కేంద్ర మంత్రి పాశ్వాన్ కన్నుమూత…

పాట్నా: కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫొటోను చిరాగ్ షేర్ చేశాడు.

రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూతపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ దూరదృష్టి ఉన్న నేతను కోల్పోయిందని రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ అన్నారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ సంతాప సందేశంలో పాశ్వాన్ అంకితభావం కలిగిన నేత అని అభివర్ణించారు.

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా పాశ్వాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని, మన రాష్ట్ర ఏర్పాటుకు ఆయన కృషి చేశారని ఆయన తెలిపారు. సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో రాం విలాస్ పాశ్వాన్ కుటుంబసభ్యులతో,ఆయనతో స్నేహపూర్వక సాన్నిహిత్యం ఉందన్నారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్‌కు గొప్ప స్థానం ఉందన్నారు. రాం విలాస్ పాశ్వాన్ కుటుంబ సభ్యులకు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*