జ’గన్ ‘లక్ష్యం ఎటు? టీడీపీ టార్గెట్ గా ఎన్డీఏ వైపు చూపులా?

హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు… ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా తమ విధానాలను, వ్యూహాలకు పదును పెడితే, జాతీయ పార్టీలు ఢిల్లీ పీఠం పైన దృష్టిపెట్టి మరీ ఆచితూచి అడుగులు వేస్తాయి. ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే కేంద్రం లో అధికారంలో ఉంటే. ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైయస్సార్ సిపి అధికారంలో ఉంది.ప్రస్తుతం జాతీయ పార్టీగా బిజెపి ,ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నా ఈ రెండు పార్టీలకు భవిష్యత్తు ముఖ్యం. తాజా జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఎన్డీయే కు శిరోమణి అకాలీదళ్ దూరం కాగా, అంతకుముందే అత్యంత విశ్వాసపాత్రంగా భావించే శివసేన ఎన్డీయే కు గుడ్ బై చెప్పింది. ఈ పరిస్థితులలో తిరిగి ఎన్డీయే ను పటిష్టం తీసుకోవటం కమలనాథుల ముందున్న ప్రథమ లక్ష్యం.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీ తో సమావేశం కావడం తో తాజాగా వైసిపి ఎన్డీఏలో చేరుతుందన్న అనుమానాలు మరోమారు తెరపైకి వచ్చాయి. పదిహేను రోజుల క్రితమే ఢిల్లీ పర్యటన చేపట్టిన జగన్ ,అప్పుడు కేంద్ర హోంమంత్రి, బిజెపి కీలక నేత అమిత్ షా తో రెండు పర్యాయాలు సమావేశం కావడం, ఈమారు పర్యటనలో ప్రధాని మోడీ తో జగన్ కీలక చర్చలు జరపటం అనుమానాలను బలపడేలా చేశాయి. చర్చల కోసం మోదీ నుంచి పిలుపు అందిన తర్వాతే జగన్ హస్తిన పర్యటన సాగినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతరత్రా చర్చించడానికే కేవలం జగన్ హస్తినకు వెళ్లారు అనుకోవడానికి అవకాశం లేదు. ఇంతకుముందు పర్యటన లోనే అన్ని విషయాలను జగన్ ప్రస్తావించారు. అయితే ప్రధానితో జరిగిన జగన్ సమావేశం లో ఎన్డీయే లో చేయాల్సిందిగా వైసీపీ అధినేతను మోడీ నేరుగా అడిగినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ లో చేరితే లభించే అవకాశాలను ప్రధాని వివరించినట్లు,దానితో పాటు కేంద్రంలో రెండు క్యాబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలో ఏడాది క్రితమే అమిత్ షా , వైసీపీకి ఎన్డీయే లో చేరేందుకు ఆఫర్ ఇచ్చారు.అయితే అప్పట్లో డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు ఒక కేబినెట్ ,ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని చెప్పినా, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే షరతులు లేకుండా చేరడానికి సిద్ధమని అప్పట్లో జగన్ తేల్చి చెప్పినట్లు వార్తలొచ్చాయి.. అయితే అది జరగలేదు.

ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం మరుగున పడింది. సంక్షేమ పథకాల పైనే జగన్ ప్రభుత్వం దృష్టి సారించి మేనిఫెస్టో పక్కాగా అమలు చేస్తోంది.

ఇలా ఉంటే ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన, బీజేపీ తో జతకట్టి ఏపీలో కలిసికట్టుగా సాగుతోంది. మరి ఇప్పుడు వైసీపీ ఎన్డీయే లో చేరేందుకు మొగ్గు చూపితే పరిస్థితి ఏంటి?. బీజేపీతో అటు జనసేన, వైసీపీ కలిసి ముందుకు సాగగలుగుతాయా, లేక జనసేనకు చెక్ పడుతుందా ..అన్నది సందేహంగా మారింది.ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందటం ఎంతో ముఖ్యం. కేంద్రం సహకారం ఉంటేనే వైసీపీ ప్రభుత్వం నెట్టుకు రాగలిగే పరిస్థితులున్నాయి..అదీకాక ప్రతిపక్ష తెలుగుదేశం ఎన్డీయే లోకి మళ్ళీ ప్రవేశిస్తే పరిస్థితులు వైసిపికి కొంత ఇబ్బందికరంగా మారటం ఖాయం. కాబట్టి ఆ అవకాశం టిడిపికి ఇచ్చేందుకు వైసిపి ఇష్టపడుతుందా…అయితే తెలుగుదేశాన్ని మళ్లీ ఎన్డీయేలోకి ఆహ్వానించడానికి కమలనాథులు సిద్ధంగా లేరు.తమతో విడిపోయి ఒంటికాలిపై లేచిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని బిజెపి అగ్రనాయకత్వం చూస్తోంది. అందుకే వైసీపీ కి గాలం వేస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న జనసేన తో పాటు వైసీపీ ,టీడీపీలలో ఏదో ఒక దానిని ఎన్డీయేలోకి తెచ్చుకుంటేనే కమలనాథులకు కాలం కలిసి వస్తుంది.

ఈ పరిణామాల లోనే వైసీపీ పై బిజెపి ఒత్తిడి పెంచుతోంది.ఎన్డీయే నుంచి అకాలీదళ్ వైదొలిగిన తరువాత తమకు వచ్చిన నష్టం లేకపోయినా ,కేవలం రెండు సీట్ల బలం వున్న అకాలీదళ్ ప్లేస్ లో 22 మంది లోక్ సభ సభ్యుల బలం ఉన్న వైసీపీని రాబట్టగలిగితే కేంద్రం లోఎన్డీఏ బలం మరింత పుంజుకుంటుంది. అదీకాక రాజ్యసభలోనూ బలం పెంచుకోవచ్చు.రాబోయే రెండేళ్లలో ఏపీలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలు కూడా వైసిపి పరం అవుతాయి.కాబట్టి ఎటుచూసినా జగన్మోహనంగా వైసీపీని ఆకర్షించగలిగితే, కమలనాథులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది .దక్షిణాది రాష్ట్రాలలో తమకు బలం లేని లోటు తీరుతుంది.ఆంధ్రప్రదేశ్లో సొంతంగా గెలిచే పరిస్థితి బీజేపీకి లేదు .ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో తెలంగాణపైనే బిజెపి ఎక్కువ దృష్టి పెట్టింది. అదీకాక తమిళనాడులో అన్నాడిఎంకే బీజేపీ వెనకే నడుస్తోంది.

ఏపీలోనూ తమిళనాడు తరహా రాజకీయాలు…

తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లోనూ పునరావృతం కానున్నాయా..? అక్కడ అన్నాడీఎంకే ,డీఎంకే మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం వైసీపీ , తెలుగుదేశం రెండు ప్రాంతీయ పార్టీలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. తమిళనాట ఆ రెండు పార్టీలు ఒకదాని తరువాత మరొకటి ఎన్డీయే లోకి వచ్చిపోతూ వచ్చాయి.ఒక పార్టీని అణగ దొక్కేందుకు మరో పార్టీ జాతీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చాయి.అప్పట్లో కరుణానిధి, జయలలిత లు ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తూ వచ్చారు. ఎన్డీఏ నుంచి డిఎంకె బయటకు వచ్చాక , అన్నాడిఎంకె ఆ ప్లేస్ భర్తీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటపడింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేతిలో ఘోర పరాజయం చవి చూసిన తర్వాత, ఎన్డీయే నుంచి బయటకు రావటం తాను చేసిన తప్పుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తించారు. బీజేపీకి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశాన్ని పూర్తిస్థాయిలో అణగదొక్కాలని చూస్తున్న వైసిపి ,.. జాతీయస్థాయిలో బలంగా ఉన్న ఎన్డీయే కు తిరిగి టిడిపి దగ్గర కాకుండా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కొన్ని షరతులను అంగీకరిస్తే ఎన్డీయే లోకి వైసీపీ దూకుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాలు సైతం వేడెక్కి ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన విధానాలను సమీక్షించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది .ఆ దిశగా కొన్ని అడుగులు కూడా ముందుకేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతల అవినీతిపై కేసుల పర్వం కొనసాగుతోంది. అటు ప్రతిపక్ష తెలుగుదేశం కూడా వైసీపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది.ఏదైనా జాతీయ రాజకీయాల పరంగా బీజేపీకి ఎన్డిఏ భాగస్వామ్య పార్టీలను పెంచు కోవడం ఎంత ముఖ్యమో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులలో వైసీపీ కి లేక అటు తెలుగుదేశం కు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పంచన చేరడం అంతే ముఖ్యం.

– వెలది కృష్ణకుమార్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ ( 98497 25984)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*