దుబ్బాకలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..

హైదరాబాద్:దుబ్బాకలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. దీంతో దుబ్బాక కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఇద్దరు సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, మనోహర్ రావు టి‌ఆర్‌ఎస్ గూటికి చేరారు. కాసేపట్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టి‌ఆర్‌ఎస్‌లో చేరనున్నారు. 2 వేల మంది అనుచరులతో గులాబీ పార్టీలోకి చేరుతున్నారు. నర్సింహారెడ్డి, మనోహర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి రావడంతో కాంగ్రెస్‌కు అవకాశాలు మరింత తగ్గిపోయాయని గులాబీ శ్రేణులుంటున్నాయి. వాస్తవానికి చివరిదాకా టీఆర్ఎస్‌లో ఉన్న శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా కాంగ్రెస్‌లోకి జంప్ చేశాడు. దీంతో తొలుత టీఆర్ఎస్ షాక్‌కు గురైంది. ఇంతలోనే తేరుకుని మరో ఇద్దరు గట్టి నాయకులను హస్తం పార్టీనుంచి ఆకర్షించింది.

అటు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి సుజాత తరపున మంత్రి హరీశ్ రావు ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ లో జరిగిన యువ, విద్యార్థి సన్నాహక సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ దుబ్బాక ఉద్యమాల గడ్డ పోరాటాల అడ్డ అని, స్వరాష్ట్రం కోసం ఎక్కువ పోరాటం చేసింది దుబ్బాక ప్రజలేనన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రామలింగారెడ్డి దుబ్బాక ప్రజలకు ఇంటింటికీ త్రాగునీరు అందించారని, ప్రతీ ఇంటి నీటి బిందెలో రామలింగారెడ్డి మొహం, సీఎం కేసీఆర్ మొహం కనిపిస్తున్నాయన్నారు. ఏ అక్కని, చెల్లిని అడిగిన రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి గురించి చెప్తారని హరీశ్ రావు గుర్తు చేశారు. దుబ్బాక నియోజక వర్గంలో రామలింగారెడ్డి ఇరవై ఒక్క కొత్త సబ్ స్టేషన్లు నిర్మించారని, రైతుల కోసం కొత్తవి వెయ్యి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారని, ఇప్పుడు బాయిల కాడ మోటర్లు కాలిపోతలేవని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో బీడీలు చేసే అక్కా, చెల్లెలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో 20 వేల బీడీ పెన్షన్లు ఇచ్చామని చెప్పారు. ఎన్నికల అయ్యేదాకా దుబ్బాక లోనే ఉంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడని, అయితే ఎన్నికల తర్వాత కూడా దుబ్బాకలో ఉంటారా? అని హరీశ్ ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా పని చేసినప్పుడు ఏరోజైనా దుబ్బాకకి వచ్చారా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దౌల్తాబాద్ చౌరస్తాలో నిలబడి రాయపూర్ పోదామంటే డ్రైవర్ లేకుండా నీకు తెలుస్తదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి కుట్రలను యువకులు విద్యార్థులు గట్టిగా తిప్పికొట్టాలని హరీశ్ పిలుపునిచ్చారు. సుజాతక్కను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు.

మరోవైపు బీజేపీ నుంచి బరిలో ఉన్న రఘునందన్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

దుబ్బాక నియోజకవర్గం చీకోడ్ ఆశ్రమంలో రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*