. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించినట్టు అన్పించింది.

అటు రేడియో జాకీ, ఇటు హరికథ ప్రోగ్రామ్స్ ఇవి కాకుండా డబ్బింగ్ కూడా చెబుతారు కదా, ఇప్పటివరకు వేటికి చెప్పారు?
మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు చెప్పాను. ఆ తర్వాత సవెర ఎంటర్టైన్మెంట్లో వచ్చిన “రోమన్ ” అనే సినిమాలో హీరోయిన్ కి గాత్ర దానం చేసాను. కొన్ని లఘు చిత్రాలకు చెప్పాను. “ఖుషి” (సత్య గాడి వీర ప్రేమ గాధ) ఈ షార్ట్ ఫిల్మ్ కోసం హీరోయిన్ కి వాయిస్ ఇచ్చాను.

సీరియల్ లో డబ్బింగ్ ఛాన్స్ వచ్చినా.. పిల్లల కోసం టైం వెచ్చించాలని వదిలేసుకున్నాను.

మీరు సింగర్ కూడా, సంగీతం నేర్చుకున్నారా?

నాకు సంగీతం అంటే ప్రాణం. నాన్న దగ్గర ఓనమాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో స్టేజి షోస్ చేస్తుంటాను. కార్తీకేయ కల్చర్ ఈవెంట్స్ అని సొంత బ్యానర్ ఉంది.

వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కూడా చేసినట్టు ఉన్నారు.

అవును. యూట్యూబ్ ఛానల్ లో రెండేళ్లు వాయిస్ ఓవర్స్ చేసేదాన్ని.

రాయలసీమ న్యూస్ ఛానెల్ కి చేసినప్పుడు, నా వాయిస్ నచ్చి చాలామంది అడిగారు. అలా స్కూల్స్, కాలేజీ యాడ్స్ కి వాయిస్ ఇచ్చాను.


ఎన్నో స్టేజి డ్రామాస్ కూడా చేసారు, దాని గురించి.

పెళ్లైన కొత్తలో “సీత రాముల కళ్యాణం” అనే పద్య నాటకంలో నేను సీతగా, మా ఆయన రాముడిగా చేసాము. అది చూసి థియేటర్ లోనే మంచి దర్శకులైన పాటిబండ్ల ఆనందరావుగారు ‘రాజా గృహప్రవేశం’ (అంబేద్కర్ చరిత్ర)లో అంబేద్కర్ గారి భార్యగా ఛాన్స్ ఇచ్చారు. మరో గొప్ప డైరెక్టర్ ఉదయ్ భాను గారి డైరెక్షన్ లో ‘చరణ్ దాసు’ అనే డ్రామాలో మంచి పాత్ర పోషించాను. ఆ పాత్రలో రాణిలో వుండే హుందాతనం, పొగరు, దొంగను ప్రేమించే ప్రేమికురాలిగా.. రకరకాల షెడ్స్ ను పలికిoచడం నాకో గ్రేట్ ఛాలెంజ్. MA చేశాక రవీంద్రభారతిలో, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలలో పలు
డ్రామాలు చేశాను.

‘స్టార్ మహిళ’ టైటిల్ గెలిచారనుకుంటా.

ఎస్. నేను ఈటీవీ వారి స్టార్ మహిళలో రెండుసార్లు పాల్గొన్నా. 16/04/2016లో రన్నర్ .. 15/04/2017 లో విన్నర్. రెండోసారి వెళ్ళినప్పుడు నేను ప్రెగ్నెంట్, డాన్స్ చేయలేకపోయా, కానీ టైటిల్ నాకే దక్కింది.


మీ పిల్లలకు మీరే డ్రెస్సెస్ కుడతారట.

హహ. నా ఇద్దరు అక్కలు ఫ్యాషన్ డిజైనర్స్. వారి వద్ద నేను కుట్టడం నేర్చుకున్న. అలా నా పిల్లలకు నేనే డ్రెస్సెస్ కుడుతుంటాను. పిల్లలే కాదు ఆర్డర్స్ పై ఫ్యాషన్ డిజైన్ చేస్తా కూడా.


రేడియో విషయానికి వస్తే … ఇప్పుడు ఏ షో చేస్తున్నారు?

నాది మొదటి నుండి ఒకటే షో. మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చే ‘సింగిడి’ షో.


మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్?

‘ఉమ్మడి కుటుంబం’ టాపిక్ కి మంచి స్పందన వచ్చింది. ఒక శ్రోత ఫోన్ చేసి.. మీరు చెప్పిన విషయాలు నాలో మార్పు తెచ్చాయి, ఈ వారమే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పడం ఎప్పటికి మర్చిపోలేను.

ఫ్యాన్స్ .. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

మమ్మల్ని చూడకుండా కేవలం మా గొంతు విని అభిమానించడం సంతోషంగా ఉంటుంది. ఒక రకమైన బలం.

ఫ్యాన్స్ తో గుర్తువుండిపోయిన ఇన్సిడెంట్?

ఒకరోజు నేను షో అయ్యాక బైటకు వస్తే.. ఒక శ్రోత నా కోసం ఫ్లవర్ బొకేతో వెయిట్ చేస్తూ కనిపించారు. మేడం మీ వాయిస్ చాలా బాగుంటుంది అని అనగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను.

ఒకసారి రేడియో షో వున్నప్పుడు మీకు ఏదో ఎమర్జెన్సీ వుండింది, ఆ గుర్తులు?

అమ్మో అది ఎప్పటికి మర్చిపోలేను. మా బాబుకు 5 ఏళ్ళు, 104 జ్వరం. అప్పటికే ఒకసారి షో ఎక్స్చేంజి చేసుకున్న, మళ్ళీ అంటే కష్టo. కానీ బాబును ఆ పరిస్థితిలో వదిలి షో చేయాల్సి వచ్చింది. 3 గంటలు నవ్వుతూ షో చేసినా .. నా కళ్లలోంచి నీళ్లు. అప్పుడే తెలుసుకున్నా.. ఎటువంటి పరిస్థితిలోనైనా మనో నిబ్బరంతో ఎలా ఉండాలో తెలుసుకున్నాను.

రేడియో అంటే ఒక్క మాటలో?

రేడియో అంటే నా దృష్టిలో ‘ఆనందంతో కూడిన పరిజ్ఞానం’ ఇది అటు లిసెనెర్స్ కి ఇటు RJలకి.

మీ ఇన్స్పిరేషన్?

యాంకరింగ్ లో సుమగారు, సింగింగ్ లో సునీత గారు.

మీలో మీరు మార్చుకోవాలి అనుకుంటున్నది?

కోపం. ఎక్కువగా నవ్వుతూ ఉంటా.. కోపం వస్తే ఇక అంతే సంగతి


మీలో మీకు నచ్చేది

ఆత్మ విశ్వాసం

మీ ఫ్యూచర్ ప్లాన్స్?

మంచి డబ్బింగ్ ఆర్టిస్టు కావాలని, టీచర్ అవ్వాలని


RJలు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్

వాయిస్ వుంటే సరిపోదు, భాష మీద పట్టు ఉండాలి. మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలగాలి

హరికథ ఫీల్డ్ లోకి రావాలంటే?

ఈ మధ్య అందరికీ తమ పిల్లలు డాక్టర్స్, ఇంజనీర్స్ కావాలి. హరికథ నేర్పించాలి అనుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. అసలు హరికథ చెప్తాము అంటే, ఇప్పుడు ఎవరు చూస్తారు అని పెద్దవాళ్లే అంటున్నారు. టీవీలో వస్తే చానెల్స్ మారుస్తారు. పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్ లో ఈ కళ అంతరించిపోతుంది. అందుకే ప్రాచీన కళలను పిల్లలకు చూపించాలి, వాటిని బతికిoచాలి. హరిదాసు కావాలంటే ఆ కళపై గౌరవం, ప్రేమ వుండాలి, ఉంటే తప్పకుండా రాణిస్తారు.

మీ వంతుగా ఏమి చేస్తున్నారు?

ఇప్పటికీ హరికథ చెబుతున్నా. చెబుతూనే వుంటా. నా బిడ్డకు కూడా కూచిపూడితో పాటు హరికథ నేర్పిస్తున్నాను. మా నాన్న అనేవారు ఈ విద్య ఎప్పటికైనా ఉపయోగపడుతుందని. అది నేను బలంగా నమ్ముతున్నాను.

చివరగా మీరు చెప్పాలనుకుంటున్నది?

ఎన్ని బాధలు ఉన్నా ఎప్పుడూ మన ముఖంలో చిరునవ్వు ఉండాలి అని మా అమ్మ చెప్పేది .. అలా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. అంతేకాక మనం పిల్లలకు ఇచ్చేది ఒక విద్య మాత్రమే. అది ఏ విద్యా అన్నది ముఖ్యం కాదు. అందుకే నా పిల్లలను ఆస్తిపరుల్ని కాదు విద్యావంతుల్ని చేయడానికి కృషి చేస్తాను. ఈ రెండూ అందరూ పాటించాలని కోరుకుంటున్నాను.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*