’ఆ సమయాల్లో అష్టాదశ మహాపురాణాల పేర్లను ఎవరైతే పఠిస్తారో వారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారు‘

ఓం సద్గురవే నమః పురాణ పరిచయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ |దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||

మన భారతీయ వాగ్మయంలో 1.వేదాలు తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంధాలు పురాణాలు అందుకే ఇవి పంచమవేదంగా కీర్తించారు……
భగవంతుని విశ్వసరూపాలైన వేదాలు భారతీయుల జీవన స్రవంతికి , ధర్మోత్తేజానికి , తత్త్వార్ధ దర్శనానికి మూలకందాలు. ఇతిహాసపురాణాలు వేదాలను సముపబృంహణం చేస్తున్నాయి.

అందుకే పెద్దలిలా చెబుతారు ” ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ *

2.పురాణం అనగా *పురా నవం భవతీతి పురాణం అనగా ( పురాతనమైనప్పటికి నూతనంగా ఉండేవి.) పురా ఆనతి అనగా ప్రాచీన కాలంలో జరిగాయని..(వాయుపురాణం) పురాఏతత్ పురాణం అభూత్ పూర్వం ఇలానే జరిగాయి అని (బ్రహ్మాండ పురాణం) అని ఇలా అనేక అర్థాలున్నాయి……..

3. వేదాల్ని చదివి అర్థం చేసుకోటం కష్టమని పురుషోత్తముడు వేదాంత సారాన్ని మనుష్యులకు సులభంగా అర్థమై విదంగా కథల రూపంలో వేదవ్యాసుడు మనకు అందించారు. ఆ కథల్లోనే వేదాంతం సారం ఉంటుంది..

4.అష్టాదశ(18) పురాణాలు ఎందుకు అనగా 1+8=9.తొమ్మిదికి చాలా ప్రాముఖ్యత ఉన్నది…..

5. పురాణ పేర్లు వరుసగా

బ్రహ్మం పాద్మం వైష్ణవం చ వాయవీయం తధైవచ | భాగవతం నారదదీయం మార్కండేయంచ కీర్తితమ్ || ఆగ్నేయంచ భవిష్యంచ బ్రహ్మవైవర్త లింగకే | వారాహంచ తథా స్కాందం వామనం కూర్ సంజ్ఞకమ్ | మాత్స్యం చ గారుడం తద్వ(ద్భహ్మాండాఖ్యమితి త్రిష

1.బ్రహ్మపురాణం
2.పద్మపురాణం
3.విష్ణుపురాణం
4.వాయు పురాణం
5.భాగవత పురాణం
6.నారదపురాణం
7.మార్కండేయ పురాణం
8.అగ్నిపురాణం
9.భవిష్యపురాణం
10.బ్రహ్మవైవర్త పురాణం
11.లింగపురాణం
12.వరాహ పురాణం
13.స్కాంద పురాణం
14.వామన పురాణం
15.కూర్మ పురాణం
16.మత్స్య పురాణం
17.గరుడ పురాణం
18.బ్రహ్మాండ పురాణం

-ఈ పద్దెనిమిదీ మహాపురాణాలు .

అలాగే 18 ఉపపురాణాలు కూడా వున్నాయి .

6.సులభంగా అర్థం చేసుకొనుటకు మ ‘ ద్వయం భద్వయం చైవ ‘ బ్ర’త్రయం ‘ వ ‘ చతుష్టయం | అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్|| ‘ మ ‘ తో మొదలయ్యేవి రెండు 1.మత్స్య 2.మార్కండేయ ‘ భ ‘ తో మొదలయ్యేవి రెండు 1.భాగవత 2.భవిష్య ‘ బ్ర ‘ తో మొదలయ్యేవి మూడు 1.బ్రహ్మ 2.బ్రహ్మవైవర్త 3.బ్రహ్మాండ ‘ వ ‘ తో మొదలయ్యేవి నాలుగు 1.వాయు 2.విష్ణు 3.వామన 4.వరాహ అ – అగ్ని , నా – నారద , ప – పద్మ , లిం – లింగ , గ – గరుడ , కూ – కూర్మ , స్కా – స్కాంద ఇలా మొత్తం పద్దెనిమిది పురాణాలు .

పురాణాలు విష్ణుస్వరూపం అష్టాదశ పురాణాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పోల్చారు . 18 పురాణాలని మహావిష్ణువు శరీరంలోని 18 అంగాలుగా భావిస్తారు మన ప్రాచీన ఋషులు .

1. బ్రహ్మపురాణం ౼శిరస్సు
2. పద్మపురాణం ౼హృదయం
3. విష్ణుపురాణం. ౼కుడిభుజం
4. వాయుపురాణం ౼ఎడమభుజం
5. భాగవతపురాణం ౼ఊరువులు
6. నారదపురాణం ౼నాభి
7. మార్కండేయపురాణం ౼కుడిపాదం
8. అగ్నిపురాణం ౼ఎడమపాదం
9. భవిష్యపురాణం ౼కుడిమోకాలు
10 బ్రహ్మవైవర్తపురాణం ౼ఎడమమోకాలు
11. లింగపురాణం ౼కుడి చీలమండ
12 వరాహపురాణం ౼ ఎడమ చీలమండ
13. స్కందపురాణం ౼కేశాలు
14. వామనపురాణం ౼చర్మం
15. కూర్మపురాణం ౼పృష్ఠభాగం
16. మత్స్యపురాణం ౼మెదడు
17. గరుడపురాణం ౼మాంససారం
18 బ్రహ్మాండపురాణం – ఎముకలు

పురాణ లక్షణం : సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వంత రాణి చ | వంశానుచరితం చేతి పురాణం పంచ లక్షణం ||

పురాణానికి ఐదు లక్షణాలు ప్రధానంగా వుండాలని చెప్పారు . |

1.సర్గ – అంటే ప్రపంచ సృష్టి ,
2.ప్రతిసర్గ – ఈ ప్రపంచ ప్రళయం , |
3.వంశం – రాజుల , ఋషుల , దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు అవతారాలు
4.వంశానుచరితం – రాజవంశాలలో , ఋషుల వంశాలలో పుట్టిన వారి జీవితచరిత్రలు,
5.మన్వంతరాలు – మనువులు , మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి , ఆయా మన్వంతరాలలో జరిగిన విశేషాలు.

ఈ విధంగా ప్రతిపురాణం పంచలక్షణాలతో కూడి వుంటుంది . పురాణకర్త : విష్ణోరంశో మునిర్జత సత్యవత్యాం పరాశరాత్ | పురాణ సంహితాం దద్యే తేషాం ధర్మ విధిత్సయా || అనే ఈ ప్రమాణ శ్లోకం ప్రకారం సత్యవతీ పరాశర మహర్షి కుమారుడుగా శ్రీ మహావిష్ణు అంశంతో జన్మించిన వ్యాసుడే అష్టాదశ పురాణాల కర్త అని తెలుస్తోంది. ఈయననే కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు. పురాణాలకు కర్త వ్యాసుడైతే వక్త సూతమహర్షి. ఈయన నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు ఈ పురాణాలన్నిటినీ ప్రబోధించాడు.

త్రి గుణాలుగా పురణాల్ని పేర్కొన్నారు

1 సాత్విక పురాణం విష్ణు, వరాహ , భాగవత, నారద, పద్మ,గరుడ , పురాణాలు…..
2. రాజసః పురాణాలు బ్రహ్మాండ, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, భవిష్య , వామన , మార్కండేయ పురాణాలు ….
3. తామస పురాణాలు లింగ , కుర్మా, శివ, స్కాంద , అగ్ని, మత్స్య పురాణాలు..

పురాణాలు ఎందుకు చదవాలి?

పురాణ శ్రవణే శ్రద్ధా యస్య స్యాద్రాతరస్వహమ్ | తస్య సాక్షాత్రసన్నః స్యాత్ శివో విష్ణుశ్చ సానుగః ||

పురాణాలు వినడంలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో మరియు నిత్యము ఎవరైతే శ్రవణం చేస్తారో , అటువంటి వారి విషయంలో శివ – కేశవులు మరియు వారి గణాలు సంపూర్ణానుగ్రహం ప్రదర్శిస్తారు.

పుత్రులు లేని వారికి పుత్రులు ..ధనం లేనివాళ్లకు ధనం ..పుష్కర స్నానం చేస్తే ఏ విదంగా ఫలితం వస్తుందో అంతకు పదింతలు ఫలం వస్తుంది..విద్యాలేనివారికి విద్య వస్తుంది సర్వసిద్ధులు వస్తాయి. మోక్షం సిద్ధిస్తుంది .మరుజన్మ లేకుండా ఉంటుంది..పరమాత్మలో ఐక్యమవుతరు… ఇంకా ఎన్నో ఫలితాలు కలుగుతాయి…

పురాణవైభవం కేవలం పురాణ పేర్లు చదవటంవల్ల ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే

అష్టాదశ పురాణానాం నామధేయాని యః పఠేత్ | త్రి సంధ్యాం జపతే నిత్యం సోsశ్వమేధ ఫలం లభేత్ || ఈ అష్టాదశ మహాపురాణాల పేర్లను ఉదయ, మధ్యాహ్న,సాయంకాల సమయాల్లో ఎవరైతే పఠిస్తారో వారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారు.

-బండి చాణుక్యచంద్రగుప్త, ఎంఏ పురాణ ఇతిహాస విభాగం, రాష్ట్రీయ సంసృత విశ్వవిద్యాలయం, తిరుపతి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*