నిజామాబాద్ ఎమ్మెల్సీ ‌ఉప‌ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన కవిత

కామారెడ్డి:నిజామాబాద్ ఎమ్మెల్సీ ‌ఉప‌ ఎన్నికల సందర్భంగా, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పర్యటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప‌ గోవర్ధన్‌తో‌ కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో, ఓటింగ్ సరళిని పరిశీలించారు.

అనంతరం స్థానిక ‌నేతలు, కార్యకర్తలతో కవిత ముచ్చటించారు.హైదరాబాద్ నుండి కామారెడ్డి చేరుకున్న కవితకు, దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ సరళిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ ప్రశాంతంగా,ఏకపక్షంగా సాగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. ఓటర్లు తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఓట్లు వేస్తున్నారని, కవితలోటు ఏడాదిన్నర కాలంగా జిల్లాలో స్పష్టంగా కనిపించిందన్నారు. ఉమ్మడి జిల్లాలోని స్ధానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా కవితకు మద్దతు తెలుపుతామని తనకు చెప్పారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 824 ఓట్లలో 90 శాతం ఓట్లు కవితకు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. మిత్రపక్షం ఎంఐఎం, స్వతంత్రులు, ఇతర పార్టీల వారి మద్దతు కూడా తమకు ఉందని చెప్పారు. మద్దతుగా వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పారు.పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను, రైతులను బాండ్లు పేపర్లు రాసిచ్చి మోసం చేసిన వ్యక్తిని గెలిపించి పొరపాటు చేసామని ఏడాది తర్వాత జిల్లా ప్రజలు గ్రహించారని, మాయమాటలకు మోసపోయామని పశ్చాత్తాపపడుతున్నారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కవిత గొప్ప మెజార్టీతో గెలువబోతుందని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఇద్దరి ఓట్లు కలిపి లెక్కించినా డిపాజిట్‌కు కావాల్సిన ఓట్లు రావని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*